పోడు కదలిక

ABN , First Publish Date - 2021-11-09T06:15:43+05:30 IST

జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూములకు మోక్షం లభించనుంది. గ్రామస్థాయిలో పోడు భూములకు హక్కులు క ల్పించేందుకు అటవీ గ్రామాల్లో కమిటీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

పోడు కదలిక

జిల్లాలో పోడు భూముల సాగుపై మొదలైన కదలిక 

అటవీ హక్కుల కమిటీ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

గ్రామాల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు

పోడు భూములపై సర్వే అనంతరం ప్రభుత్వ నిర్ణయం 

నిజామాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూములకు మోక్షం లభించనుంది. గ్రామస్థాయిలో పోడు భూములకు హక్కులు క ల్పించేందుకు అటవీ గ్రామాల్లో కమిటీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. భూములకు హక్కులు కల్పించేందుకు దరఖాస్తులను ఇస్తున్నారు. గ్రామ అటవీ హక్కుల కమిటీ ద్వారా దరఖాస్తులను తీసుకుని వాస్తవాల ఆధారంగా సాగు చేసుకున్నవారికి హక్కులు కల్పించేందుకు నిర్ణయించారు. అర్హులైన వారి భూములను సర్వే నిర్వహించి హక్కులను కల్పించనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా కమిటీలో ఫిర్యా దు చేసుకునేందుకూ అవకాశం కల్పించారు.

గ్రామాల్లో పోడుపై అవగాహన..

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో పోడు భూములపై అవగాహన కల్పిస్తున్నారు. పోడు భూములను సాగు చేసే వారికి అటవీ హక్కుల ప్రకారం వివరించడంతో పాటు చట్టం ప్రకారం ఆ భూములపై హక్కును కల్పించేందుకు చర్యలను చేపట్టారు. జిల్లా లో 18 మండలాల పరిధిలో 135 గ్రామాల్లో ఈ అవగాహన సదస్సులను మొదలుపెట్టా రు. జిల్లాలో 135 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 195 గ్రామాల్లో ఈ పొడు వ్యవసాయం జరుగుతుంది. సుమారు 14వేల ఎకరాల వరకు పొడు భూములు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో వైఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో పోడు భూములపై హక్కులను కల్పించారు. ఆ తర్వాత మళ్లీ ఎవరికి ఈ భూములపైన ఫారెస్టు హక్కుల ప్రకారం కేటాయింపులను చేయలేదు. అప్పటి నుంచి వేలాది ఎకరాల్లో పొడు కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లా ల పోడు రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందే గ్రామ అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లో 10 మంది నుంచి 15 మంది వరకు అవకాశం కల్పించారు. వీటిలో తప్పనిసరిగా ముగ్గురు గిరిజనులు ఉండేవిధంగా చూశారు. ఈ కమిటీలో ముగ్గురు మహిళలు తప్పనిసరిగా ఉండేవిధంగా నిబంధనలో పొం దుపర్చారు. అదేవిధంగా గ్రామస్థాయిలో ఈ కమిటీలను వేశారు. ఇవేకాకుండా రెవెన్యూ గ్రామాల పరిధిలో సర్పంచ్‌, గ్రామ కార్యదర్శితో పాటు మరో ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్‌, ఎఫ్‌ఆర్‌వో, సర్వే అధికారితో పాటు ముగ్గురు సభ్యులకు అవకాశం కల్పించారు. వీరిలో ఎంపీటీసీ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వడంతో పాటు తప్పనిసరిగా ఒకరు గిరిజన సభ్యులు ఉండేవిధంగా చూశారు. డివిజన్‌స్థాయిలో ఆర్‌డీవో, డివిజనల్‌ ఫారెస్టు అధికారి, గిరిజనశాఖ అధికారితో పాటు ముగ్గురు సభ్యులకు అవకాశం ఇచ్చారు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా అటవీ అఽధికారి, జిల్లా గిరిజన అధికారి కార్యదర్శిగా మరో ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఎస్టీకి చెందిన జడ్పీటీసీకి అవకాశం కల్పించారు.

రైతుల సమక్షంలోనే నిర్ణయం..

జిల్లాలో మూడు రోజుల పాటు ఆయా గ్రామాల పరిధిలో అవగాహన కల్పించి రైతులకు దరఖాస్తులను అందిస్తారు. పోడు భూములు సాగు చేస్తున్న రైతుల ద్వారా ఫాం-1 అటవీ హక్కుల వ్యక్తిగత అర్జీపత్రంలో అన్ని వివరాలను ఆధార్‌తో సహా పొందుపరుస్తారు. మూడు రోజుల పాటు ఈ దరఖాస్తులన్నీ రైతులతో నింపి అటవీ హక్కుల కమిటీ వద్ద ఉంచుతారు. రెండో దఫా పొడు భూములు ఉన్న గ్రామాల పరిధిలో గ్రామ సభలు నిర్వహిస్తా రు. సాగు చేస్తున్న రైతుల సమక్షంలోనే నిర్ణయం తీసుకుంటారు. మరో దఫా సమావేశం నిర్వహించి పొడు భూములను సర్వే చేస్తారు. ఆ సర్వే ఆధా రంగా సాగు చేస్తున్న రైతులకు హక్కులను కల్పిస్తారు. గ్రామసభలో, సర్వేలో కానీ తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే పోడు చేస్తున్న రైతులకు అప్పిల్‌ చేసుకునేందుకు మండల, డివిజన్‌, జిల్లాస్థాయి కమిటీల్లో అవకాశం కల్పించారు. ఈ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా హక్కులను కల్పిస్తారు. 

నిబంధనల ప్రకారం నిర్ణయం..

నాగారావు, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అఽధికారి 

జిల్లాలో అటవీ హక్కుల కమిటీ ద్వారా పొడు చేస్తున్న రైతుల నుంచి దరఖాస్తులను తీసుకుంటాం. అనంతరం రెండో దఫా గ్రామసభ నిర్వహిస్తాం. గ్రామసభ తీర్మానాలకు అనుగుణంగా పోడు భూములపై సర్వే నిర్వహించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. ఈ మూడు రోజులు అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తులన్నీ పూర్తిచేస్తాం.

Updated Date - 2021-11-09T06:15:43+05:30 IST