వరి సాగుకే మొగ్గు

ABN , First Publish Date - 2021-12-19T06:55:15+05:30 IST

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు నిండుగా నీళ్లు ఉండడంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో వరిసాగును మొదలుపెట్టారు.

వరి సాగుకే మొగ్గు


ఉమ్మడి జిల్లాలో వరి నాట్లు వేస్తున్న అన్నదాతలు
బోధన్‌ డివిజన్‌ పరిధిలో మొదలైన యాసంగి పనులు
ఎక్కువగా సన్న రకాలపై దృష్టి
నీరు పుష్కలంగా ఉండడంతో వరి సాగే మేలంటున్న రైతులు

నిజామాబాద్‌, డిసెంబరు 18:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు నిండుగా నీళ్లు ఉండడంతో  రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో వరిసాగును మొదలుపెట్టారు. ఎత్తిపోతల పథకాల కింద ఎక్కువ మంది రైతులు నారుమడులను సిద్ధం చేశారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో వరి నాట్లను మొదలుపెట్టారు. కౌలు ఒప్పందం చేసుకున్న రైతులు కూడా వెనకడుగు వేయడంలేదు. ఒప్పందం ప్రకారం యాసంగిలోనే కౌలు ఇవ్వాల్సి ఉండడంతో వరిసాగే కొనసాగిస్తున్నారు. భూయజమానులతో చర్చిస్తూ సాగును మొదలుపెట్టారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనలు చేసిన రైతులు మాత్రం వేరే పంటలు ఎక్కువగా వేయడంలేదు. డిమాండ్‌ ఉన్న సన్న రకాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, గుత్ప అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలతో పాటు ఇతర రిజర్వాయర్‌ల ద్వారా ప్రతీ సీజన్‌లో ఐదున్నర లక్షల ఎకరాల వరకు వరిసాగవుతోంది. వానాకాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. యాసంగి సీజన్‌ మొదలుకావడంతో రైతులు వరినాట్లను మొదలుపెట్టారు. గడిచిన 15 రోజులుగా వర్ని, రుద్రూర్‌, కోటగిరి, మోస్రా, చందూర్‌, బీర్కూర్‌, నస్రూల్లాబాద్‌ మండలాల పరిధిలో వరినాట్లను వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నీటి సలహాబోర్డు సమావేశంలో ఆరుతడి పంటలతో పాటు ఇతర పంటలకు ఈ నెల నుంచే నీటి విడుదలను చేస్తామని నిర్ణయం తీసుకోవడంతో ఎక్కువ మంది రైతులు వరిసాగులో బిజీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టులలో నీళ్లు ఫుల్‌గా ఉన్నాయి. యాసంగి సాగుతో పాటు వచ్చే వానకాలం సాగు కూడా ఉపయోగపడేవిధంగా ఫుల్లు రిజర్వాయర్‌ లెవల్‌లో నీళ్లు ఉండడంతో ఈ సాగు కొనసాగిస్తున్నారు.
సన్నరకాల సాగు..
ఉమ్మడి జిల్లాలో వరిసాగు చేస్తున్న రైతులు ఎక్కువగా సన్న రకానికి మొగ్గుచూపుతున్నారు. యాసంగిలో దొడ్డు రకాలను ఎక్కువగా సాగుచేసి రైతులు ప్రభుత్వం కొనకున్న వ్యాపారులకు అమ్ముకునేందుకు సిద్ధంఅవుతున్నారు. సన్న రకాలు పండిస్తే వ్యాపారులకు అమ్మడంతో పాటు అవసరంమేరకు బియ్యం బయట అమ్ముకునే అవకాశం ఉండడంతో ఈ సాగును ఎక్కువగా చేస్తున్నారు. సన్న రకాలైన గంగాకావేరి, తెలంగాణసోనా, బీపీటీతో పాటు ఆర్‌ఎన్‌ఆర్‌, ఇతర రకాలను సాగుచేస్తున్నారు. పంట కొంత ఆలస్యంగా వచ్చిన దిగుబడి కూడా ఎక్కువగా ఉండనుండడంతో ముందస్తుగా వరినాట్లను వేస్తున్నారు. ప్రతీ సంవత్సరం నవంబరు నెలలోనే సాగు మొదలుపెట్టే బోధన్‌ డివిజన్‌ రైతులు ఈ దఫా కూడా అదే రీతిలో వరినాట్లను వేస్తున్నారు.
వెనకడుగు వేయని రైతాంగం..
యాసంగిలో వరిసాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగుచేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అన్ని గ్రామాల పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏయే పంటలు వేస్తే దిగుబడి ఉంటుందో రైతులకు వివరిస్తున్నారు. ఎక్కువగా విత్తనాలు అందుబాటులో ఉండకపోవడంతో మెజార్టీ రైతులు వరిసాగుకే మొగ్గుచూపుతున్నారు. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనలు చేసినా రైతులు వెనకడుగు వేయడంలేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్‌లు, చెరువులు నిండుగా నీళ్లు ఉండడం, భూగర్భ జలాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల వరిసాగును కొనసాగిస్తున్నారు.
తప్పని పరిస్థితి..
ఉమ్మడి జిల్లా పరిధిలో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ మంది తమకు ఉన్న కొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని చేస్తున్నారు. వానకాలంలో కౌలు ఒప్పందం చేసుకున్న రైతులు యాసంగిలో మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నారు. వానాకాలం ఎకరాకు 15బస్తాల వరకు ధాన్యం ఇచ్చేవిధంగా ఒప్పందం జరగగా ప్రస్తుతం యాసంగిలో ధాన్యం కొనే పరిస్థితి లేకపోవడంతో కొంతమంది రైతులుకౌలును రద్దు చేసుకుంటున్నారు. మరికొంతమంది రైతులు పది బస్తాల వరకు ఒప్పదం చేసుకుంటున్నారు. దీర్ఘకాలికంగా వరిపండిన భూముల్లో వేరే పంటలు పండే అవకాశం లేకపోవడం వల్ల వ్యవసాయ అధికారులు చెప్పిన తప్పనిపరిస్థితుల్లో వరిసాగును కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకున్న వ్యాపారులకు అమ్ముకునేందుకు సిద్ధం అవుతున్నారు. వేరే పంటలు పండే పరిస్థితి లేకపోవడం వల్ల వరిసాగు కొనసాగిస్తున్నామని రైతులు తెలిపారు. నీరు నిలిచి చౌడుగా మారిన భూముల్లో వరి పండే అవకాశం లేదని రైతులు వివరిస్తున్నారు. ప్రభుత్వమే చొరవచూపి యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


కౌలు ఒప్పందం వల్ల వరిసాగు..
- కొర్వ సాయిలు, రైతు, వర్ని
ఏళ్ల తరబడి వరిసాగు చేస్తున్నాం. ఈ ఏడాది కూడా మా భూమితో పాటు అదనంగా ఆరెకరాలు కౌలు కు తీసుకున్నాం. రెండింటిలోనూ వేరే పంటలు పండే పరిస్థితిలేక వరిసాగు చేస్తున్నాం. కౌలు కొంత తగ్గించాలని భూ యజమానులతో ఒప్పందం చేసుకు న్నాం. దొడ్డు రకాలకు బదులు సన్న రకాలు వేస్తున్నాం.

ధాన్యం కొనుగోలుకు చొరవచూపాలి..
- నీరడి సాయన్న, రైతు, లక్కంపల్లి
చుట్టూ నీళ్లు ఉన్నాయి. భూముల్లో వేరే పంట పండే పరిస్థితి లేదు. విధిలేని పరిస్థితిలో 15 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాం. యాసంగిలోనూ ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వం ప్రకటన చేసిన వేరే అవకాశం లేకపోవడం వల్ల ఈ పంట వేస్తున్నాం. ప్రభుత్వమే చొరవచూపి రైతులను ఆదుకోవాలి.

Updated Date - 2021-12-19T06:55:15+05:30 IST