పరిహారం కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-12-08T06:45:32+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మృతుల కుటుంబాలు పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల పరిహారం పొందడానికి అవస్థలు పడుతున్నారు. కొవిడ్‌ మృతుడికి సంబంధించి ఆధార్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు లేదా కొవిడ్‌ చికిత్స పొందిన ఆస్పత్రి డిశ్చార్జి పత్రం, కొవిడ్‌ కారణంగా మరణించినట్లుగా ఉన్న మరణ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు.

పరిహారం కోసం పడిగాపులు

జిల్లాలో 932 మంది కొవిడ్‌తో మృతి 

‘మీసేవ’ ద్వారా మృతుల కుటుంబ సభ్యుల దరఖాస్తు 

దరఖాస్తుల ఆధారంగా ఎక్స్‌గ్రేషియా మంజూరు  

ఇప్పటి వరకు 116 మందికి అందజేత 

బాధిత కుటుంబాలకు తప్పని ఎదురు చూపులు 

నిజామాబాద్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ మృతుల కుటుంబాలు పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల పరిహారం పొందడానికి అవస్థలు పడుతున్నారు. కొవిడ్‌ మృతుడికి సంబంధించి ఆధార్‌, ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు లేదా కొవిడ్‌ చికిత్స పొందిన ఆస్పత్రి డిశ్చార్జి పత్రం, కొవిడ్‌ కారణంగా మరణించినట్లుగా ఉన్న మరణ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. కరోనా బారిన పడి కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. సంపాదించేవారు లేక పూటగడవడానికి తిప్పలు పడుతున్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటన వెలువడడంతో కరోనా మృతుల కుటుంబాలు మీసేవల ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే కొంతమందికి ఎక్స్‌గ్రేషియాను మంజూరుచేయగా మరికొన్ని దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

ఇప్పటి వరకు 850 దరఖాస్తుల స్వీకరణ..

జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా మీసేవల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ మండలాల పరిధిలో నుంచి 850 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 116 మందికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. వారి బ్యాంకు ఖాతాలోని బడ్జెట్‌కు అనుగుణంగా డబ్బులను జమ చేయనున్నారు. మొదట దరఖాస్తులను ఆయా పీహెచ్‌సీల పరిధిలోని వివరాలను పరిశీలించి కలెక్టరేట్‌కు పంపిస్తున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని మెడికల్‌ అధికారులు పంపిన నివేదికల అనుగుణంగా జిల్లాస్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన ఉన్న కమిటీ దరఖాస్తులను మరోసారి పరిశీలించి మంజూరు చేస్తున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా అందేవిధంగా చూస్తున్నారు. కరోనాతో మృతిచెందినవారి దరఖాస్తుల పరిశీలనలో కరోనాకు సంబంధించి ర్యాపిడ్‌ టెస్టు లేదా ఆర్టీపీసీఆర్‌ సర్టిఫికెట్‌, స్కానింగ్‌ సర్టిఫికెట్‌, కేస్‌షీట్‌, ఏ4 నమోదు వంటి అంశాల్లో ఏది ఉన్నా పరిగణలోకి తీసుకుని మంజూరు చేస్తున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్నవారిలో జిల్లాలోని ఆసుపత్రులు, ఇళ్లలో చనిపోయిన వారితో పాటు చికిత్సకు వెళ్లి ఇతర జిల్లాలు, గాంధీ, హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చనిపోయిన వారి కుటుంబాల వారు ఈ దరఖాస్తు చేశారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 55,604 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా వీరిలో 932 మంది మృతి చెందారు. అలాగే ఇతర జిల్లాల పరిధిలో, హైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల్లో కరోనా బారినపడి జిల్లాకు చెందిన వారు మరికొంతమంది మృతిచెందారు. దీంతో వీరి కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఏడాదిగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ తమకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-12-08T06:45:32+05:30 IST