రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో.. దళారులదే హవా!

ABN , First Publish Date - 2021-08-11T05:05:45+05:30 IST

జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు దళారులకు అడ్డాగా మారుతున్నాయి. ఈ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో దళారులు లేనిదే ఒక రిజిస్ర్టేషన్‌ కాదు.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో.. దళారులదే హవా!
కామారెడ్డి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

- జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో బ్రోకర్లదే హవా
- ప్లాటుకు ఒక రేటు.. ఎకరానికి మరో రేటుగా ఫిక్స్‌
- దళారులతో పోతే కానీ రిజిస్ర్టేషన్‌లు కానీ పరిస్థితి
- జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వెంచర్లు
- బ్రోకర్లతో అధికారుల కుమ్మక్కు.. దొడ్డి దారిన రిజిస్ర్టేషన్‌లు
- జిల్లాలో నాలుగు సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు


కామారెడ్డి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు దళారులకు అడ్డాగా మారుతున్నాయి. ఈ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో దళారులు లేనిదే ఒక రిజిస్ర్టేషన్‌ కాదు. ప్లాటు.. వ్యవసాయ భూములు.. వివాహాలకైనా రిజిస్ర్టేషన్‌ కావాలంటే బ్రోకర్ల అనుమతి ఉండాల్సిందే. నేరుగా రిజిస్ర్టేషన్‌ కార్యాలయానికి ఎవరైన వెళితే సవాలక్ష నిబంధనలతో యజమానులను వెనక్కి పంపుతున్న పరిస్థితి ఎదురవుతోంది. ప్లాట్లకు ఒక రేటు.. ఎకరానికి మరో రేటుగా ఫిక్స్‌ చేస్తూ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో దళారులు దందా కొనసాగిస్తున్నారు. సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది అండదండలతోనే బ్రోకర్లు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువలను, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో భూముల క్రయ విక్రయాలు పెరగడంతో ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం సమకూరుతోంది. అనుమతి లేని ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్‌ చేయకూడదని ప్రభుత్వం ఆదేశించినా కొందరు బ్రోకర్లు దొంగ డాక్యుమెంట్లను సృష్టిస్తూ రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నా సంబంధిత శాఖ  అధికారులు ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పెరిగిన భూముల రిజిస్ర్టేషన్‌లు
గడిచిన ఆరు నెలల కాలంలో ప్రతీ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో భూముల రిజిస్ర్టేషన్‌లు బాగానే పెరిగాయి. గతంలో ప్రతీరోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్‌లు అయ్యేవి. ప్రస్తుతం వీటి సంఖ్య డబుల్‌ అయింది. ప్రతీరోజు 70 నుంచి 80 వరకు డాక్యుమెంట్‌ రిజిస్ర్టేషన్‌లు అవుతున్నాయి. మంచి రోజుల్లో వంద వరకు రిజిస్ర్టేషన్‌లు అవుతున్నాయి. భూముల రేట్లు పెరగడంతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అవుతుండటంతో  భూముల అమ్మకాలు, కొనుగోలు ఎక్కువగానే అవుతున్నాయి. సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో ఎక్కువ రిజిస్ర్టేషన్‌లు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ర్టేషన్‌లు ఎక్కువగా అవుతున్నాయి. వీటితో పాటు దోమకొండ, బిచ్కుంద కార్యాలయాల్లో కూడా ఎక్కువగా అవుతున్నాయి. కామారెడ్డి సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో గత ఏడాది రూ.4.35 కోట్ల ఆదాయం చేకూరింది. బాన్సువాడ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో  రూ.3.88 కోట్లు ఆదాయం వచ్చింది. దీంతో పాటు బిచ్కుంద, దోమకొండ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లోనూ భూముల రిజిస్ర్టేషన్‌ వల్ల ఆదాయం సమకూరింది.
అక్రమంగా వెలుస్తున్న వెంచర్లు
జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాలతో పాటు మండలాల్లో, జాతీయ రహదారి వెంట నింబధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి పట్టణ శివారులోని జాతీయ రహదారి వెంట నర్సన్నపల్లి, టేక్రియాల్‌ చౌరస్తా, అడ్లూర్‌ ఎల్లారెడ్డి తదితర శివారు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఎకరానా రూ.కోటి నుంచి కోటిన్నర వరకు, గజం భూమి 15వేల నుంచి 20 వేల వరకు విక్రయాలు జరుపుతున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోనూ, శివారు ప్రాంతాల్లోనూ ఎకరాల చొప్పున వ్యవసాయ భూములను నింబధనలకు విరుద్ధంగా ప్లాట్లుగా మార్చేస్తున్నారు. అదేవిధంగా భిక్కనూరు, దోమకొండ, పిట్లం, బిచ్కుంద, సదాశివనగర్‌, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి మండల కేంద్రాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలుస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారు. నాలా కన్వర్షన్‌ తీసుకోకుండా, లే అవుట్‌ అనుమతులు లేకుండానే ప్లాట్లుగా మార్చేస్తున్నారు. కనీసం వెంచర్లలో డ్రైనేజీ, విద్యుత్‌, మంచినీటి, రోడ్ల సౌకర్యాలు కల్పించకుండానే స్కీమ్‌ల పేరిట ప్లాట్లను విక్రయిస్తూ సామానుల్యను మోసం చేస్తున్నారు.
సమయపాలన పాటించని అధికారులు
భూముల ధరలు పెరిగినప్పటి నుంచి జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరందుకుంది. చాలా వరకు వ్యవసాయ భూములను రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులకు అమ్మకాలు జరుపుతుండడంతో ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జిల్లాలోని ఆయా రిజిస్ట్రేషన్‌ కేంద్రాల్లో అధికారులు సమయపాలన పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో సదరు అధికారులు వచ్చే వరకు బ్రోకర్లే కార్యాలయానికి వచ్చిన వారిని తమ మాటలతో గారడి చేసి తమ ద్వారానే రిజిస్ట్రేషన్‌లు జరిగేలా చూస్తున్నారని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయ అధికారి స్థానికంగా ఉండాల్సి ఉన్నా హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తూ నిత్యం రెండు, మూడు గంటలు లేటుగా వస్తున్నారని సమాచారం. మంగళవారం సైతం ఉదయం 11 దాటినా సదరు అధికారి మాత్రం ఇంకా కార్యాలయానికి మాత్రం రాలేదు.
బ్రోకర్లదే దందా
జిల్లాలోని ప్రతీ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో బ్రోకర్లతో వెళితే కానీ పని కానీ పరిస్థితి ఏర్పడుతోంది. భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నందున రిజిస్ర్టేషన్‌ సంఖ్య పెరగడం, అంతా ఆన్‌లైన్‌ కావడంతో కొనేవారు, అమ్మేవారు అంతా బ్రోకర్లనే ఆశ్రయిస్తున్నారు. పని తొందరగా కావాలన్నా ఉద్దేశ్యంతో వినియోగదారుడు ఆన్‌లైన్‌ ఖర్చులతో పాటు వీరికి ఇచ్చే డబ్బులు కూడా పెరిగిపోతున్నాయి. బ్రోకర్లు, అధికారులు మిలాఖత్‌ కావడంతో ఎవరైనా నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సమయానికి కార్యాలయానికి వచ్చినప్పటికీ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల సమీపంలో దస్తావేజు లేఖర్లతో పాటు బ్రోకర్ల అడ్డాలు సైతం వెలుస్తున్నాయి. కామారెడ్డి సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో 30 మందికి పైగా దస్తావేజులేఖర్లు ఉండగా బాన్సువాడ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయ పరిధి సమీపంలో 20కి పైగా దస్తావేజులేఖర్ల కార్యాలయాలు వెలిశాయి. అదేవిధంగా దోమకొండ, బిచ్కుంద, సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయం పరిధిలోనూ దస్తావేజులేఖర్ల కార్యాలయాలు ఉన్నాయి. వీరితో పాటు బ్రోకర్ల అడ్డాలు సైతం ఉన్నాయి. సబ్‌ రిజిస్ర్టేషన్‌లో ఏ పని కావాలన్నా వీరితో వెళితే ఇట్టే పని అవుతోంది. ప్లాటుకు ఓ రేటు, ఎకరం భూమి రిజిస్ర్టేషన్‌ మరో రేటుగా ఫిక్స్‌ చేస్తూ వినియోగదారుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. బ్రోకర్లను కాదని రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలకు వెళితే గంటల తరబడి వేచి చూడాల్సిందే. అధికారులు సైతం బ్రోకర్ల వత్తాసు పలుకుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2021-08-11T05:05:45+05:30 IST