మందిరాల నిర్మాణాలకు పెద్దపీట
ABN , First Publish Date - 2021-10-22T05:15:28+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం మందిరాల నిర్మాణాలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
జిల్లాలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
రుద్రూరు,అక్టోబరు 21 : రాష్ట్ర ప్రభుత్వం మందిరాల నిర్మాణాలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రుద్రూరు మండలం అంబం(ఆర్) గ్రామ పంచాయతీలోని లక్ష్మిపూర్ క్యాంప్‌లో రూ.25 లక్షలతో రామాలయ పుర్నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం, కలెక్టర్ నారాయణ రెడ్డి శంకుస్థాపన చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా సన్మార్గంలో నడవాలని కోరారు. మందిరాలు నిర్మించుకునేది మానవత్వం, నిజాయితీ, ధర్మంగా మనుషులు ఉండాలన్న ఉద్దేశంతోనేనని అన్నారు. నియోజకవర్గంలో 35 ఆలయాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. దూపదీప నైవేద్యం కింద ప్రతీ నియోజకవర్గంలో 15 వరకు ఆలయాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని తిరుమల తిరుపతి ఆలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. కార్తీక మాసంలో మూడు వేల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నామఅన్నారు. రిసార్ట్‌లు సైతం నిర్మిస్తున్నామన్నారు. రెండు కిలోలతో వజ్ర కిరీటాన్ని ఏర్పాటు చేస్తున్నామని భక్తులు, దాతలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 25 తులాల బంగారం సమకూర్చడంతో పాటు ఆలయ అభివృద్ధికి పాటు పడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, సర్పంచ్ కోర్వ భాగ్య భూషణ్, ఎంపీటీసీ మంత్రి లక్ష్మి గంగారాం, నాయకులు పట్టెపు రాములు, శానం హన్మాండ్లు, శానం భాగ్య, కోర్వ సాయిలు, ఆర్.సాయిలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రాయకూర్ గంగారాం, ఖదర్, పాల్గొన్నారు.
నేటి నుంచి ధాన్యం కొనుగోలు
జిల్లాలో శుక్రవారం నుంచి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని వారన్నారు. గోదాంలలో వరి ధాన్యం నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో పంట మార్పిడి చేసుకుని సహకరించాలని కోరారు. ఆయిల్ పాం పంటలపై మొగ్గు చూపాలన్నారు. వేరు శనగ విత్తనాలు తెప్పిస్తామని, పొద్దు తిరుగుడు విత్తనాల కొరత ఉందన్నారు. అప్పులు చేసి రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు.