బాన్సువాడ ఆర్టీసీ డిపోలో డ్యూటీల్లో గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2021-02-06T04:59:42+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఆర్టీసీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. కరోనా కారణంగా బ స్సుల్లో ప్రయాణికులు లేక అంతంతమాత్రంగానే ఆదా యం వస్తోంది. మరోవైపు డిపోలో అధికారుల వేధింపులు కండక్టర్లు, డ్రైవర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఇద్దరి అధికారులే రాజ్యమేలుతున్నారు.

బాన్సువాడ ఆర్టీసీ డిపోలో డ్యూటీల్లో గోల్‌మాల్‌

నచ్చినోళ్లకే డ్యూటీలు.. లేకుంటే స్పేర్‌లు

డ్రైవర్లు, కండక్టర్లకు తప్పని వేధింపులు

పట్టించుకోని డిపో ఉన్నతాధికారులు 


బాన్సువాడ టౌన్‌, ఫిబ్రవరి 5 : లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఆర్టీసీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది.  కరోనా కారణంగా బ స్సుల్లో ప్రయాణికులు లేక అంతంతమాత్రంగానే ఆదా యం వస్తోంది. మరోవైపు డిపోలో అధికారుల వేధింపులు కండక్టర్లు, డ్రైవర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఇద్దరి అధికారులే రాజ్యమేలుతున్నారు. ఆ ఇద్దరిని కాదని ఎవరైనా ఎదురుతిరిగితే వేధింపులు షురు అవుతాయి. ఇదేం బాధరా నాయనా.. అంటూ ఉద్యోగులు గుండె రా యి చేసుకొని కిమ్మనకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.


బాన్సువాడ డిపోలో 90కి పైగా బస్సులున్నాయి. ప్రతీ రోజు 105 రూట్లలో ఈ బస్సు సర్వీసులు కొనసాగుతాయి. 500 మంది వరకు ఉద్యోగులు డిపోలో విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూటీలు వేసే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఆర్టీసీ డిపో ఆదాయం పై తీవ్ర ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వెలువడుతోంది. ఆ ఇద్దరు అధికారులు డిపోలో కండక్టర్లు, డ్రైవర్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆ అధికారుల పనితీరు ఉద్యోగులను కలచివేస్తోంది. సాటి ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఇష్టారీతిన మాట్లాడటం వారికి పరిపాటైపోయిందన్నట్లుగా కనిపిస్తోంది.


ముఖ్యంగా మహిళా ఉద్యోగినుల సమస్యలను తెలుసుకోకపోవడం, సెలవు అడిగినా డ్యూటీలు చేయించడం పట్ల మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికారులు  తమ ఇంటి అవసరాల కోసం ఏకంగా డ్రైవర్లు, కండక్టర్లను వాడుకుంటున్నట్లు సమాచారం. డ్యూటీ వేసే వారికి కూరగాయలు, బియ్యం, మందు, విందు ఏర్పాటు చేస్తేనే సై.. లేదంటే డ్యూటీ నై అన్న చందంగా తయారైందనే ఊహాగానాలు వినడబుతున్నాయి.


ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అధికారులు డిపోలో అన్నీ తామై ఏకఛత్రాధిపత్యం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరు తానా అంటే.. మరొకరు తందానా అంటూ ఒకరికొకరు వంత పాడుకుంటూ ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో సెలవు ఇవ్వమని ప్రాధేయపడితే మానవత్వం సహితం మరిచి సెలవు ఇవ్వకుండా వేధిస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సదరు అధికారుల ఆగడాలపై కండక్టర్లు, డ్రైవర్లు డిపో ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ చూసీ చూడనట్లు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.


కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు వారి తీరుపై డిపో అధికారికి ఫిర్యాదు చేయగా, సార్లకు ఫోన్‌ ఎందుకు చేశావ్‌? ఇక్కడ నేనే అంతా మేమే.. సార్లకు ఫోన్‌ చేస్తే బాగుండదు.. జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేస్తే బాగుండదు.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చేసేదేమి లేక డ్రైవర్లు, కండక్టర్లు మాటలు పడుకుంటూనే విధులు నిర్వర్తిస్తున్నామని తోటి వారితో తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. మరికొంతమంది ఉద్యోగులు విధులు చేపట్టాలా? వద్దా? అన్న సంశయంలో ఉండిపోతున్నారు.


సీనియర్లను విస్మరించి జూనియర్లకు ప్రాధాన్యత కల్పించడంలో వీరు స్పెషలిస్టులు. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోండి అని దబాయిస్తున్నట్లు సీనియర్లు వాపోతున్నారు. తక్కువ కిలో మీటర్లు ఉన్నవారి డ్యూటీని అనకూలమైన వారికి, ఎక్కువ కిలోమీటర్ల డ్యూటీలను నచ్చని వారికి కేటాయిస్తున్నారని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. 


కండక్టర్లు, డ్రైవర్లతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి

సాయన్న, బాన్సువాడ డిపో మేనేజర్‌ 

ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు కండక్టర్లు, డ్రైవర్లతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. అందరూ కలిసి కట్టుగా ఉంటూ డిపో అభివృద్ధికి కృషి చేయాలి. కక్ష్య సాధింపు చర్యలకు తావులేదు. ఎవరైనా దురుసుగా మాట్లాడినట్లుగా నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటా. 

Updated Date - 2021-02-06T04:59:42+05:30 IST