సీజనల్‌ వ్యాధులపై సర్వే

ABN , First Publish Date - 2021-08-27T06:13:43+05:30 IST

గత కొద్దిరోజుల నుంచి జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ, మలేరియాతో పాటు సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ఎట్టకేలకు యంత్రాంగం రంగంలోకి దిగుతోంది.

సీజనల్‌ వ్యాధులపై సర్వే

జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నిరోధానికి యాక్షన్‌ప్లాన్‌ 

దోమల నియంత్రణపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు 

పలు శాఖల ఆధ్వర్యంలో నేటి నుంచి కార్యాచరణ షురూ 

నిర్మల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) :  గత కొద్దిరోజుల నుంచి జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ, మలేరియాతో పాటు సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ఎట్టకేలకు యంత్రాంగం రంగంలోకి దిగుతోంది. ఫ్లడ్‌పీవర్‌సర్వే పేరిట శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా పలు శాఖ లు రంగంలోకి దిగబోతున్నాయి. ముఖ్యంగా వైద్య,ఆరోగ్యశాఖతో పాటు మెప్మా, మహిళశిశుసంక్షేమశాఖ, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల సిబ్బందితో ఉమ్మడి యాక్షన్‌ప్లాన్‌ జిల్లావ్యాప్తంగా అమలు కాబోతోంది. ఇప్పటికే నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్‌లలోని కొన్ని జలప్రభావిత ప్రాంతాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా గుర్తించారు. మొదట ఈ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో జ్వరాలపై సర్వే చేపట్టి దోమల నివారణ కోసం ఇంటింటా అవగాహన కల్పించనున్నారు. అలాగే పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై కూడా దృష్టి కేంద్రీకరించబోతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ నేతృత్వంలో ఈ యాక్షన్‌ప్లాన్‌కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ జ్వరాల విస్తరణపై సీరియస్‌గా సమీక్ష జరిపి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలతో జనం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు డెంగ్యూ జ్వరాలు మరోవైపు మలేరియాతో పాటు ఇతర సీజనల్‌ వ్యాధులు జనాలను చుట్టుముట్టి వెంటాడుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూతో పాటు ఇతర సీజనల్‌వ్యాధులతో భాధపడుతున్న వారంతా ప్రైవేటు ఆసుపత్రుల్లో నిండిపోతున్నారు. ఎక్కడా చూసిన ప్రస్తుతం ఆసుపత్రులన్ని జ్వర భాధితులతో కిటకిటలాడుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితికి అధికారులు చెప్పిన లెక్కలకు పొంతన కుదరడం లేదు. కుప్పలు తెప్పలుగా జ్వరాలతో భాధపడుతున్న వారు కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం జ్వరాల బాధితులసంఖ్యను తక్కువగా చేసి చూపుతుండడం చర్చకు తావిస్తోంది. కరోనా తీవ్ర తగ్గుముఖం పడుతుందన్న సంతోషం డెంగ్యూరూపంలో ఆవిరైపోతోంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న జనాలకు డెంగ్యూ రూపంలో మళ్లీ ప్రమాదం చేరువయ్యింది. అధికారులు వర్షకాలానికి ముందు గానే అప్రమత్తమై ఉండి పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదంటున్నారు. దీనికి తోడుగా ఇటీవలే వరద జిల్లాను ముంచెత్తడంతో కూడా దోమలు, ఇతర క్రిమి కీటకాలు స్వైరవిహారం చేయడానికి ఆస్కారమిస్తోందంటున్నారు. జిల్లాలో ఏ ఇంటిని పలకరించిన జ్వర బాధితులే కనిపిస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్‌ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. సంబందిత వైద్య,ఆరోగ్యశాఖనే కాకుండా అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, మెప్మా సిబ్బందిని ఫ్లడ్‌ ఫీవర్‌ సర్వే కోసం వినియోగించబోతున్నారు. అయితే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే సర్వే నివేదికలపై కలెక్టర్‌ రోజు వారి సమీక్ష జరపబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది. 

నేటి నుంచి సీరియస్‌ యాక్షన్‌ ప్లాన్‌

శుక్రవారం నుంచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో చేపట్టబోతున్న ఫ్లడ్‌ ఫీవర్‌ సర్వే కొంత వరకైనా ప్రస్తుత పరిస్థితి తీవ్రతను తగ్గించవచ్చంటున్నారు. పలు శాఖల సిబ్బంది బృందాలుగా విడిపోయి ఈ సర్వేను నిర్వహించనున్నారు. సంబందిత సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ జ్వరాల తీవ్రతను పరిశీలించి దోమలు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన సూచనలను అందించనున్నారు. అయితే వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో సమన్వయం అవుతూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ఆలీఫారూఖీ ఎప్పటికప్పుడు స్పందిస్తుండడంతో అధికారులు అలర్ట్‌ అవుతున్నారు. 

హాట్‌స్పాట్‌ కేంద్రాల గుర్తింపు

కాగా జ్వరాలు తీవ్రంగా ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌ సెంటర్‌లుగా గుర్తించారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌, గాజులపేట్‌, వైఎస్‌ఆర్‌ కాలనీ, గుల్జార్‌ మార్కెట్‌, సోఫీనగర్‌లతో పాటు భైంసా, ఖానాపూర్‌లోని పలు వార్డులను కూడా హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా నిర్ధారించారు. ఈ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో డ్రైనేజీల్లో చెత్త చెదారంను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇళ్లల్లో మురికినీరు నిల్వలేకుండా చూడడంతో పాటు ఇతర చర్యలు చేపట్టనున్నారు. మొదట హాట్‌స్పాట్‌ ప్రాంతాలపై దృష్టి సారించి ఆ తరువాత మిగతాప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టబోతున్నారు. ఉద యం 7గంటల నుంచి సాయంత్రం వరకు సర్వేతో పాటు అవగాహన చర్యలు చేపట్టనున్నారు. 

వరద కారణంగానే

కాగా కొద్దిరోజుల క్రితం కురిసిన భారీవర్షాల కారణంగానే దోమల తీవ్రత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల మురికిగుంతల్లో నీరునిల్వ ఉండడం అలాగే చెత్త చెదారం కూడా పెరిగిపోవడంతో పాటు వాతావరణంలోని మార్పులు సైతం దోమల పెరుగుదలకు కారణమవుతున్నాయంటున్నారు. క్రమ క్రమంగా దోమల బెడద తీవ్రరూపం దాల్చడంతో డెంగ్యూ జ్వరాలు ఒక్కసారిగా విభృభించాయి. డెంగ్యూ జ్వరాలకు తోడుగా మలేరియా తో పాటు ఇతర వైరల్‌ జ్వరాలు పెరిగిపోతుండడం ఆందోళనకు కారణమవుతోంది. అయితే అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా దోమలు విస్తరించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మురికినీటికి అవకాశం ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం లాంటి చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-08-27T06:13:43+05:30 IST