కదలని బస్సులు

ABN , First Publish Date - 2021-09-03T05:46:28+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు పునఃప్రారంభ మైనప్పటికీ ప్రైవేటు పాఠశాలల బస్సులు మాత్రం కదలడం లేదు. కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా విద్యా సంస్థల బంద్‌తో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు మూలనపడ్డాయి.

కదలని బస్సులు

పర్మిట్‌ ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు చెల్లించేందుకు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వెనకడుగు

గతేడాది పర్మిట్‌ ట్యాక్స్‌లపైనా సందిగ్ధం

అయోమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు

ఇక ప్రభుత్వ నిర్ణయమే కీలకం  

బోధన్‌, సెప్టెంబరు 2: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు పునఃప్రారంభ మైనప్పటికీ ప్రైవేటు పాఠశాలల బస్సులు మాత్రం కదలడం లేదు. కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా విద్యా సంస్థల బంద్‌తో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు మూలనపడ్డాయి. దీంతో విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల పర్మిట్‌ ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు చెల్లించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బస్సులకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి కావడంతో ఆర్టీఏ అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. ఫిట్‌నెస్‌ పొందాలంటే పర్మిట్‌ ట్యాక్స్‌ చెల్లింపుతో పాటు ఇన్సూరెన్స్‌ తప్పనిసరి కావడంతో పీటముడి పడింది. గత ఏడాది విద్యాసంస్థలే నడవలేదు. బస్సులను వినియోగించలేదు. అలాంటప్పుడు పర్మిట్‌ ట్యాక్స్‌ను ఎలా చెల్లించేదని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. 

ప్రైవేటు విద్యాసంస్థలపై పర్మిట్‌ ట్యాక్స్‌ భారం..

జిల్లాలో సుమారు 600పైనే ప్రైవేటు విద్యాసంస్థలు ఉండగా.. రెండు వేలపైనే బస్సులు ఉన్నాయి. ఈ బస్సులతోనే లక్షలాది మంది చిన్నారులను బడులకు చేరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థల  ద్వారానే ఉన్నత విద్య దరిచేరుతోంది. కానీ, కరోనా విపత్తు వల్ల విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. గతఏడాది కరోనా విపత్తు వల్ల బడులు తెరుచుకోక.. బస్సులు బయటకు రాక.. ప్రైవేటు విద్యాసంస్థలు ఎలాంటి పన్నులను చెల్లించలేదు. ఒక్కో బస్సుకు ఏడాదికి నాలుగైదు వేల రూపాయలపైనే పర్మిట్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. సీటింగ్‌ కెపాసిటీని బట్టి బస్సులకు బీమా కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో బస్సుకు కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఏడాదికి బీమా, పర్మిట్‌ ట్యాక్స్‌ చెల్లింపులు ఉంటాయి. గత ఏడాది పర్మిట్‌ ట్యాక్స్‌ను ఈ ఏడాది చెల్లించాలన్న నిబంధనలు విధించడంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఒక్కో బస్సుకు రెండేళ్లకు గాను పర్మిట్‌ ట్యాక్స్‌ సుమారు 10 వేల రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితులు ఉండడంతో ప్రైవేటు యాజమాన్యాలు హైరానా పడుతున్నాయి. ఇప్పటికే కరోనా విపత్తు వల్ల ఆర్థికంగా చితికిపోయిన బడ్జెట్‌ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నాచితక పాఠశాలలు ఇబ్బందులను ఎదుర్కొంటుడగా పర్మిట్‌ ట్యాక్స్‌ వ్యవహారం ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ప్రభుత్వం పర్మిట్‌ ట్యాక్స్‌ విషయంలో స్పందించాలని, గత ఏడాదికి సంబంధించిన పర్మిట్‌ ట్యాక్స్‌ను రద్దు చేయలాని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవద్దని చిన్న పాఠశాలలను కాపా డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ప్రైవేటు విద్యా సంస్థలు కోరుతున్నాయి. 

ఫిట్‌నెస్‌కు ముందుకు రాని బస్సులు

బడులు ప్రారంభమై రెండు రోజులు గడిచిపోయినా ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఇంకా రోడ్డెక్క లేదు. జిల్లాలో సుమారు రెండు వేలపైనే ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఉన్నా.. పదుల సంఖ్యలో కూడా ఫిట్‌నెస్‌కు ముందుకు రా లేదు. పర్మిట్‌ ట్యాక్స్‌లు చెల్లించేందుకు, ఇన్సూరెన్స్‌లు కట్టేందుకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వెనుకాముం దాడుతున్నాయి. కరోనా ఏడాది ఫీజులు వసూలు కాక గత ఏడాది పాఠశాలలు నడవక ఇబ్బందులు ఎదుర్కొంటుడగా ఇప్పుడు ఒక్కో బస్సుకు వేలాది రూపాయలు ఎక్కడి నుంచి కట్టేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. అంతేకాకుం డా విద్యాసంస్థలు ఈ ఏడాదంతా పూర్తికాలం నడుస్తాయన్న నమ్మకం కూడా లేకపోవడంతో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అయోమయానికి గురవుతున్నాయి. పర్మిట్‌ ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు చెల్లించాక కరోనా సాకు చూపి మళ్లీ విద్యాసంస్థలను మూతపెడితే తమ పరిస్థితి ఏమిటని, వేలాది రూపాయలు ట్యాక్స్‌ల రూపంలో కట్టి ఇంకా న ష్టపోతామని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లుగా మారింది. బడులు ప్రారంభమయ్యాయన్న సంతోషం ఒక వైపు.. వేలాది రూపాయల ట్యాక్స్‌ల చెల్లింపు ఆందోళన మరో వైపు మున్నాళ్ల ముచ్చటగా మారితే మోయలేని భారం అవుతుందని మరో వైపు గందరగోళ పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి. 

 అయోమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు 

బడులు ప్రారంభమైనా ప్రైవేటు విద్యాసంస్థలు బస్సులను రోడ్డు ఎక్కించకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బోధన్‌ డివిజన్‌లో సుమారు 100పైనే ప్రైవేటు విద్యాసంస్థలు ఉండగా 500పైనే బస్సులు ఉన్నాయి. రెండు, మూడు పాఠశాలలకు చెందిన సుమారు పది బస్సులు మాత్రమే రోడ్డు ఎక్కాయి. మిగతా పాఠశాలలన్నీ గందరగోళంలో పడ్డాయి. ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించిన పర్మిట్‌ ట్యాక్స్‌ను మిన హాయించాలని ఎదురుచూపు చూస్తున్నాయి. పర్మిట్‌ ట్యాక్స్‌లు, స్పీడ్‌ గవర్నర్‌లు, ఇతర ఆంక్షలను సడలిస్తే వాహనాల ఫిట్‌నెస్‌కు ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా చితికిపోయిన ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వమే ప్రైవేటు వి ద్యాసంస్థలు బస్సుల విషయంలో ఆలోచించాలని విద్యాసంస్థల యాజమాన్యాలు కోరుతున్నాయి. బడులు ప్రారంభమై నా బస్సులు రాకపోతే విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదముంది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల విషయంలో స్పష్టతను ఇస్తే కానీ విద్యా వ్యవస్థలో గాడిలో పడే అవకాశం లేదు. లేనట్లయితే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావడంతో పాటు బడుల ప్రారంభం లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. అలాగే, ప్రైవేటు విద్యాసంస్థలు మరింత చితికిపోయే ప్రమా దముందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2021-09-03T05:46:28+05:30 IST