గుప్పుమంటున్న గుడుంబా

ABN , First Publish Date - 2021-10-20T04:38:19+05:30 IST

జిల్లాలోని పల్లెలు, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది.

గుప్పుమంటున్న గుడుంబా
గుడుంబా తయారు చేస్తున్న దృశ్యం

- జిల్లాలో గుట్టుగా గుడుంబా తయారీ
- పల్లెల నుంచి పట్టణాల దాక జోరుగా విక్రయాలు
- రూ. లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు
- గుడుంబా మూలలపై దృష్టి సారించని ఎక్సైజ్‌శాఖ


కామారెడ్డి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పల్లెలు, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు. గుడుంబాను నిరోధించాల్సిన సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టి పెట్టకుండా అడపాదడప దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో గుడుంబా తయారు చేసేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ పలు పథకాలను అమలు చేసింది. అయినప్పటికీ కొందరు గుడుంబా కాయడమే వృత్తిగా పెట్టుకుని పల్లెలో, తండాల్లో జోరుగా దందాను సాగిస్తున్నారు. గుడుంబా కేవలం పల్లెలు, తండాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణాలకు సైతం పాకింది.
జోరుగా నాటుసారా తయారీ
జిల్లాలో నాటుసారా తయారీ జోరందుకుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరలో లభించే గుడుంబా వైపు మరులుతున్నారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు. ఎల్లారెడ్డి, గాంధారి, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, జుక్కల్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, బాన్సువాడ తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై ఇతర గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారు చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో గుడుంబా తయారీ పెద్దఎత్తున సాగేది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేయడానికి బెల్లం తయారీని నిషేధించింది. దీంతో సారా తయారీకి అలవాటు పడిన కుటుంబాలకు వివిధ ఉపాఽధి అవకాశాలు కల్పించారు. అనంతరం వారు సారా తయారీ మానుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి సారా గుప్పు మంటోంది. కొందరు తమ కోసం ఇప్పపువ్వుతో మేలి రకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు.
మందుబాబులు నాటుసారా వైపు
మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచించాల్సి వస్తోంది. క్వాటర్‌ మద్యం కొనాలన్నా రూ.100కు పైగానే ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరలో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో పేదలు, కూలీలు నివసించే పలు కాలనీల్లో గుడుంబా, సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాలతో పాటు పలు మండలాల్లోనూ గుడుంబా అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారి కూలీ పనులు చేసుకుని బతికేవారు చాలా మంది సారా, గుడుంబా తాగుతున్నట్లు సమాచారం.
గుడుంబాపై నిఘా కరువు
జిల్లాలో నిషేధిత గుడుంబాపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిసారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అమ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుట్టుగా తయారీ చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్‌ అధికారులు తండాలపై దాడులు నిర్వహించి సారా అమ్మకాలపై వెతుకుతున్నారు. మూలాలను వెతకకుండా ఎక్కడో ఒకచోట దాడులు నిర్వహిస్తున్నారు. సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉంది.

Updated Date - 2021-10-20T04:38:19+05:30 IST