అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌: కవిత

ABN , First Publish Date - 2021-12-08T06:46:12+05:30 IST

సీఎం కేసీఆర్‌ పట్టుదల, కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం జిల్లాలోని భీమ్‌గల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు.

అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌: కవిత

నిజామాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సీఎం కేసీఆర్‌ పట్టుదల, కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం జిల్లాలోని భీమ్‌గల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండుసార్లు ప్రజలు సహకరించడం వల్లే సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. పనిచేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు. అభివృద్ధి చేస్తున్న వారికి రాష్ట్ర ప్రజలు మున్ముందు కూడా సహకరించి మద్దతు ఇవ్వాలన్నారు. రాజకీయాల కోసం అనేక మంది.. అనేక రకాలుగా మాట్లాడుతున్నారని.. వారి మాటలను నమ్మొద్దన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం మరొకరిని చేయమంటే సాధ్యం కాదన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలతో అభివృద్ధి జరగదని, వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని కోరారు. త్వరలోనే భీమ్‌గల్‌ పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. 

ఫ ప్రతిపక్ష పార్టీల నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు : మంత్రి ప్రశాంత్‌రెడ్డి 

ప్రతిపక్ష పార్టీల నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఇక్కడిలాగా అమలు కావడం లేదన్నారు. ఆయా రాష్ట్రాల్లో.. అక్కడి ప్రభుత్వాలు.. మనలాగా సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు మాయమాటలు చెప్పే కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మొద్దన్నారు. 

నిరుద్యోగ భృతిని చెల్లించాలని యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన..

భీమ్‌గల్‌: పట్టణంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు తమ గొడును వినిపించుకునేందుకు బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు ఫ్లెక్సీలతో ఎదురువెళ్లారు. నిరుద్యోగ భృతిని చెల్లించాలని ఉద్యోగ నోటీఫికేషన్‌ జారీ చేయాలని నినాదాలు చేశారు. అయితే ఒక్కసారిగా కాంగ్రెస్‌ కార్యకర్తలు రావడంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2021-12-08T06:46:12+05:30 IST