రైతుల ఖాతాల్లో.. రైతుబంధు

ABN , First Publish Date - 2021-06-17T04:41:48+05:30 IST

వానాకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగులో రైతులు బిజీ అయ్యారు.

రైతుల ఖాతాల్లో.. రైతుబంధు

- రైతుల ఖాతాలో జమ అవుతున్న పెట్టుబడి సాయం
- దశలవారీగా నగదు జమ
- జిల్లాలో 2.71 లక్షల మంది లబ్ధిదారులు
- కొత్తగా మరో 15వేల మందికి లబ్ధి చేకూరుస్తున్న రైతుబంధు
- ఇప్పటికే ఎకరంలోపు ఉన్న 90వేల మంది రైతులకు నగదు జమ


కామారెడ్డి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి):
వానాకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగులో రైతులు బిజీ అయ్యారు. రైతుకు పంటల సాగు కోసం పెట్టుబడి అందించేందుకు ప్రభుత్వాలు సైతం సిద్ధమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ అయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు నిధులను సైతం రెండు రోజుల నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు అందిస్తున్న పెట్టుబడి సాయం పంటల సాగుకు రైతులకు కాస్తా ఊరట నిస్తోంది.
జిల్లాలో 2.71లక్షల మంది లబ్ధిదారులు
రైతుబంధు పథకంలో భాగంగా మంగళవారం నుంచి రైతుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ ప్రక్రియ ప్రారంభించింది. ప్రతీ రైతుఖాతాలో ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 2,71,614 మంది రైతులు రైతుబంధుకు అర్హులుగా వ్యవసాయ, రెవెన్యూశాఖలు గుర్తించాయి. ఇందులో ఈ సీజన్‌లో 15,906 మంది కొత్తవారు అర్హులుగా పొందినట్లు ఆయా శాఖలు వారి పేర్లను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. వీరందరిని కలుపుకొని రూ.559 కోట్లు ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందజేయనుంది. ఇప్పటికే రెండు రోజుల నుంచి ఈ నిధులను ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది.
విడతల వారీగా నగదు జమ
రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరాన రూ.5వేల చొప్పున నిధులను విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేయనుంది. జిల్లా వ్యాప్తంగా 2లక్షల 71వేల 614 మంది రైతుబంధుకు అర్హులుగా గుర్తించారు. ఇందులో మొదటి విడతగా ఒక ఎకరం ఉన్నవారికి పెట్టుబడి నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులు 90,073 మంది ఉన్నారు. వీరి ఖాతాలో ఇప్పటికే రూ.5వేలు పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. అదేవిధంగా 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరికి రెండో విడత కింద నిధులను ప్రభుత్వం ఖాతాలో జమ చేయనుంది. 5 ఎకరాలపైనే రైతులకు మూడో   విడతలో రైతుబంధు నిధులు జమ కానున్నాయి. ఇలా దశలవారీగా ఈ నెల 25లోపు రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు.
రైతులకు ఆసరా కానున్న రైతుబంధు
జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. సోయా,పత్తి, మొక్కజొన్న వరి విత్తనాలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో సోయా, పత్తి, మొక్కజొన్న విత్తనాలను విత్తుతున్నారు. బోరుబావులు, ప్రాజెక్టుల కింద వరినాళ్లు వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్‌లకు అధిక ధరలు రైతులు వేచించాల్సి వస్తోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు అప్పులు చేసి కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వాలు అందజేస్తున్న పీఎం కిసాన్‌, రైతుబంధు పథకాల పెట్టుబడి సాయం రైతులకు కాస్తా సాయం కానుంది.

Updated Date - 2021-06-17T04:41:48+05:30 IST