ఖాకీ చేతి వాటం?
ABN , First Publish Date - 2021-11-29T05:26:02+05:30 IST
జిల్లాలోని ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఓ ఎస్‌ఐపై అవినీతి ఆరోపణలపై ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

- అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎస్సై
- పేకాట కేసుల్లో సదరు వ్యక్తి చేతి వాటం
- జూదరుల ద్విచక్రవాహనాలు వదిలేందుకు ముడుపులకు డిమాండ్
- ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
- విచారణకు ఎస్‌బీ అధికారులను ఆదేశించిన ఎస్పీ
- గత నాలుగు రోజులుగా సెలవుల్లో వెళ్లిన సదరు ఎస్‌ఐ
కామారెడ్డి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఓ ఎస్‌ఐపై అవినీతి ఆరోపణలపై ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇటీవల దీపావళి పండుగ సందర్భంలో పేకాట కేసుల్లో సదరు ఖాకీ చేతివాటం ప్రదర్శించాడని విమర్శలు వస్తున్నాయి. సదరు ఎస్‌ఐ పేకాట స్ధావరంపై దాడిచేసి నగదుతో పాటు జూదరుల ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం నగదులోంచి కొద్ది మొత్తం మాత్రమే దొరికినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరుచగా జూదరులకు సంబంధించిన బైక్‌లను వదిలేందుకు పెద్ద మొత్తంలో ముడుపులు డిమాండ్ చేయడంతో జూదరులు ఎస్పీ శ్వేతారెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో సదరు ఎస్‌ఐపై విచారణ చేపట్టాలని ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ విభాగం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఎస్‌బీ అధికారుల విచారణలోనూ సదరు ఎస్‌ఐ అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఆ నివేదికను ఎస్పీకి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సదరు ఎస్‌ఐపై వేటు వేసే అవకాశాలు ఉంటాయని ఆ శాఖధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎస్‌ఐ గత నాలుగు రోజుల నుంచి సెలవుల్లోకి వెళ్లిపోయినట్లు తెలిసింది.
పేకాటరాయుళ్ల నుంచి ముడుపులు డిమాండ్
ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి, తాండూర్ గ్రామాల శివారుల్లో పేకాట ఆడుతున్న స్థావరంపై ఓ ఎస్‌ఐతో పాటు మరికొందరు సిబ్బంది దాడి చేశారు. ఇందులో పేకాట రాయుళ్లతో పాటు నగదును, సెల్‌ఫోన్‌లను, ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ధర్మారెడ్డి గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న సుమారు 20 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు రూ.60వేల వరకు నగదు సీజ్ చేసినట్లు సమాచారం. నగదుతో పాటు జూదరులకు సంబంధించిన ద్విచక్రవాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే సదరు ఎస్‌ఐ జూదరుల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదులోంచి కొద్ది మొత్తం నగదు మాత్రమే దొరికినట్లు కేసులో నమోదు చేశారు. అదేవిధంగా తమ ద్విచక్ర వాహనాలను ఇవ్వాలని పలుమార్లు జూదరులు ఎస్‌ఐని కోరగా ముడుపులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.10వేలు ఇస్తేగాని ద్విచక్రవాహనాలు వదిలిపెట్టేది లేదని సదరు ఎస్‌ఐ జూదరులను డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఎస్పీకి ఫిర్యాదు
నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డిలో పేకాటరాయుళ్ల ద్విచక్రవాహనాలను వదిలేందుకు ఎస్‌ఐ పెద్దఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ పేకాటరాయుళ్లు ఎస్పీకి శ్వేతారెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో స్పందించిన ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ విభాగం అధికారులకు సదరు ఎస్‌ఐపై విచారణ చేపట్టాలని గత వారం రోజుల కిందట ఆదేశించినట్లు సమాచారం. దీంతో స్పెషల్ బ్రాంచ్ అధికారులు స్థానిక పోలీసుస్టేషన్‌లోని సిబ్బందితో పాటు పేకాటరాయుళ్లను విచారించారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసిన ఫైళ్లను పరిశీలించారు. ఈ ఫైళ్లలో సంఘటన స్థలం సమయంలో దొరికిన నగదు కంటే తక్కువ నగదు చూపించినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. అదేవిధంగా పేకాటరాయుళ్లకు సంబంధించిన బైక్‌లను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. ఇందులో రెండు బైక్‌లను ముడుపులు తీసుకుని ఎస్‌ఐ వదిలిపెట్టినట్లు ఎస్‌బీ అధికారుల విచారణలో తేలింది. సదరు ఎస్‌ఐ అవినీతి ఆరోపణల విచారణ నివేదికను ఎస్‌బీ పోలీసులు ఎస్పీకి నివేదించినట్లు సమాచారం. దీంతో సదరు ఎస్‌ఐపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సెలవుల్లోకి వెళ్లినట్లు తెలిసింది. గత నాలుగు రోజులుగా సదరు ఎస్‌ఐ సెలవుల్లో ఉన్నట్లు సమాచారం.
గతంలోనూ సదరు ఎస్‌ఐపై అవినీతి ఆరోపణలు
పేకాట కేసు విషయంలో చేతివాటం ప్రదర్శించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎస్‌ఐ గతంలోనూ పలు వివాదాల్లో పాత్రదారుడిగా ఉన్నట్లు పోలీసుశాఖలో చర్చసాగుతోంది. జిల్లాకు రాకముందు సదరు ఎస్‌ఐ మెదక్ జిల్లా రామాయంపేటలో ఓ పోలీసుస్టేషన్ పరిధిలో ఎస్‌ఐగా విధులు నిర్వహించాడు. స్థానికంగా ఇసుక వివాదంలో భారీగానే ముడుపులు తీసుకున్నరన్న ఆరోపణలు అక్కడి పోలీసుశాఖ విచారణలో తేలింది. దీంతో సదరు ఎస్‌ఐని ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌లోకి పంపారు. సదరు ఎస్‌ఐ రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుని కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు ఆ శాఖలోని కొందరు సిబ్బంది పేర్కొంటున్నారు. బదిలీపై జిల్లాకు వచ్చిన తర్వాత ఓ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ తన తీరు మాత్రం మార్చుకోవడంలేదనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి అవినీతి ఎస్‌ఐపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.