జ్ఞాప‘కాలం’

ABN , First Publish Date - 2021-12-31T07:14:38+05:30 IST

ఈ సంవత్సరం కొవిడ్‌ మహమ్మారి జిల్లాను వణికించింది. ప్రజల బతుకు చిత్రాన్ని చిన్నాభిన్నం చేసింది. వేలాది మందిని చావు అంచులదాక తీసుకెళ్లింది. ఈ కొవిడ్‌ వల్ల జిల్లాలో వందలాది మంది మృత్యువాత పడ్డారు. వ్యవసాయ, వాణిజ్య, వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిస్తంభన ఏర్పడింది.

జ్ఞాప‘కాలం’

జిల్లాను ఈ ఏడాది అతలాకుతలం చేసిన కరోనా

కొవిడ్‌తో దెబ్బతిన్న అన్ని రంగాలు

జిల్లా ప్రజలను ఆదుకున్న వ్యవసాయ రంగం

జిల్లాలో జోన్‌ల ఆధారంగా  మొదలైన ఉద్యోగుల బదిలీలు

నిజామాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఈ సంవత్సరం కొవిడ్‌ మహమ్మారి జిల్లాను వణికించింది. ప్రజల బతుకు చిత్రాన్ని చిన్నాభిన్నం చేసింది. వేలాది మందిని చావు అంచులదాక తీసుకెళ్లింది. ఈ కొవిడ్‌ వల్ల జిల్లాలో వందలాది మంది మృత్యువాత పడ్డారు. వ్యవసాయ, వాణిజ్య, వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిస్తంభన ఏర్పడింది. వేలాది మంది ఉపాధి కోల్పోగా చివరకు వ్యవసాయమే అందరిని ఆదుకుంది. ఆరంభం నుంచి సంవత్సరం మధ్య వరకు కొవిడ్‌ వణికించగా ఇప్పుడిప్పుడే తేరుకున్న జిల్లా కోలుకుంటుంది. జిల్లాలో ఈఏడాదిలో పలుమార్పులు సంభవించాయి. రాజకీయంగా మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు పదవులను చేజిక్కించుకున్నారు. పరిశ్రమలు, వ్యాపారం ఆరంభంలో దెబ్బతినగా ఇప్పుడిప్పుడే కొద్దిగా లాభాల బాట పడుతున్నాయి. విద్యారంగం కరోనాతో దెబ్బతినగా పలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. గ్రామాల్లో వ్యవసాయం, ఉపాధి పథకాలే ఎక్కువ మందిని ఆదుకుంటున్నాయి. ఈ సంవత్సరం చివరలో కొత్త జోన్‌లు అమలులోకి రావడంతో జిల్లాలో ఉద్యోగులు పెద్దఎత్తున బదిలీ అవుతున్నారు. వేలాలు బాగా వేశాయి. మొత్తంగా జిల్లా కరోనా సవాళ్లను తప్పుకుని భవిష్యత్తుపై ఆశతో ముందుకుపోతుంది.

ఫ కరోనా ప్రభావం..

జిల్లాను రెండో విడత కరోనా ఎఫెక్ట్‌ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. కరోనా వ్యాప్తి అంతటా ఉండడం తో మూడు నెలల పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. జనవరి నుంచి జూలై వరకు వేలాది కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌, మే నెలలో జిల్లాలోని ఆసుపత్రిలోను బెడ్స్‌ దొరకని పరిస్థితి ఏర్పడింది. మందుల నుంచి ఆకి ్సజన్‌ వరకు అందని పరిస్థితి ఏర్పడిది.. కరోనాతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. జిల్లాలో అధికారికంగా 932 మంది మృత్యువాత పడ్డారని ప్రకటించిన హైదరాబాద్‌తో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఇంకా ఎక్కువ మందే చనిపోయారు. జిల్లాలో ఈ యేడాది 57,570 కరోనా కేసులు నమోదయ్యాయి.  జిల్లాలో వ్యాక్సినేషన్‌ 16లక్షల 32వేల 754 డోసులను వేశారు. జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన వారిలో 94శాతం మందికి మొదటి విడత వ్యాక్సినేషన్‌ చేశారు.

ఫ విద్యారంగం..

జిల్లాలో కరోనాతో విద్యారంగం దెబ్బతింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఏవి నడవలేదు. పాఠశాలలో తరగతుల నిర్వహణ జరగలేదు. విశ్వవిద్యాలయం పరిధిలో ఆన్‌లైన్‌ తరగతులే దిక్కయ్యాయి. చివరకు సాంకేతిక కళాశాలలు కూడా నడవలేదు. రెండో విడత వల్ల సుమారు 8 నెలల పాటు విద్యార్థులు తరగతులకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌తరగతులకు మాత్రమే పరిమితమయ్యారు. కరోనాతో పాఠశాలలు, కళాశాలలు మూతపడడం వల్ల ప్రత్యక్ష బోధన జరగలేదు. కరోనా ప్రభావం ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులపై పడడం భారీగా ఫెయిల్‌ అయ్యారు. కరోనా వల్ల పది, 12 తరగతులకు నేరుగా పాస్‌ చేయడంతో బయటపడ్డారు. 

ఫ వ్యవసాయం..

కరోనా వల్ల వ్యవసాయ రంగంపై కొంత ప్రభావం ఉన్న ఎక్కువగా దెబ్బతినలేదు. జిల్లాలోని వారిని వ్యవసాయమే ఆదుకుంది. ఇతర ప్రాంతాలలో పనిచేస్తూ జిల్లాకు వచ్చిన వారిని వ్యవసాయమే ఆదుకుంది. జిల్లాలో ఈ యేడు అధిక వర్షాలు పడడంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. కరోనా వల్ల ఆరంభంలో కొంత ఇబ్బందులు ఏర్పడిన సంవత్సరం చివరి నాటికి కోలుకుంది. ఎప్పుడు లేనంతగా వరిసాగు పెరిగింది. ఇతర పంటలు కూడా ఎక్కువగా వేశారు. ఇప్పటి వరకు పట్టణాలలో తాత్కాలిక ఉద్యోగాలు చేసిన వారు తిరిగివచ్చి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఈ యేడాది పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం అనడంతో పంట చేను వద్దనే ఉండి పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు వరిసాగు చేస్తున్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందులు మొదలుకానున్నాయి. ఈ సంవత్సరం భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను మూడు నెలల పాటు తెరచి ఉంచారు. జిల్లాలో గడిచిన దశాబ్దకాలంలో ఎప్పుడుపడనంత భారీ వర్షం పడింది.అన్ని వాగులు పొంగడంతోపాటు చెరువులు నిండాయి. రిజర్వాయర్‌లతో పాటు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. 

ఫ రాజకీయం..

జిల్లాలో కొవిడ్‌ ప్రభావంతో సంవత్సరం ఆరంభంలో అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు స్తబ్దంగానే ఉన్నారు. కొవిడ్‌ ప్రభావం ఉన్న సమయంలో కొంత ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నం చేసినా గడిచిన నాలుగు నెలలుగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రజలలో ఉండేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం చివరలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్‌ పదవి వచ్చిం ది. జిల్లాకు చెందిన ఆకుల లలిత జూన్‌లో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తికాగా డిసెంబరులో రాష్ట్రమహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి ఈ యేడాది మధ్యలో మహేష్‌కుమార్‌గౌడ్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. వివిధ పార్టీలలో మార్పులు, చేర్పులు జరగగా అన్ని పార్టీల కమిటీలు వేయడం, సభ్యత్వ నమోదును చేపట్టారు.

ఫ దెబ్బతిన్న వ్యాపారం..

ఈ యేడాది కరోనా వల్ల వ్యాపారరంగం భారీగా దెబ్బతింది. కరోనాతో పాటు లాక్‌డౌన్‌ విధించడంతో నిత్యవసర దుకాణాలు మినహా ఏవీ నడవలేదు. సంవత్సర ఆరంభం నుంచి జూన్‌ చివరి వరకు నామమాత్రంగానే నడిచాయి. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, నిత్యవసర వస్తువుల దుకాణాలు మినహా మిగతావన్నీ దెబ్బతిన్నాయి. నష్టాల భారీన పడ్డాయి. జూలై నుంచి కొద్ది కొద్దిగా పుంజుకుని సంవత్సరం చివరినాటికి మళ్లీ పుంజుకున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వ్యాపారులతో పాటు పనిచేసే వారికి కూడా ఉపాధి దొరకక ఇబ్బందులు పడ్డారు. కరోనావ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత పుంజుకుంటున్నాయి. కరోనా తో పాటు మేస్త్రీలకు పని దొరకలేదు.   

ఫ ఉద్యోగుల బదిలీలు ..

కరోనా సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, పోలీస్‌, మున్సి పల్‌, రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇతర శాఖల ఉద్యోగులు కీలకంగా పనిచేశారు. కరోనాతో పలువురు ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. సంవత్సరం చివరలో మాత్రం ఎక్కువ మంది ఉద్యోగులు బదిలీ అవుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా అదనపు కలెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి చిత్రమిశ్రా చేరారు. ఉమ్మడి ప్రిన్సిపాల్‌ అండ్‌ డిస్ర్టిక్ట్‌ సెషన్స్‌ జడ్జీగా పనిచేసిన శ్రీసుధ బదిలీకాగా ఆమె స్థానంలో సునీత కుంచాల బాధ్యతలను చేపట్టారు. ఈ నెల చివరి వారంలో నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ బదిలీకాగా ఆయన స్థానంలో కేఆర్‌. నాగరాజు కమిషనర్‌గా చేరారు. నగర అదనపు డీసీపీలాఅండ్‌ ఆర్డర్‌గా కూడా ఈనెల ఆరంభంలో ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ వినీత్‌ బాధ్యతలు చేపట్టారు.  

ఫ పెరిగిన నేరాలు..

జిల్లాలో ఈ యేడు నేరాల పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన ఎక్కువగా జరిగాయి.జిల్లాలో కరోనా ఎక్కువగా ఉండడం వల్ల సంవత్సరం ఆరంభంలో ప్రమాదాలు తక్కువగా జరిగిన చివరి నాటికి బాగా పెరిగాయి. జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం గంజాయితో పాటు అక్రమ రవాణా కేసులు కూడా బాగా పెరిగాయి. మొత్తంగా కొన్ని రంగాలలో నేరాలు తగ్గగా మరికొన్ని రంగాలలో పెరిగాయి.

ఫ మెరిసిన జిల్లా క్రీడాకారులు..

జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభకనబర్చారు. పలు పతకాలను సొం తం చేసుకున్నారు. ప్రధానంగా ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌లలో ఎక్కువగా పేరు సంపాదించారు. సీనియర్‌ నేషనల్‌ 5వ ఉమెన్స్‌ చాంపియన్‌షిప్‌ టోర్నిలో జిల్లాకు చెందిన నిఖత్‌ జరీనా గోల్డ్‌మెడల్‌ సాధించి బెస్ట్‌ ప్లేయర్‌గా అవార్డు సాధించింది. అంతేకాకుండ టర్కిలో జరిగే టోర్నికి ఎంపికైంది. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్య అనేక అంత ర్జాతీయ పోటీలలో పాల్గొంది. సీనియర్‌ భారత జట్టులో తన చోటును పదిలం చేసుకుంది. మార్చిలో టర్కిలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో భారత్‌ తరపున పాల్గొది.. అక్టోబరులో బహ్రెయిన్‌లో, స్వీడన్‌ టూ ర్‌లలో పాల్గొంది. నవంబర్‌లో కేరళలో జరిగిన పోటీలలో 3వ స్థానం రావడంలో తనవంతు పాత్ర పోషించింది. బ్రెజిల్‌లో జరిగిన సీనియర్‌ భార త జట్టులో పాల్గొని ప్రతిభకనబర్చింది. జిల్లాకు చెందిన మరో బాక్సర్‌ ఉసాముద్దిన్‌ సెప్టెంబర్‌లో స్పెయిన్‌లో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో రజతం సాధించారు.


Updated Date - 2021-12-31T07:14:38+05:30 IST