ఉగ్ర కదలికలు!!

ABN , First Publish Date - 2021-07-08T06:22:22+05:30 IST

ఉగ్ర కదలికలు పోలీసులకు సవాళుగా..

ఉగ్ర కదలికలు!!

జిల్లాలో పోలీసులకు సవాల్‌గా టెర్రరిస్టు జాడలు

అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టిన నిఘా వర్గాలు

ఇంటలిజెన్స్‌ అధికారుల అదపులో బోధన్‌ వాసి

అప్రమత్తమైన స్థానిక పోలీసు యంత్రాంగం

మరింత లోతుగా కేంద్ర నిఘా వర్గాల దర్యాప్తు

గతేడు సంచలనం రేపిన రోహింగ్యాల పాస్‌పోర్టు వ్యవహారం


నిజామాబాద్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఉగ్ర కదలికలు పోలీసులకు సవాళుగా మారుతున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇప్పుడప్పుడే టెర్రరిస్టుల జాడలు బయటపడుతున్నాయి. అయితే విదేశీ లింకులతో ఈ కదలికలు ఉంటుండడంతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తు నజర్‌ పెడుతున్నా.. కొన్నిసార్లు ఇవి బయటపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల బోధన్‌లో ఉగ్ర కదలికలకు సంబంధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నెలన్నర తర్వాత ఈ విషయం బయటకి పొక్కడంతో స్థానిక పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇతర ఏజెన్సీలతో కలిసి మరింత లోతుగా దర్యాప్తును మొదలుపెట్టారు. 


రెండు దశాబ్దాలలో నాలుగైదు కేసులు

జిల్లాలో గడిచిన రెండు దశాబ్దాలుగా ఉగ్రవాద కదలికలకు సంబంధించిన కేసులు నాలుగైదు వరకు బయటపడ్డాయి. అయితే, ఈ 20 ఏళ్లలో ఈ ఘటనలకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిద్దరు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ప్రతీసారి ఈ కదలికలకు సంబంధించిన లింకులు దేశంలోని ఏదో ఒక ప్రాంతంతో పాటు విదేశాలకు లింకు ఉండడంతో జిల్లాలో ఎప్పటికప్పుడు నిఘా వర్గాలను అప్రమత్తం చేస్తూనే చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం చివరన బోధన్‌లో రోహింగ్యాల కేసు బయటపడింది. స్థానికులు కాకుండా బోధన్‌ కేంద్రంగా సుమారు 70 మందికి పైగా పాస్‌ పోర్టులను పొందారు. ఈ కేసు పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో బయటపడడంతో అక్కడ నుంచి నిఘా వర్గాలు దృష్టిపెట్టగా బోధన్‌ కేంద్రంగా ఇవి జారీ అయినట్లు గుర్తించారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఇవ్వడంతో వాటికి సంబంధించిన వారిని అరెస్టు చేశారు. సహకరించిన వారిపైన కేసులు పెట్టారు. ఇద్దరిని సస్పెండ్‌ కూడా చేశారు. 


బోధన్‌, నిజామాబాద్‌లతో లింకులు

జిల్లాలో రెండు దశాబ్దాలకు ముందు బోధన్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లో ఈ లింకులను కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్ర కదలికలకు సంబంధించిన కొద్దిమంది సంచరించడంతో పాటు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని గుర్తించారు. వారిలో ఒకరు జగిత్యాల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మరొకరు ఇతర ప్రాంతంలో మృతి చెందారు. ఆ తర్వాత నిఘా వర్గాలు దృష్టిపెట్టినా.. అప్పుడప్పుడు ఈ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బోధన్‌కు చెందిన వ్యక్తి సౌదీ కేంద్రంగా లింకులు ఉన్న వ్యక్తితో సంబంధం ఉన్నట్లు బయటపడింది. దీంతో ఐబీ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర కౌంటర్‌ ఇంటలిజెన్స్‌కు చెందిన అధికారులు 45 రోజుల క్రితం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఈ కేసులో కేంద్ర నిఘా వర్గాలతో పాటు ఎన్‌ఐఏ, ఇతర అధికారులు కూడడా దృష్టి పెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బోధన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆ వ్యక్తి ఎవరినైనా కలిశాడా? అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. ఆయనను ఎవరెవరు? ఏయే ప్రాంతం వారు కలిశారో? ఆరా తీస్తున్నారు. సీనియర్‌ అధికారులు దృష్టిపెట్టి ఈ కేసును శోధిస్తున్నారు. బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో ఈ కేసు బయటపడడంతో మరింత అప్రమత్తమై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయం బయటపడడంతో బోధన్‌లో కలకలం మొదలైంది. 


ఆలస్యంగా వెలుగులోకి ఉగ్ర జాడలు

జిల్లాలో మొదటి నుంచి ఉగ్ర కదలికలపై నిఘా వర్గాలు గట్టి దృష్టి పెట్టినా.. ఈ మధ్య కొంతకాలంగా పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి విషయాలు ఆలస్యంగా బయటపడుతున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేసే వరకు జిల్లా అధికారులకు తెలియడంలేదు.  గతంలో  జిల్లాలోని నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రత్యేకమైన కేసుల్లో ముందుగానే సమాచారం సేకరించి రాష్ట్రస్థాయిలో ముందుండే వారు. ఉగ్ర కదలికలతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన విషయాలపైన నిఘా వర్గాలు ఇచ్చే నివేదికలపైనే పోలీసు అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టేవారు. గత కొన్నేళ్లుగా వీటిపై దృష్టిపెట్టకపోవడం, కీలకమైన అధికారులను నియమించకపోవడం వల్ల నిఘా వర్గాలు అంతగా దృష్టిపెట్టకపోవడం వల్లనే రోహింగ్యాలకు పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి అప్రమత్తంగా ఉన్న కేంద్ర వర్గాలు సమాచారం ఇచ్చే వరకు ఈ విషయం బయటపడలేదు. జిల్లాకు మహారాష్ట్ర ఆనుకుని ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి సంబంధాలు ఉండడం వల్ల సరిహద్దుతో పాటు అన్ని ప్రాంతాల్లో కీలకంగా నిఘా వర్గాలు దృష్టిపెడితేనే ఇలాంటి విషయాలు ఆగే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు సమీక్షించి యువ అధికారులను నిఘా విభాగంలోకి తీసుకుంటే మెరుగైన సమాచారం అందడంతో పాటు ముందస్తుగానే ఇలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం బోధన్‌ వ్యవహరం సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. అన్ని ప్రాంతాల్లో బందోబస్తును పెంచడంతో పాటు నిఘాను పెంచారు.

Updated Date - 2021-07-08T06:22:22+05:30 IST