ఉత్కంఠకు తెర.. కవిత ఖరారు

ABN , First Publish Date - 2021-11-23T06:14:47+05:30 IST

ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కవితనా..? మాజీ ఎమ్మెల్సీ లలితనా..? అనే అనుమానాలు తొలిగిపోయాయి. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరునే ఖరారు చేసింది.

ఉత్కంఠకు తెర.. కవిత ఖరారు

‘స్థానిక సంస్థల’ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత

రాజ్యసభ ఊహాగానాలకు తెర 8 నేడు నామినేషన్‌ దాఖలు

హాజరు కానున్న మంత్రి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు

కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగనున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఎన్నికలకు దూరంగా బీజేపీ 

 ఏర్పాట్లలో అధికారులు బిజీ

ఇప్పటి వరకు దాఖలు కాని నామినేషన్లు

నిజామాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కవితనా..? మాజీ ఎమ్మెల్సీ లలితనా..? అనే అనుమానాలు తొలిగిపోయాయి. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరునే ఖరారు చేసింది. ఇప్పటి వరకు అన్ని జిల్లాల అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఉమ్మడి జిల్లా పరిధిలో కొంత సస్పెన్స్‌ ఉంచడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న కవిత రాజ్యసభ సభ్యురాలుగా వెళుతుందని ఊహాగానాలు వచ్చాయి. దీంతో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు కవితనే ఖరారు చేయడంతో క్యాడర్‌లో కొంత ఉత్సాహం నెలకొంది. సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో కవిత నామినేషన్‌ దాఖలుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ ఇంటి నుంచి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందించనున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గంప గోవర్ధన్‌, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, జీవన్‌రెడ్డి, షకిల్‌, సురేందర్‌, హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీలు వీజీగౌడ్‌, రాజేశ్వర్‌రావు, జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, దఫేదార్‌ శోభతో పాటు పార్టీ నేతలు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 825 మంది ఓటర్లు..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 825 మంది స్థానిక సంస్థల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు సభ్యులు మృత్యువాత పడగా ఒకరు డిస్‌క్వాలిఫై అయ్యారు. ఒక స్థానం ఎన్నిక జరగలేదు. మరొక ఓట రు అయిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పదవీకాలం పూర్తికావడంతో ప్రస్తుతం 820 ఓటర్లు ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి ఓటరుగా నమోదు చేసుకుంటే 821కి చేరనుంది. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 29 ఓట్లు నమోదుకాగా, బీజేపీ అభ్యర్థికి 58 ఓట్లు వచ్చాయి. మిగతా 736 ఓట్లు కవితకు వచ్చాయి.

కాగా, సీఎం కూతురు అయిన కల్వకుంట్ల కవిత 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా పనిచేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో  ఎవరూ ఊహించని విధంగా పరాజయం పాలయ్యా రు. ఆతర్వాత ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గత సంవత్సరం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. ప్రస్తుతం మళ్లీ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితకు మళ్లీ అవకాశం ఇవ్వడంతో ఆమె గెలుపు నల్లేరుమీద నడకే  అని ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

ఎమ్మెల్సీ కవితకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మళ్లీ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌ తెలిపారు. కవిత ఎమ్మెల్సీగా ఉండడం వల్ల ఉమ్మడి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఉమ్మడి జిల్లా మరింత అభివృద్ధి చెందుతున్నారు. కవిత పోటీతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో మరింత ఉత్సాహం పెరిగిందని వారు పేర్కొన్నారు.

బరిలోకి కాంగ్రెస్‌..

కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగనుంది. మొదటగా ఆర్మూర్‌కు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ పోటీకి దిగుతాడని భావించినప్పటికీ.. సోమవారం రాత్రి అనూహ్యంగా జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేరును ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కవితకు గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు మహేష్‌ని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దించినట్లు విశ్వసనీయ సమాచారం.

పోటీకి దూరంగా బీజేపీ..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడంలేదు. రాష్ట్రస్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఎవరు పోటీ చేయడం లేదు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగుతున్న తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో పార్టీకి తగినంతగా సభ్యులు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గ్రామాల్లో తక్కువ ప్రాతినిథ్యం ఉండడం, మున్సిపల్‌లో కొన్నిచోట్ల ప్రాతినిథ్యం ఉన్నా పోటీపడేంత లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఏర్పాట్లలో అధికార యంత్రాంగం బిజీ..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లకు గడువు ఒకేరోజు ఉండడంతో యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వారం రోజుల్లో ఒక్క నామినేషన్‌ రాకున్నా చివరి రోజు దాఖలు కానుండడంతో ముందస్తుగా ఏర్పాట్లను చేస్తున్నారు. బ్యాలెట్‌ బాక్సులను కలెక్టరేట్‌ నుంచి పాలిటెక్నిక్‌కు తరలించారు. అక్కడ నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. చివరి రోజు మంగళవారం వచ్చే నామినేషన్‌లను బట్టి మిగతా ఏర్పాట్లను చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒక విడత ఉద్యోగులకు ఈ పోలింగ్‌పై శిక్షణ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు. పూర్తిస్థాయిలో నామినేషన్‌లు దాఖలు కాగానే విత్‌డ్రా తర్వాత బ్యాలెట్‌ పేపర్లను ముద్రించి ఎన్నికలను డిసెంబరు 10న నిర్వహించనున్నారు. కాగా, వారం రోజుల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని కలెక్టర్‌, రిటర్నిగ్‌ అధికారి నారాయణరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. మోడల్‌ కోడ్‌ను పూర్తిస్థాయిలో ఉమ్మడి జిల్లాలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-23T06:14:47+05:30 IST