జోరుగా గుట్కా దందా

ABN , First Publish Date - 2021-11-02T06:08:03+05:30 IST

జిల్లాలో గుట్కా విక్రయాలకు అడ్డుఅదుపూ లే కుండా పోతోంది. పక్కా ప్రణాళికతో జిల్లా అంతటా జోరుగా అమ్మకాలు చేస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర నుంచి గుట్కాను తీసుకువస్తూ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జోరుగా గుట్కా దందా

జిల్లాలో భారీగా గుట్కా విక్రయాలు 

కర్నాటక, మహారాష్ట్ర నుంచి జిల్లాకు సరఫరా  

జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలింపు  

పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న నిల్వలు

నిజామాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో గుట్కా విక్రయాలకు అడ్డుఅదుపూ లే కుండా పోతోంది. పక్కా ప్రణాళికతో జిల్లా అంతటా జోరుగా అమ్మకాలు చేస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర నుంచి గుట్కాను తీసుకువస్తూ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేతల అండదండలతో దుకాణాలకు సరఫరా చేస్తూ అమ్మకాలను చేస్తున్నా రు. కేసులు నమోదైనా.. అమ్మకాలను ఆపడంలేదు. అధికారుల నిఘా పెరగడంతో నిత్యావసర వస్తువులతో కలిపి గుట్కాను తరలిస్తున్నారు. నగరం చుట్టూ కేంద్రాలను ఏర్పాటు చేసి నిల్వచేస్తూ అవసరం ఉన్న ప్రాంతాలకు సమాచారం ఆధారంగా రాత్రివేళలో తరలిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వాడకం ఉండడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజూ లక్షల రూపాయల విక్రయాలు జరుగుతున్నాయి. పెట్టుబడికి మించి లాభాలు ఉండడంతో కొన్నేళ్లుగా కొంతమంది ఇదే వృత్తిగా చేసుకున్నారు.

అధికారుల సహకారంతో అమ్మకాలు..

గుట్కా విక్రయంలో లాభాలు ఉండడంతో కిందిస్థాయి అధికారుల సహకారంతో ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేస్తున్నారు. గుట్కాను ఇతర ప్రాంతాలనుంచి తీసుకువచ్చి తమకు ఉన్న నేతల పలుకుబడితో సరఫరా చేస్తున్నారు. భారీగా పట్టుబడిన సమయంలో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు తీసుకువచ్చి బయటపడుతున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా తీసుకువచ్చి గుట్కాను సరఫరా చేయగా ప్రస్తుతం కర్నాటక నుంచి ఎక్కువగా గుట్కాను తీసుకువస్తున్నారు. జిల్లాతో పాటు పక్కనే ఉన్న కామారెడ్డి, నిర్మల్‌, ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఈ గుట్కా ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ఉన్న కర్నాటకలోని బీదర్‌, గుల్బర్గ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాల్లో తయారు చేసి జిల్లాకు సరఫరా చేస్తున్నారు. వాహనాల ద్వారా కూరగాయ లు, ఇతర నిత్యావసర వస్తువులతోపాటు గుట్కాను తరలిస్తున్నారు. డీసీఎం  వ్యా న్‌లు, ఆటో లు, ఇతర వాహనాల ద్వా రా స రఫరా చే స్తున్నా రు. కొంతమంది కోళ్లదానా, ఇతర వస్తువుల మ ధ్యలో పెట్టి సరఫరా చేస్తున్నారు. పక్కాగా ప్రణాళిక ప్రకారం జిల్లాకేంద్రానికి తరలించి అక్కడ నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా మండలాలకు తరలిస్తున్నారు. మండలాల నుంచి ఆయా గ్రామాల పరిదిలోని షాప్‌లకు సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ పనులు, ఇతర పనుల్లో నిమగ్నమయ్యే వారు ఎక్కువగా ఈ గుట్కాకు అలవాటు పడడంవల్ల అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. 

నగరం చుట్టుపక్కల ప్రాంతాలే అడ్డాలు..

నిజామాబాద్‌ నగరం చుట్టుపక్కల ప్రాంతాలే గుట్కాకు అడ్డాలుగా ఉన్నాయి. కర్నాటక, మహారాష్ట్ర నుంచి వాహనాల ద్వారా గుట్కా జిల్లాకేంద్రానికి రాగానే అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. సరుకు దిం పగానే ఆటో లు, ఇతర వాహనాల ద్వారా తరలిస్తున్నారు. మి గిలిన గుట్కా ను అడ్డాలో నిల్వ చేస్తున్నారు. నగరం పరిధిలో గత కొన్నేళ్లుగా గుట్కా వ్యాపారంలో నిమగ్నమైనవారు ఎక్కువ మొత్తంలో ఉండడంతో వారి ద్వారా ఈ సరఫరా కొనసాగుతుంది. ఈ సరఫరదారులకు నేతల అండదండలు ఉండం వల్ల ఎలాంటి భయాంధోళనలు లేకుండాగుట్కా అక్రమంగా తరలిస్తున్నారు. తమకు అడ్డువచ్చిన లేదా పట్టుకున్న నయానో బయానోచెప్పి తప్పించుకుంటున్నారు. కొన్ని సార్లు భారీ మొత్తంలో మామూళ్లను ఇచ్చి కేసులు కాకుండ చూసుకుంటున్నారు. 

కఠినంగా వ్యవహరిస్తేనే దందాకు అడ్డుకట్ట..

ప్రతి రోజూ ఏదో ఒక దగ్గర గుట్కాను పట్టుకుని అధికారులు సీజ్‌ చేస్తున్నా ఈ రవాణా మాత్రం ఆగడంలేదు. పూర్తిస్థాయిలో నిఘా పెడితే తప్ప రవాణా ఆగే పరిస్థితిలేదు. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకుంటే తప్ప రవాణా తగ్గే పరిస్థితిలేదు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు కొన్ని స్టేషన్‌ల పరిధిలో అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం వల్ల కూడా రవాణ  కొనసాగుతోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో సరఫరా చేసేవారిపైన కేసులు నమోదు చేస్తున్నా రవాణామాత్రం ఆగడంలేదు. గడిచిన 10 రోజుల్లో సుమారు 30లక్షల విలువైన గుట్కాను పోలీసు అధికారులు పట్టుకున్నారు. కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ గుట్కా రవాణాకు సూత్రధారులైన వారిపైన మాత్రం నిఘా పెట్టకపోవడం వల్ల ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. 

కేసులు నమోదు చేస్తున్నాం..

ఫ వెంకటేశ్వర్లు, ఏసీపీ

జిల్లాలో పలుచోట్ల గుట్కా సరఫరా చేస్తుండగా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నాం. పలుచోట్ల నిఘా పెట్టడంతో పాటు ఆకస్మిక దాడులు చేస్తూ పట్టుకుంటున్నాం. ఎవరైనా గుట్కా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశాం.

Updated Date - 2021-11-02T06:08:03+05:30 IST