జోరుగా ‘రియల్‌’ దందా

ABN , First Publish Date - 2021-12-07T06:21:05+05:30 IST

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ దందా జోరుగా సాగుతోంది. భూ ములకు భారీగా డిమాండ్‌ పెరగడంతో అన్ని ప్రాంతాల్లో కొత్తగా లే అవుట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

జోరుగా ‘రియల్‌’ దందా

జిల్లాలో భారీగా నూతన వెంచర్లు

అనుమతులు తీసుకోకుండానే అమ్మకాలు

ఖాళీ స్థలాల పేరున మున్సిపల్‌, పంచాయతీ రసీదులతో రిజిస్ట్రేషన్‌లు

నాలా కన్వెర్షన్‌ లేకుండానే అన్ని అనుమతులు

ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల వెనకడుగు

నిజామాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో  రియల్‌ ఎస్టేట్‌ దందా జోరుగా సాగుతోంది. భూ ములకు భారీగా డిమాండ్‌ పెరగడంతో అన్ని ప్రాంతాల్లో కొత్తగా లే అవుట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నింటికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లే అవుట్‌లు చే స్తూ అమ్మకాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, ము న్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలుగా చూపెడుతూ పన్నులు కడుతున్నారు. వాటి ఆధారంగా రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారు. జిల్లా పరిధిలో అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, జాతీయ రహదారులు ఉన్న ప్రాంతంలో ఈ వెంచర్‌లు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. నాలా కన్వెర్షన్‌ లేకుండానే అన్ని అనుమతులు తీసుకుంటూ అమ్మకాలు చేస్తున్నారు. 

      శివారు ప్రాంతాల్లో వెంచర్ల ఏర్పాటు..

నిజామాబాద్‌ నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల శివారుల్లో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు ప్రధాన మండల కేంద్రాలు, జాతీయ రహదారుల వెంట ఈ వెంచర్‌లు పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ భూములనే ప్లాట్‌లుగా చేస్తున్నారు. పంటలు పండే భూముల్లో రోడ్లు, ఇతర ఏర్పాట్లను చేస్తూ ప్లాట్‌లుగా మారుస్తున్నారు. జాతీయ రహదారి మున్సిపాలిటీలకు దగ్గరగా ఉన్నాయని ప్రకటనలు ఇస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. తమకు దగ్గరగా ఉన్నవారి ద్వారా తక్కువ రేట్లకే ప్లాట్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయని ప్రకటనలు చేస్తున్నారు. నిజామాబాద్‌ నగరం చుట్టూ పది కిలో మీటర్ల రేడియస్‌లో నుడా పరిధిలో ఈ వెంచర్‌లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. బోధన్‌, ఆర్మూర్‌ శివారులో కూడా ఎక్కువ మొత్తంలో ఈ వెంచర్‌లను వేశారు. వ్యవసాయ భూమిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లుగా మారిస్తే తప్పనిసరిగా నాలా కన్వెర్షన్‌ చేయాలి. రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్‌శాఖల ద్వారా అనుమతి తీసుకోవాలి. వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లుగా మార్చిన సమయంలో నిబంధనల ప్రకారం 30శాతం వరకు భూమిని పార్కులు, ఇతర అవసరాలకు వదిలేయాలి. మిగతా భూమిలో లేఅవుట్‌కు అనుగుణంగా ప్లాట్‌లు చేసి అమ్మకాలు చేయాలి. దీనికి సమయం ఎక్కువ పట్టడం, భారీగా ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సి ఉండడంతో ఎక్కువ వెంచర్‌లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చేస్తున్నారు. స్థానిక గ్రామ పంచాయతీల్లో అనుమతులు తీసుకుంటున్నారు. ప్లాట్స్‌గా మారుస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ఖాళీ స్థలాల కింద అనుమతులు తీసుకోవడంతో పాటు పన్నులను కడుతున్నారు. ఆ పన్నుల రసీదుకు అనుగుణంగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారు. కొన్నవారి పేరుమీద ఈ రిజిస్ర్టేషన్‌లను కొనసాగిస్తున్నారు. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌దారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్లాట్‌లను అమ్మకాలు చేస్తున్నారు. కొన్నవారు నిర్మాణం చేసే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లే అవుట్‌లకు అనుగుణంగా అనుమతులు తీసుకోకపోవడం వల్ల భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు.  

      ఖాళీ స్థలాల పేరుమీద అనుమతులు..

 జిల్లాలో నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌, ఆర్మూర్‌ పరిధిలో ఈ వెంచర్‌లు ఎక్కువగా వచ్చాయి. ప్లాట్‌లను అమ్మకాలు చేసిన తర్వాత రిజిస్ర్టేషన్‌లు కాకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌ చేసేవారు మొదట అమ్మకాలు చేస్తున్నారు. తర్వాత ఖాళీ స్థలాల పేరుమీద అనుమతులు తీసుకుంటున్నారు. వాటి ద్వారా ఈ రిజిస్ర్టేషన్‌లు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఖాళీ స్థలాల పేరున చాలామంది పన్నులు కట్టారు. నగరం చుట్టూ ఉన్న వెంచర్‌లకు చెందినవారు సుమారు ఆరువేల వరకు ఖాళీ స్థలాలకు పన్నులు కట్టారు. వీటిని పరిశీలించిన అప్పటి కమిషనర్‌ లే అవుట్‌లు లేకపోవడం, నాలా కన్వెర్షన్‌ కాకపోవడం వల్ల వాటిని ఆన్‌లైన్‌ చేయలేదు. వాటిని రిజిస్ర్టేషన్‌ చేయవద్దని కోరారు. ఇలా ఖాళీ స్థలాల పేరుమీద రిజిస్ర్టేషన్‌ కాకుండా ఆయన చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర అధికారులు ఇన్‌చార్జిలుగా ఉన్న వాటిని మాత్రం క్లియర్‌ చేయడంలేదు. ఇదే పరిస్థితి ఆర్మూర్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లోనూ కొనసాగుతోంది. కొంతమంది రియల్‌ఎస్టేట్‌ దారులు రాజకీయ పలుకుబడి వల్ల ఒత్తిడి తెచ్చుకుంటూ రిజిస్ర్టేషన్‌లను నాలా కన్వెర్షన్‌ లేకుండానే చేయిస్తున్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో తమకు అనుకూలమైనవారిని ఉండే విధంగా చూసుకుంటూ ఈ రిజిస్ర్టేషన్‌లను పూర్తిచేస్తున్నారు. జిల్లా పరిధిలో ఐదుగురు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉండగా భీంగల్‌ మినహా ఇతర కార్యాలయాలు ఈ రిజిస్ర్టేషన్‌లు ఎక్కువగా జరిగాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ర్టేషన్‌లు చేసే సమయంలో ఖాళీ స్థలాల ధ్రువీకరణ పత్రాలతో పాటు వాటికి సంబంధించిన లింకు డాక్యుమెంట్‌లను పరిశీలించిన తర్వాతనే రిజిస్ర్టేషన్‌లు చేయాలి. గడిచిన సంవత్సరకాలంగా ఇలాంటివి ఎక్కువగా చేశారు. నేతల ఒత్తిళ్లతో ఇవి ఎక్కువగా జరగగా ప్రస్తుతం కొంతమంది అధికారులపైన చర్యలు చేపట్టారు. 

      చర్యలు తీసుకుంటున్నా ఆగని అక్రమాలు..

జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్రమంగా వెలుస్తున్న వెంచర్‌లపైన మున్సిపల్‌ అధికారులు, పంచాయతీ అధికారులు కొన్నిచోట్ల చర్యలు తీసుకుంటున్నా ఇవిమాత్రం ఆగడంలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కొనసాగిస్తున్నారు. వెంచర్‌లు కొత్తవి వేసినపుడే వ్యవసాయ భూములకు నాలా కన్వెర్షన్‌ అనుమతి తీసుకుంటే కొన్నవారికి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. కొన్నింటిపైన చర్యలు తీసుకున్న మరికొన్నింటిపైన ఒత్తిళ్ల వల్ల తీసుకోలేకపోతున్నామని వారు తెలిపారు. మున్సిపల్‌లో ఖాళీ స్థలాలకు పన్నులు వేసేటపుడు వాటిని తనిఖీ చేస్తే ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు.

Updated Date - 2021-12-07T06:21:05+05:30 IST