చిన్నాపూర్‌ అడవిలో.. అరణ్య అర్బన్‌

ABN , First Publish Date - 2021-12-20T05:27:58+05:30 IST

జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చిన్నాపూర్‌ అటవీ ప్రాంతంలో ప్రజల కోసం పార్కును అభివృద్ధి చేస్తున్నారు. నగరంతో పాటు జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కువ విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు.

చిన్నాపూర్‌ అడవిలో.. అరణ్య అర్బన్‌

రాష్ట్రంలోనే అతి పెద్ద పార్కు నిర్మాణం  

411 ఎకరాల విస్తీర్ణంలో పార్కు 

జిల్లా ప్రజలకు ఉపయోగపడేవిధంగా ఏర్పాట్లు  

ఆరు నెలల్లో అందుబాటులోకి

నిజామాబాద్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చిన్నాపూర్‌ అటవీ ప్రాంతంలో ప్రజల కోసం పార్కును అభివృద్ధి చేస్తున్నారు. నగరంతో పాటు జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కువ విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. అటవీ, నుడా నిధులతో పాటు ఇతరశాఖల ద్వారా వెచ్చించి త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలోనే అన్ని రకాల వసతులను పార్కుకు వచ్చేవారికి కల్పించేందుకు నిర్మాణాలు చేపడుతున్నారు. జాతీయ రహదారి పక్కనే పార్కు ఏర్పాటు చేయడం వల్ల ఆ వైపు నుంచి వెళ్లేవారు కూడా అవసరమైతే కొంతసేపు సేదదీరేవిధంగా ఈ పార్కు నిర్మాణం చేస్తున్నారు.

ఫ 411 ఎకరాల విస్తీర్ణంలో.. 

మాక్లూర్‌ మండలం చిన్నాపూర్‌  అటవీ ప్రాంతం అరణ్య అర్బన్‌ పార్కు పేరున ఈ కొత్త పార్కు నిర్మాణం చేస్తున్నారు. నిజామాబాద్‌-ఆర్మూర్‌ ప్రధాన రహదారి వెంట 166.40 హెక్టార్‌ల విస్తీర్ణంలో ఈ పార్కు నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం 411 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కువ మంది వచ్చిన ఆహ్లాదంగా ఉండేవిదంగా ప్రణాళికలు రూపొందించి నిర్మాణం చేస్తున్నారు. ఈ అర్బన్‌ పార్కులో విసిటర్‌ జోన్‌, వాచ్‌ టవర్‌, చెక్‌డ్యాం, సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. అటవిని అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనం మొత్తం పార్కు అంతా ఉండేవిధంగా చెట్లను పెంచనున్నారు. ప్రత్యేకంగా నర్సరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలు పెంచడంతో పాటు పార్కుకు వచ్చేవారికి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి వచ్చేవారికి కోసం ఫిట్‌నెస్‌ సెంటర్‌లను కూడా నిర్మాణాలు చేస్తున్నారు. పర్యావరణాన్ని వివరించేందుకు ఓపెన్‌ క్లాస్‌ రూంలు, ట్రెక్కింగ్‌ కోసం ప్రత్యేక లైన్‌లను వేస్తున్నారు. ఎవరైనా అటవీ చుట్టూ పార్కులో నడిచివచ్చేవిధంగా దారులను నిర్మాణం చేస్తున్నారు. నీటికి ఇబ్బందిలేకుండా ఉండేందుకు వాటర్‌ ట్యాంకును కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

ఫ రాష్ట్రస్థాయిలోనే అతిపెద్దగా..

అరణ్య అర్బన్‌ పార్కు అభివృద్ధి కోసం నుడా నుంచి రూ.69లక్షలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ నిధులే కాకుండా అటవీశాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలవుతున్న నిధులను వెచ్చిస్తున్నారు. మరిన్ని నిధులను మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఇతర శాఖల ద్వారా వెచ్చించేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే అతిపెద్ద పార్కుగా నిర్మాణం చేసేందుకు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితమే ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి,  సీఎంవోఎస్‌డీ ప్రియాంకవర్గీస్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డితో పాటు ఇతర అధికారులు పార్కును పరిశీలించారు. నిర్మాణాలపైన సమీక్షించారు. త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలను ఇచ్చారు. అవసరమైన నిధులను ఇతర శాఖల ద్వారా మంజూరు చేయించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ పార్కు నిర్మాణాన్ని ఆరు నెలలోపు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవిధంగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. గుట్టల మధ్య ప్రకృతిసిద్ధమైన అటవీ ప్రాంతంలో నిర్మాణం అవుతున్న ఈ పార్కు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది. అటవీ ప్రాంతంలో అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పార్కు నిర్మాణం చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌ తెలిపారు. నుడా నిధులతో పాటు ఇతర నిధులతో నిర్మాణం చేస్తున్నామన్నారు. పర్యావరణం కాపాడడంతో పాటు వనసంపదను పెంచేవిధంగా ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-12-20T05:27:58+05:30 IST