జిల్లాలో భక్తిప్రపత్తులతో మొహర్రం

ABN , First Publish Date - 2021-08-20T05:30:00+05:30 IST

ముస్లింలు పరమపవిత్రంగా భావించే మొహర్రాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు దర్గాల వద్ద మొహర్రం ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లీంలు పీరీలకు

జిల్లాలో భక్తిప్రపత్తులతో మొహర్రం
ముప్కాల్‌లో పీరీల వద్ద పూజలు చేస్తున్న భక్తులు

నిజామాబాద్‌ కల్చరల్‌, ఆగస్టు 20: ముస్లింలు పరమపవిత్రంగా భావించే మొహర్రాన్ని భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు దర్గాల వద్ద మొహర్రం ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లీంలు పీరీలకు ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం ప్రజల దర్శించుకునేవిదంగా పీరీల గుండా ఊరేగించారు. పీరీలకు భక్తులు కుడకల పేర్లు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాకేంద్రంలోని దర్గాలతో పాటు గ్రామాల్లోని దర్గాల వద్ద ఏర్పాటు చేసిన పీరీలను దర్శించుకోడానికి ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. పీరిలను భక్తుల దర్శనార్థం ఉదయం నుంచి రాత్రి వరకు ఉంచి పూజలు చేశారు. 

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ మండలంలో మొహర్రం పండుగను ముస్లింలు భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. ఉదయమే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందంగా ముస్తాబు చేసిన పీరీలను దర్గాల వద్ద ఉంచి, ఆ తర్వాత గ్రామాల్లోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.  

ఇందల్‌వాయి: మండలంలోని సిర్నపల్లి గ్రామంలో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు దూదిపీర్లను ప్రధానవీధులగుండా ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.  

పెర్కిట్‌: ఆర్మూర్‌లోని పెద్దబజార్‌ సూర్యవంశ అరెకటిక సంఘం ఆధ్వర్యంలో మొహర్రం సందర్భంగా గత వారం రోజులుగా ఉత్సవాలను భక్తులు ఘనంగా జ రుపుకున్నారు. కాగా, మొహర్రం సందర్భంగా భక్తులు మలిదా, కొబ్బరికాయాలు బెల్లంతో మొక్కులు చెల్లించారు. పీరీల ఊరేగింపు ఘనంగా సాగింది.  

జక్రాన్‌పల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లో మొహర్రం పండగను ముస్లిం పెద్దలు, ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జక్రాన్‌పల్లి, అర్గుల్‌, లక్ష్మాపూర్‌, తదితర గ్రామాల్లో పీరీలను ఊరేగింపు నిర్వహించారు.  

వేల్పూర్‌: మహమ్మద్‌ ప్రవక్త మనవడు అజరాత్‌ ఇమ్రాన్‌ హుస్సెన్‌ జెండాను స్మరించుకుంటూ ముస్లింలు నిర్వహించుకునే వేడుకను మొహర్రం పండగను జరుపుకుంటారు. వేల్పూర్‌, మోతె, పచ్చలనడ్కుడ, పడిగెల్‌, అంక్సాపూర్‌, లక్కోర, సాహెబ్‌పేట్‌ గ్రామాలలో మొహర్రం ఘనంగా జరుపుకున్నారు. 

ముప్కాల్‌: మండలంలోని పలు గ్రామాల్లో మొహర్రం పండుగను ఘనంగా జరుపుకున్నారు. కులమతలకు అతీతంగా హిందూ, ముస్లింలు పది రోజుల పాటు జరుపకుంటున్న పీరీలను శుక్రవారం నిమజ్జనం చేశారు.  

బోధన్‌: బోధన్‌లో శుక్రవారం మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన పాయసం పంపిణీ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.  

ఎడపల్లి: విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా మొహర్రం పండుగను పురస్కరించుకుని పీర్ల పండుగ వేడుకలను మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో పీర్లను ఎత్తుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అందరూ ఈ పీరీల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T05:30:00+05:30 IST