వైభవంగా ప్రారంభమైన శ్రావణమాస పూజలు

ABN , First Publish Date - 2021-08-10T06:38:15+05:30 IST

శివకేశవులకు ప్రీతికరమైన శ్రావణమాస పూజలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. విష్ణువు ఆలయాల్లో ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగగా.. శివాలయాల్లో మధ్యాహ్నం వరకు అభిషేకాలు జరిగాయి.

వైభవంగా ప్రారంభమైన శ్రావణమాస పూజలు
నగరంలోని నీలకంఠేశ్వరాలయానికి తరలివచ్చిన భక్తులు, గర్భగుడిలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

తొలిరోజు కిటకిటలాడిన ఆలయాలు 

కొవిడ్‌ నిబంధనలతో దర్శనాలు 

నెలరోజుల పాటు కొనసాగనున్న ప్రత్యేక పూజలు 

నిజామాబాద్‌ కల్చరల్‌, ఆగస్టు 9: శివకేశవులకు ప్రీతికరమైన శ్రావణమాస పూజలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. విష్ణువు ఆలయాల్లో ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగగా.. శివాలయాల్లో మధ్యాహ్నం వరకు అభిషేకాలు జరిగాయి. విష్ణువు ఆలయాల్లో స్వామికి అష్టోత్తర శతనామాలతో తులసి అర్చనలు నిర్వహించారు. శివాలయాల్లో స్వామికి ప్రీతికరమైన బిల్వాలతో భక్తులు అర్చించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో చల్లగా ఉండాలని వేడుకుంటూ దేవతలను దర్శించుకుని భక్తిని చాటుకున్నారు. తొలి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచి క్యూలైన్‌లో నిలబడి కొవిడ్‌ నిబంధనలతో స్వామిని దర్శించుకున్నారు. నెల రోజుల శ్రావణమాస పూజలు ఆలయాల్లో విశేషంగా కొనసాగనున్నాయి. జిల్లాకేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభులింగేశ్వర ఆలయం, భీంగల్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, పార్థీవ లింగేశ్వర ఆలయం, మనోకామేశ్వర ఆలయం, హమాల్‌వాడి సాయిసంతోషి ఆలయం, మాఽధవనగర్‌ సాయిబాబా ఆలయం, సారంగపూర్‌ హనుమాన్‌ ఆలయం, జెండా బాలాజీ మందిర్‌, గోల్‌హనుమాన్‌ దేవాలయాల్లో ఘనంగా శ్రావణమాస పూజలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధన లతో ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-08-10T06:38:15+05:30 IST