నులిపేద్దాం

ABN , First Publish Date - 2021-08-25T05:50:15+05:30 IST

ప్రస్తుత కాలంలో చిన్నారులను అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా అపరిశుభ్రత కారణంగా చుట్టుముట్టే సమస్యలు తల్లిదండ్రులు గమనించేలోపే తీవ్రరూపం దాలుస్తున్నాయి.

నులిపేద్దాం

నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

పెద్దబజార్‌, ఆగస్టు 24: ప్రస్తుత కాలంలో చిన్నారులను అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా అపరిశుభ్రత కారణంగా చుట్టుముట్టే సమస్యలు తల్లిదండ్రులు గమనించేలోపే తీవ్రరూపం దాలుస్తున్నాయి. అందులో నులిపురుగుల సమస్య ఒకటి. నులి పురుగుల సమస్యతో సతమతమవుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తున్నాయి. రక్తహీనతతో పాటు పోషకలోపాన్ని కలిగిస్తున్నాయి. అయితే, వీటి నిర్మూళనను సవాలుగా తీసుకున్న ప్రభుత్వం ప్రతియేటా ఆగస్టు 25న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంగా నిర్వహిస్తోంది. 

జిల్లాలో 5.4లక్షల మందికి మాత్రలు

జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న 5లక్షల 4వేల 371 మందికి అల్డెండజోల్‌ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్ణయించి.. అందుకు సంబంధించి ఇప్పటికే వైద్య సిబ్బంది ఏఎన్‌ఎం, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. మాత్రలను ఆయా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో, పీహెచ్‌సీలకు సరఫరా చేశారు. 

పకడ్బందీగా నిర్వహిస్తాం..

- డాక్టర్‌ బాలనరేంద్ర, డీఎంహెచ్‌వో

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఈనెల 25 నుంచి 31 వరకు  అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న 5లక్షల 4వేల  371 మంది పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్ణయించాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా మాత్రలు వేయించాలి.

Updated Date - 2021-08-25T05:50:15+05:30 IST