భూ రాబందులు

ABN , First Publish Date - 2021-08-20T05:44:06+05:30 IST

భూ రాబందులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు హద్దులు దాటి కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలా లు, ఖాళీ జాగాలపై కన్నేశారు.

భూ రాబందులు
నిజామాబాద్‌ నగరంలోని ఫూలాంగ్‌ వాగును ఆక్రమించిన భవన నిర్మాణాలు చేపట్టిన దృశ్యం


జిల్లాకేంద్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న భూ ఆక్రమణలు 

వాగులతో పాటు నాలాలనూ వదిలి పెట్టకుండా కబ్జాల పరంపర 

నగరంలో ఆనవాళ్లు కోల్పోయిన ఫులాంగ్‌, బోర్గాం వాగులు 

అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు చేపట్టి రూ. కోట్లల్లో గడిస్తున్న అక్రమార్కులు 

మామూళ్ల మత్తులో కన్నెత్తి చూడని జిల్లా అధికార యంత్రాంగం 

భారీ వర్షాలు పడితే ఇళ్లను ముంచెత్తనున్న వరద!

నిజామాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : భూ రాబందులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు హద్దులు దాటి కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలా లు, ఖాళీ జాగాలపై కన్నేశారు. నాలాలు, వాగులను, చెరువులను వదలకుండా ప్లాట్లుగా చేసి అమ్మకాలు చేశారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో 20 ఏళ్లుగా ఈ భూ ముల కబ్జాలు జరిగాయి. భవన నిర్మాణాలకు అను మతులు ఇచ్చే సమయంలో కూడా నిబంధనలు పాటించకపోవడం వల్ల హైదరాబాద్‌లాగా భారీ వరదలు వస్తే పలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు మునిగే పరిస్థితి ఉం దని ఎవరైనా ఫిర్యాదు చేసినా వెంచర్ల నిర్వాహకుల ఒత్తిళ్లతో అధికారులు ఆవైపు కన్నెత్తి చూడడం లేదు.

ఊపందుకున్న నిర్మాణాలు..

గడిచిన 20 ఏళ్లలో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. వ్యవసాయ, అసైన్డ్‌తో పాటు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. పేదలకు ఇచ్చిన పట్టాభూముల తో పాటు చెరువు శిఖం భూముల్లో, నిజాంసాగర్‌ కాల్వల ఒడ్డున నిర్మాణాలు చేశారు. ఏళ్ల తరబడి ఉంటున్నారు. నిజామాబాద్‌ నగరం పరిధిలో కొన్ని చెరువులు కబ్జాలకు గురై ఆనవాళ్లు కోల్పోయాయి. గతంలో సర్వేలు నిర్వహించిన స్వాధీనం చేసుకునేందుకు వెనకాడారు. ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో అడ్డుకునే వారులేక ఇప్పుడు వందల సంఖ్యలో భవనాలు పూర్తయ్యాయి. 

నాలా, వాగుల బౌండ్రీలు మాయం

నిజామాబాద్‌లోని పూలాంగ్‌, బోర్గాం వాగులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి.వాటి చుట్టుపక్కల భూముల ధరలు పెరగడం వల్ల వాటి వెంటనే నిర్మాణాలు చేస్తున్నా రు. గాయత్రీనగర్‌ నుంచి మానిక్‌భండార్‌ వరకు ఫూలాంగ్‌ వాగుకు ఇరువైపు లా భారీ కట్టడాలు వెలిశా యి. పలుచోట్ల వాగులోపలికి చొచ్చుకువచ్చి నిర్మాణాలు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌ల తో పాటు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. నగరంలోని మరోవాగు బోర్గాం పరిధిలో కూడా ఎక్కువమొత్తంలో కట్టడాలు జరిగాయి. ఈ రెండు వాగుల పరిధిలోని భూముల ధరలు భారీగా పెరగడం, వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారడంతో భారీ డిమాండ్‌ వచ్చింది. భూముల ధరలు పె రగడం వల్ల వాగుల పక్కన కొనుగోలు చేసినవారు వాగు లోపలి వరకు పిల్లర్‌లను వేసి నిర్మాణాలు చేశారు. ప్రస్తు తం కూడా బోర్గాం, పూలాంగ్‌ పరిధిలో పలుచోట్ల ఈ ని ర్మాణాలు చేస్తున్నారు. బోర్గం వాగు పరిధిలో కొన్నిచోట్ల వెంచర్‌లవారు కూడా ఈ వాగులను కొద్ది వరకు కలుపు కొని వెంచర్‌లో చూపించే 30శాతంలో వీటిని చూపెడుతున్నారు. అను మతులను పొందుతున్నారు. 

నిబంధనలకు నీళ్లు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ వాగు పక్కన పట్టాభూములు ఉన్నా.. వాగు మధ్య నుంచి 9 మీటర్ల మేరకు వదిలిపెట్టి నిర్మాణాలు చేయాలి. ఈ నిబంధనలు ఎవరూ పాటించడంలేదు. వాగుల పరిధిలోనే పిల్లర్లను వేసి మట్టిని నింపి ఇతర పనులకు ఉపయోగించుకుంటున్నారు. 20 ఏళ్లుగా ఈ ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. నగరం పరిధిలోని బోర్గాం, పాంగ్రా, గూపన్‌పల్లి, ముబారక్‌నగర్‌, మానిక్‌భండార్‌లు రెండేళ్ల క్రితమే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. గతం లో గ్రామ పంచాయతీలుగా ఉండడం, అప్పుడు న్న అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువమొత్తంలో ఆక్రమణలు జరిగాయి. వాగు పరిధిలో జరిగే నిర్మాణాలను ఇరిగేషన్‌, రెవెన్యూ, పంచాయతీ, టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌, మున్సిపల్‌ అధికారులు పట్టించుకుని పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. వారు పట్టించుకోకపోవడం వల్లనే ఎక్కువగా నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం కూడా ఈ రెండు వాగుల వెంట కొత్త వెంచర్‌లు వెలుస్తున్నాయి. కొన్నిచోట్ల వాగుల వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. వరదను బట్టి ప ట్టా భూముల్లోనూ 9 మీటర్ల వరకు వదిలివేయాలని ని బంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. 

ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు..

నగరం పరిధిలోని సుమారు ఐదు చెరువులకు సంబంధించిన భూములు కూడా కొన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. వీటి పరిధిలో నిర్మాణాలు వెలిశాయి. పాత పట్టాలు చూపిస్తూ గతంలో సబ్‌రిజిస్ర్టార్‌ పరిధిలో రిజిస్ర్టేషన్‌లు చేయించుకోవడం వల్ల రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా కబ్జాలకు గురయ్యాయి. నగరం పరిధిలో కబ్జాలకు అధికారంలో ఉన్న నేతలు కొంతమంది సహకరించడం వల్ల ఈ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. భారీ వర్షాలు పడితే నగరంలోని పలు కాలనీల్లో నీళ్లు చేరే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. బోర్గాం, ఫూలాంగ్‌ వాగుల పరిధిలో పలు చోట్ల ఒడ్డు వరకు కట్టడాలు రావడం వల్ల వరద పెరిగితే ఇళ్లవైపే వచ్చే అవకాశం ఉంది. టీఎస్‌బీపాస్‌ నిబంధనల ప్రకారం కొత్త వెంచర్‌లు వేసేవారు తప్పనిసరిగా 33శాతం స్థలాన్ని రోడ్లు, గ్రీన్‌జోన్‌కు వదిలేయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. వాగుల పరిధిలో తప్పనిసరిగా 9 మీటర్లు వెనకకు నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇవేవీ ప్రస్తుతం ఈ వాగుల పరిధిలో జరగడంలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు దృష్టిపెడితే ఈ నిర్మాణాలు ఆగనున్నాయి. లేకుంటే భారీ వర్షాలతో హైదరాబాద్‌లాగానే వరదలతో భవిష్యత్తులో జనాలు నగరంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 

Updated Date - 2021-08-20T05:44:06+05:30 IST