శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-02T06:35:14+05:30 IST

శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలలో పడిన వర్షాలతో భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 55,680 క్యూసెక్కుల వరద కొనసాగుతుండడంతో 19 గేట్లను ఎత్తి 59,280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకికి విడుదల చేస్తున్నారు.

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
ప్రాజెక్టు గేట్ల ద్వారా గోదావరిలోకి విడుదల అవుతున్న మిగులు నీరు

ఎస్సారెస్సీ 19 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

నిజామాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మెండోరా: శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలలో పడిన వర్షాలతో భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు 55,680 క్యూసెక్కుల వరద కొనసాగుతుండడంతో 19 గేట్లను ఎత్తి 59,280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు వచ్చే వరద ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌ దిగువన ఉన్న జిల్లాల వారిని అప్రమత్తం చేయడంతో పాటు నీటి విడుదల అయ్యేంత వరకు గోదావరి వెంట ఎవరూ వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మహారాష్ట్రలో ప్రాజెక్టులన్ని నిండి ఉండడం, అక్కడ వర్షాలు ఎక్కువగా పడడంతో దిగువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. నాందేడ్‌ జిల్లా పరిధిలోని విష్ణుపురి, బాలేగాంతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లను ఎత్తి గోదావరికి విడుదల చేస్తున్నారు. ఈ వరదతో పాటు నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు భారీగా పడడంతో ఈ వరద కూడా ప్రాజెక్టుకు వస్తుండడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. మంజీరాతో పాటు నిర్మల్‌ జిల్లాలోని గడ్డెన్న వాగు నుంచి ఈ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను 1090.7 అడుగుల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 90 టీఎంసీలకు గాను 88.662 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. పైనుంచి వచ్చే వరద ఆధారంగా పూర్తిస్థాయి కెపాసిటీలో నీటిని ఉంచుతూనే ప్రాజెక్టు నుంచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు కూడా కాకతీయ కాల్వ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఎస్కేప్‌ గేటు ద్వారా ఐదు వేల క్యూ సెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. మరో రెండు రోజు ల పాటు వరద వచ్చే అవకాశం ఉండడంతో ఈ నీటి వి డుదల దిగువకు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి, ఏఈ వంశీలు తెలిపారు. వరద తగ్గితే గేట్లను మూసివేసి సాగెనీటి విడుదల కొనసాగిస్తామని తెలిపారు.

Updated Date - 2021-09-02T06:35:14+05:30 IST