విత్తనాల రాయితీకి మంగళం...!

ABN , First Publish Date - 2021-01-21T05:17:35+05:30 IST

రైతులను అన్ని విధాల ఆదుకుంటామని వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది.

విత్తనాల రాయితీకి మంగళం...!
కామారెడ్డి పట్టణంలో విక్రయిస్తున్న కూరగాయలు(ఫైల్‌)

- కూరగాయల సాగుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువు
- ఉమ్మడి జిల్లాలో సుమారు 10వేలకు పైగా హెక్టార్లలో కూరగాయల సాగు
- అత్యధికంగా 5,345 హెక్టార్లలో టమాట సాగు
- ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం లేకపోవడంతో కూరగాయల సాగు వైపు మొగ్గు చూపని రైతులు
- విత్తనాలకు ప్రైవేటు డీలర్లపైనే ఆధారం
- సాగు వ్యయం పెరిగి గిట్టుబాటు లేదంటున్న రైతులు
- ప్రైవేటు నుంచి రైతులకు కల్తీ విత్తనాల బెడద
- మూడు రకాల కూరగాయలకు మాత్రమే నారు అందజేస్తున్న ఉద్యానశాఖ
కామారెడ్డి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రైతులను అన్ని విధాల ఆదుకుంటామని వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. పాలీహౌజ్‌, గ్రీన్‌ హౌస్‌, క్రాప్‌కాలనీ లాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది నిధులను వేచ్చిస్తున్నప్పటికీ కూరగాయల సాగు చేసే రైతులకు మాత్రం ప్రోత్సాహకం అందడం లేదు. ప్రజల నిత్యావసరాలైన కూరగాయల సాగుకు స్థానికంగానే ప్రోత్సాహకం అందిస్తామని చెబుతున్నా ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. దీంతో సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం చె బుతున్న పథకాల మాటేమిటో కానీ కనీసం కూరగాయల సాగుకు రాయితీ విత్తనాల జాడలేదు.  గతంలో కూరగాయల సాగుకు 50 శాతం నుంచి 70శాతం వరకు సబ్సిడీపై రైతులకు విత్తనాలు సరఫరా జరిగేది. కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరపున రాయితీ విత్తనాలు అందక కూరగాయాల రైతులు ప్రైవేట్‌ విత్తన వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ఉమ్మడి జిల్లాలో 10వేల హెక్టార్లలో కూరగాయల సాగు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 10 హెక్టార్లకు పైగానే కూరగాయల పంటలు సాగవుతున్నాయి. అనధికారికంగా 20 హెక్టార్లకు పైగానే సాగవుతున్నట్లు తెలుస్తోంది. ఇరు జిల్లాల్లో కూరగాయల్లో ప్రధానంగా టమాట, బీర, బెండకాయ, వంకాయ, సోరకాయ, ఆకు కూర లైన పాలకూర, కొత్తిమీర, తోటకూర, గోంగూర, మెత్తికూర, మిర్చి, ఉల్లి, తీగ జాతి కూరగాయలు బీర, కాకరకాయ, పొట్లకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, గోబిపువ్వు, గోబిగడ్డ తదితర కూరగాయల పంటలు సాగవుతున్నాయి. ఇందులో టమాట 5,345 హెక్టార్లలో, పచ్చిమిర్చి 829 హెక్టార్లలో, వంకాయ 543 హెక్టార్లలో, క్యాలీప్లవర్‌ 119 హెక్టార్లలో, బెండకాయ 539హెక్టార్లలో, క్యాబేజి 175హెక్టార్లలో, బీన్స్‌ 198 హెక్టార్లలో, ఉల్లి 311 హెక్టార్లలో, ఆకు కూరలు 359 హెక్టార్లలో సాగవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి డివిజన్‌లో 330 ఎకరాల్లో, బాన్సువాడ డివిజన్‌లో 910 ఎకరాల్లో, ఎల్లారెడ్డి డివిజన్‌లో 544 ఎకరాల్లో కూరగాయాలు సాగవుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానంగా అర్మూర్‌, అంకాపూర్‌, నందిపేట్‌, మాక్లూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, బాల్కొండ, బోధన్‌, నవీపేట్‌, రెంజల్‌, వర్ని తదితర మండలాల్లో పెద్ద మొత్తంలోనే కూరగాయలను సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్‌, గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, బీర్కూర్‌, బిచ్కుంద, రామారెడ్డి, రాజంపేట్‌, భిక్కనూరు తదితర మండలాల్లోనూ సాగవుతున్నాయి.
ఊసేలేని ఆర్‌కేవీవై
రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కేవీవై) పథకం కింద రాయితీపై రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేసేవారు. కూరగాయల సాగుకు 50 శాతం నుంచి 70శాతం వరకు సబ్సిడీపై రైతులకు విత్తనాలు సరఫరా జరిగేది. గత నాలుగేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో కూరగాయల రైతులపై అదనపు భారం పడుతుండగా సాగుచేసే రైతుల సంఖ్య ఏటా తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల్లోనే కూరగాయల తోటలు సాగయ్యేవి. ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు దొరకక ఆ తోటలు కనిపించడం లేదు. ప్రస్తుతం విత్తనాలకు బదులుగా నారు మాత్రమే ఉద్యానవన శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఆ నారు కూడా కేవలం మూడు రకాల కూరగాయలకు మాత్రమే ఇస్తున్నారు. వంకాయ, టమాట, మిరుప లాంటి కూరగాయలకు విత్తనాలకు బదులు నారును అందజేస్తున్నారు.
కూరగాయల రైతులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం కరువు
ప్రజల నిత్యావసరాలైన కూరగాయలను సాగు చేసే రైతులకు అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగానే కూరగాయలు సాగు చేసే రైతుల కోసం పాలీహౌజ్‌, గ్రీన్‌హౌస్‌, క్రాప్‌ కాలనీలతో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా అవి మాటలకే పరిమితమవుతున్నాయి. కూరగాయల సాగుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నా రైతులకు మాత్రం ప్రోత్సాహకం అందడం లేదు. దీంతో కూరగాయల సాగుకు ప్రభుత్వం తరపున సబ్సిడీ విత్తనాలు అందక ప్రైవేటు విత్తన డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద కూరగాయల విత్తన ధరలు అధికంగా ఉండటమే కాకుండా కల్తీ విత్తనాల బారిన పడి పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. పాలిహౌజ్‌, గ్రీన్‌హౌజ్‌, క్రాప్‌కాలనీల పేరుతో కోట్లాది రూపాయల వ్యయం చేస్తున్న ప్రభుత్వం కూరగాయల సాగుతో స్థానిక ప్రజల అవసరాలు తీరుస్తున్న సన్న చిన్నకారు రైతులకు కనీస ప్రోత్సాహకం ప్రభుత్వాలు మరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న విత్తన రాయితీలను అందించకపోవడంతో కూరగాయల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కూరగాయల రాయితీ విత్తనాలను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

కూరగాయల నారు అందిస్తున్నాం
- శేఖర్‌, ఉద్యానవనశాఖ అధికారి, కామారెడ్డి.
కూరగాయల సబ్సిడీ విత్తనాలను సరఫరాకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో రైతులకు కూరగాయల సబ్సిడీ విత్తనాలను అందజేయలేకపోతున్నాం. సబ్సిడీ విత్తనాలకు బదులుగా కూరగాయల నారును అందించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పలు రకాల కూరగాయలకు చెందిన నారును రైతులకు సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో వంకాయ, టమాట, మిరుపనారును కూరగాయల రైతులకు ఇస్తున్నాం.

Updated Date - 2021-01-21T05:17:35+05:30 IST