రైతులు, సైనికులను కాపాడుకుంటేనే దేశం సుభిక్షం

ABN , First Publish Date - 2021-01-29T04:42:26+05:30 IST

ప్రజల ఆకలిని తీర్చేది రైతులయితే దేశాన్ని కాపాడేది సైనికులని, వారిద్దరినీ కాపాడుకుంటే దేశం సుభీక్షంగా ఉంటుందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

రైతులు, సైనికులను కాపాడుకుంటేనే దేశం సుభిక్షం
ఎత్తొండలో మాట్లాడుతున్న సభాపతి పోచారం

రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కోటగిరి, జనవరి 28:  ప్రజల ఆకలిని తీర్చేది రైతులయితే దేశాన్ని కాపాడేది సైనికులని, వారిద్దరినీ కాపాడుకుంటే దేశం సుభీక్షంగా ఉంటుందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ తోటలో గురువారం కోటగిరి, రుద్రూర్‌ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి రెండు మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులగురించి సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు అతిత్వరలో  చేరుకుంటాయన్నారు. రైతులకు జీవనాధారమైన నీటిని, కరెంటును ప్రభుత్వం అందించడం వల్ల పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాల్లో రైతులు సుమారు రూ.రెండు వేల కోట్ల పంటలను పండిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్ని ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కోటగిరి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌ పటేల్‌, ఎంపీపీ సునీత, ఏఎంసీ చైర్మన్‌ గంగాఽధర్‌, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ కిశోర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎజాజ్‌ ఖాన్‌, సర్పంచ్‌ సాయిబాబా, ఆయా  గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-29T04:42:26+05:30 IST