ఎస్సారెస్పీకి వరద

ABN , First Publish Date - 2021-08-20T05:45:22+05:30 IST

శ్రీరాంసాగర్‌కు మళ్లీ వరద పెరిగింది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంతోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ఈ వరద వచ్చి చేరుతోంది.

ఎస్సారెస్పీకి వరద
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు


62 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఏడు గేట్ల ఎత్తి వేత

మరింత పెరిగే అవకాశం


నిజామాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీరాంసాగర్‌కు మళ్లీ వరద పెరిగింది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంతోపాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో ఈ వరద వచ్చి చేరుతోంది. దీంతో గురువారం రాత్రి ఏడు గేట్లు ఎత్తి దిగువకు 21,840 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి వరకు 61,650 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకుగాను 1090.10 అడుగులకు చేరింది. 90 టీఎంసీలకుగాను 86 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మహారాష్ట్రతో పాటు పక్కనే ఉన్న నిర్మల్‌ జిల్లా గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి వరద వచ్చి చేరుతోంది. మంజీరా నుంచి కొంత వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాల్వకు 3500ల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. లక్ష్మి కాలువ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని కొనసాగిస్తున్నారు. గత నెలలో భారీ వర్షాలు పడితే వారం రోజుల పాటు 37 గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. సుమారు 142 టీఎంసీలు గోదావరికి వదిలారు. ప్రస్తుతం వర్షాలు మరింత పెరిగితే భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలోని ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అక్కడి వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు నీటి విడుదల కొనసాగిస్తూనే వచ్చే వరదను బట్టి గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తామని ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఏఈ వంశీ తెలిపారు. 

నాలుగు రోజులుగా వర్షం..

జిల్లాలో గడిచిన నాలుగు రోజులుగా ఓ మోస్తారు వర్షం కురిసింది. గురువారం సగటును 25.5మి.మీ.ల వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్‌ సౌత్‌ మండ లం పరిధిలో 57.5 మి.మీ.ల వర్షం పడింది. జిల్లా లో ఇప్పటి వరకు 625.8 మి.మీ.ల వర్షం పడా ల్సి ఉండగా 858.2 మి.మీ. వర్షం పడింది. జిల్లాలోని 21 మండలాల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షం పడగా 8 మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది. ఈ వర్షం మకో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ నరేంధర్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-20T05:45:22+05:30 IST