సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు

ABN , First Publish Date - 2021-06-22T07:03:28+05:30 IST

జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రజలకు చేసింది ఏమీలేదని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీలు చేస్తారని చెప్పి..

సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ

గత హామీలనే మరిచారు 

ఆకస్మిక తనిఖీలు అనుకుంటే.. టీఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశమయ్యారు 

కేసీఆర్‌ టూర్‌ బోకస్‌

కాళేశ్వరం 22వ ప్యాకేజీకి నిధుల మంజూరిపై మాట్లాడనే లేదు 

సీఎం సమావేశానికి పాసులు ఇవ్వలేదు : మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ధ్వజం

కామారెడ్డి, జూన్‌ 21: జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రజలకు చేసింది ఏమీలేదని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీలు చేస్తారని చెప్పి.. కేవలం టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మాట్లాడి వెళ్లారే తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. గతంలో ఇచ్చిన మెడికల్‌ కాలేజీ హామీని.. మరో ఏడాది వాయిదా వేసి వెళ్లారు కానీ, నిధుల మంజూరు గురించి ఉసేత్తలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే జిల్లాకు ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ కింద రూ.800 కోట్లు ఖర్చుపెట్టి 20, 21, 22వ ప్యాకేజీ పనులు చేపట్టామని అన్నారు. 22వ ప్యాకేజీ పనులు పూర్తిచేయాల్సి ఉండగా రీడిజైన్‌ పేరుతో పనులను నిలిపివేసి రూ.80 లక్షలు కూడా మంజూరు చేయకుండా పనులు ఆగిపోయేలా చేశారన్నారు. కాళేశ్వరం పేరుతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు 22వ ప్యాకేజీ కింద సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని, గత ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చిన కేసీఆర్‌ రెండేళ్లు గడిచినా.. ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా పనులు పూర్తిచేస్తామని చెప్పడం ప్రజలను, రైతాంగాన్ని మభ్యపెట్టడమేనన్నారు. 

అధికారులు కాళ్లు మొక్కిన దాఖలాలు లేవు

నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా కలెక్టర్‌ హోదాలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కిన దాఖలాలు లేవని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కొత్త సంప్రదాయానికి తెర లేపారన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ ముఖ్యమంత్రిని మూడుసార్లు వంగివంగి కాళ్లు మొక్కి కామారెడ్డి జిల్లా ప్రజల ను అవమానపరిచారని అన్నారు. కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీకి 35 శాతం ఓట్లు వస్తే, మిగితా పార్టీలకు 65 శాతం ఓట్లు వచ్చాయని, అలాంటి ప్రజలను అవ మానపరిచారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను సీఎం సమావేశానికి రాకుండా పాస్‌లు ఇవ్వలేదని అన్నారు. జర్నలిస్టులను సైతం రూంలో బం ధించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ప్రజలను విస్మరిస్తున్న కేసీఆర్‌ కు ప్రజలు తగినబుద్ది చెబుతారని అన్నారు. 

చెరువులో నీళ్లు ఉన్నాయనడం అర్థరహితం

బీబీపేట చెరువులో చుక్కనీరు లేక ముళ్లపోదలతో ఉంటే సీఎం మాత్రం బీబీపేట చెరువులో నీళ్లు మస్తు ఉన్నాయని పేర్కొనడం అర్థరహితమన్నారు. మెడిక ల్‌ కాలేజీని వచ్చే సంవత్సరం మంజూరు చేస్తామని పేర్కొనడం వల్ల మరో రెండు సంవత్సరాల కాలం మాత్రమే ఉందని, ఆలోగా ఎప్పుడు పూర్తిచేస్తారని ప్రశ్నించారు. గంట 20 నిమిషాల పాటు పిట్టకథలు చెప్పి సీఎం వెళ్లారే తప్ప, జిల్లా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చెప్పలేదని అన్నారు. కేవలం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కలిసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా పట్ల చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు.  ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, మాజీ సీడీసీ చైర్మన్‌ కారంగుల అశోక్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పండ్ల రాజు, కౌన్సిలర్‌లు కృష్ణమూర్తి, అన్వర్‌ హైమద్‌, నాయకులు రవిప్రసాద్‌, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T07:03:28+05:30 IST