ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం

ABN , First Publish Date - 2021-10-21T04:52:00+05:30 IST

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకై అధికార యంత్రాంగం సిద్ధమైంది. వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశారు.

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
ధాన్యం కొనుగోలు చేస్తున్న దృశ్యాలు (ఫైల్‌)

- నేడు కొనుగోళ్ల కోసం అధికారులతో సమీక్షించనున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
- రేపటి నుంచి జిల్లాలో ప్రారంభంకానున్న కొనుగోలు కేంద్రాలు
- కొనుగోళ్లకై 7 క్లస్టర్‌లుగా విభజించిన అధికారులు
- జిల్లాలో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు చేయనున్న అధికారులు
-  మొత్తం 343 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- 1.50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 90 లక్షలు
- కొనుగోలు చేసిన ధాన్యాన్ని 165 రైస్‌మిల్లులకు కేటాయింపు


కామారెడ్డి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకై అధికార యంత్రాంగం సిద్ధమైంది. వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి సంబంధిత శాఖలైన సివిల్‌ సప్లయ్‌, సహకారశాఖ, మార్కెటింగ్‌, రెవెన్యూ, ఐకేపీ శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరుసటి రోజు నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నాయి. ఇకపై ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయబోదని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పండించిన పంటను ఎవరు కొంటారనేదానిపై తర్జనభర్జన పడుతూ వచ్చారు. ఎట్టకేలకు వానాకాలం సీజన్‌ పంటను కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించడం జిల్లా అధికారులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయడంతో రైతుల్లో సందిగ్ధత వీడింది. జిల్లాలో వానాకాలంలో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 343 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాళ్లకు రూ.1,960, బీ గ్రేడ్‌ క్వింటాలుకు రూ.1,940 చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. 17 శాతం తేమ ఉన్న వడ్లనే కొనుగోలు చేయనున్నారు. అవసరమైన గన్నీ బ్యాగులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఇతర సౌకర్యాలను కేంద్రాల వద్ద కలిపించనున్నారు.
కొనుగోళ్ల లక్ష్యం 6 లక్షల మెట్రిక్‌ టన్నులు
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2.47 లక్షల ఎకరాలకు పైగానే రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాలువ దిగువన నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రూల్లాబాద్‌, పోచారం ప్రాజెక్ట్‌ కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతో పాటు కామారెడ్డి, దోమకొండ, లింగంపేట, భిక్కనూర్‌, దోమకొండ, గాంధారి తదితర మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు కావడం ఇదే మొదటిసారి. ఈ లెక్కన 6.80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సన్నరకం ధాన్యం 2 లక్షల మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు రానుందని అంచనా వేశారు.
343 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ఈ వానాకాలంలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 343 కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో ఏర్పడ్డ ఇబ్బందులు, సమస్యలు అనుభావాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనగా మొత్తం 343 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ నిర్ణయించారు. 312 పీఏసీఎస్‌లు, 21 ఐకేపీ, 10 మార్కెటింగ్‌ కమిటీల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి ధాన్యం సేకరణకు 1 కోటి 50 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే 90 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీక్లీనర్‌, తేమశాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ కాంటలు, గన్నీ సంచులు సిద్ధం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.
ధాన్యం తరలింపునకు 7 క్లస్టర్‌ల ఏర్పాటు
జిల్లాలో గతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ ఇబ్బందులు తలెత్తుతుండడంతో ఈ అనుభావాలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నుంచి ధాన్యాన్ని తరలించేందుకు క్లస్టర్‌లుగా విభజించారు. గత వానాకాలం, యాసంగి సీజన్‌లో 5 క్లస్టర్‌లను ఏర్పాటు చేయగా ఈ వానాకాలం సీజన్‌లో మాత్రం 7 క్లస్టర్‌లుగా విభజించి ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా మిల్లులకు ధాన్యాన్ని తరలించనున్నారు. మొదటి క్లస్టర్‌లో బాన్సువాడ, నస్రూల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాలు ఉండగా రెండో  క్లస్టర్‌లో జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌, మూడో క్లస్టర్‌లో పిట్లం, నిజాంసాగర్‌, నాలుగో క్లస్టర్‌లో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, ఐదో క్లస్టర్‌లో గాంధారి, సదాశివనగర్‌, రామారెడ్డి, ఆరో క్లస్టర్‌లో కామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, రాజంపేట, ఏడో క్లస్టర్‌లో దోమకొండ, బీబీపేట, భిక్కనూర్‌ మండలాలను ఉంచారు. ఇక్కడ నుంచి ప్రతీరోజు 250-350 లారీల ద్వారా వరి ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించనున్నారు. కోనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో 165 రైస్‌మిల్లులకు కేటాయించారు.

Updated Date - 2021-10-21T04:52:00+05:30 IST