నిజామాబాద్‌ పసుపునకు దేశవ్యాప్త డిమాండ్‌

ABN , First Publish Date - 2021-11-23T06:16:06+05:30 IST

జిల్లాలో సాగు చేసే పసుపునకు దేశవ్యాప్తంగా డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

నిజామాబాద్‌ పసుపునకు దేశవ్యాప్త డిమాండ్‌

  నిజామాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో సాగు చేసే పసుపునకు దేశవ్యాప్తంగా డిమాండ్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పసుపు రైతులకు మరింత డిమాండ్‌ వచ్చేందుకు రవాణా కోసం పలు గూడ్స్‌ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సోమవారం వేల్పూర్‌ మండలం లక్కోరలో పసుపు పంట సాగు ఎగుమతులు, మార్కెటింగ్‌ లింకేజీపై స్పైసెస్‌బోర్డు రైల్వే అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు ఎగుమతులకు, సాగుకు కేంద్ర ప్రభుత్వం పలురకాల రాయితీలను ఇస్తుందన్నారు. పసుపు రైతులు సేంద్రియ సాగుపైన దృష్టిపెట్టాలన్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా పసుపు రైతులకు మార్కెటింగ్‌పై శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక వంగడాల సాగులో ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పసుపు సాగులో మార్పులు తీసుకురావాలన్నారు.

ఫ పసుపు సాగుపై రైతులకు అవగాహన..

పసుపునకు ధర రావాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో స్పైసెస్‌బోర్డు, నాబార్డ్‌ అధికారులు సమావేశంలో రైతులకు వివరించారు. ఖర్క్‌మిన్‌ శాతం ఎక్కువగా ఉండే రకాలను ఏవిధంగా సాగు చేయవచ్చోనని వారు రైతులకు వివరించారు. పసుపు సేంద్రియ సాగుతో నాబార్డు ద్వారా రూ.2 కోట్ల వరకు క్రెడిట్‌ గ్యారంటీ స్కీంను అమలు చేస్తున్నట్లు నాబార్డు అధికారులు తెలిపారు. రైతు పసుపు ఎగుమతుల కోసం నిజామాబాద్‌ నుంచి సాంగ్లీ వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్‌ వివరాలను రైల్వే అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్‌ బోర్డు డిప్యూటీ డైరెక్టర్‌ సుందరేశన్‌, టర్మరిక్‌ రిసర్చ్‌స్టేషన్‌ హెడ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ మహేం దర్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జాన్‌బెనహర్‌, రైల్వే అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T06:16:06+05:30 IST