మద్యం టెండర్లకు కసరత్తు

ABN , First Publish Date - 2021-11-09T06:14:54+05:30 IST

మద్యం టెండర్లకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోం ది. మద్యం దుకాణాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పాత మద్యం షాప్‌ల గడువు ముగుస్తుండడంతో ఈ నెలాఖరులోపు టెండర్లను నిర్వహించి షాప్‌లను కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మద్యం టెండర్లకు కసరత్తు

జిల్లాలో పెరగనున్న మద్యం దుకాణాల సంఖ్య 

రిజర్వేషన్ల ఆధారంగా షాప్‌ల కేటాయింపు

ఈనెల చివరి వారంలో డ్రా తీయనున్న అధికారులు 

ఏర్పాట్లు చేసుకుంటున్న ఆశావహులు

జిల్లాలో ప్రస్తుతం 91 షాపులు, కొత్తగా మరో11 దుకాణాలకు ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మద్యం టెండర్లకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోం ది. మద్యం దుకాణాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పాత మద్యం షాప్‌ల గడువు ముగుస్తుండడంతో ఈ నెలాఖరులోపు టెండర్లను నిర్వహించి షాప్‌లను కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దఫా  పలు సడలింపులతో పాటు రిజర్వేషన్లు కల్పించడంతో అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఈసారి గతంలో కంటే దుకాణాల సంఖ్య పెరగనుంది. దీనికి తోడు రిజిర్వేషన్లు కల్పించడంతో భారీగా దరఖాస్తు చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్సైజ్‌ స్టేషన్‌లతో పాటు జిల్లా కార్యాలయాల్లో టెండర్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో మద్యంషాప్‌ల గడువు ఈ నెల 30తో ముగియనుండడంతో మళ్లీ రెండేళ్ల కోసం టెండర్‌లు నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొత్తషాప్‌ల కోసం ఉత్తర్వులను జారీ చేశారు. నెలాఖరులోపు టెండర్‌లను పూర్తిచేసి షాప్‌లు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఒకటి రెండు రోజుల్లో టెండర్ల కోసం నోటిఫికేషన్‌ను కలెక్టర్‌ ద్వారా ఇవ్వనున్నారు.

రిజర్వేషన్ల ఆధారంగా షాపుల కేటాయింపు..

ఈదఫా మొదటిసారిగా షాప్‌ల కేటాయింపులో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ షాప్‌లలో ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్లను కేటాయించింది. ఈ షాప్‌లలో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేశారు. రెండు రోజుల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈ రిజర్వేషన్‌ షాప్‌లకు ఇవ్వ నున్నారు. జిల్లాలో ప్రస్తుతం 91 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే అమ్మకాలు భారీగా పెరగడంతో మరో 11 షాప్‌లను ప్రభుత్వం పెంచింది. మొత్తంగా ఈ దఫా 102 షాప్‌లకు టెండర్‌లను ఆహ్వానించనున్నారు. కొత్తగా నిజామాబాద్‌ డివిజన్‌లో 4, ఆర్మూర్‌లో 2, భీంగల్‌లో 2, మోర్తాడ్‌ పరిధిలో 2 మద్యం దుకాణాలు పెరిగాయి. మొత్తం 102 షాప్‌లలో 24 రిజర్వేషన్‌లు కేటాయించగా, 78 జనరల్‌గా ఉంచారు. ఈ షాప్‌ల కేటాయింపు కూడా జనాభా పద్ధతి ఆధారంగా ఎక్సైజ్‌ సుంకాన్ని నిర్ణయించారు. సంవత్సరానికి లెక్కన చెల్లించే విధంగా ఉత్తర్వులను జారీ చేశారు. ఒకసారి టెండర్‌ పొందినవారికి రెండేళ్ల వరకు అనుమతులు ఇస్తారు. జనాభా 5వేలలోపు ఉన్న గ్రామాల్లో ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.50లక్షలుగా సంవత్సరానికి నిర్ణయించారు. జనాభా ఐదు వేల నుంచి 50వేల వరకు ఉన్న గ్రామాలు, మండల కేంద్రాల్లో రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో 60లక్షల రూపాయలుగా నిర్ణయించారు. మున్సిపాలిటీ, నగరం పరిధిలో లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే 65లక్షలుగా, జనాభా 5లక్షల నుంచి 20లక్షల లోపు ఉన్న ప్రాంతాల్లో రూ.85లక్షలుగా సుంకాన్ని నిర్ణయించారు. జనాభా 20లక్షల నుంచి ఆ పైన ఉన్న ప్రాంతాలకు రూ.కోటి పది లక్షలుగా నిర్ణయించారు. టెండర్‌ వేసేవారు ఒక్కో అప్లికేషన్‌ఫీజు టెండర్‌కు రూ.2లక్షలుగా నిర్ణయించారు. ఈ దఫా ఒక్కొక్కరు ఎన్నైనా వేసేందుకు అవకాశం కల్పించారు. టెండర్‌ పొందేవారికి 2021 డిసెంబరు 1 నుంచి 2023 నవంబరు 30 వరకు లైసెన్స్‌ ఉండనుంది. 

పెరగనున్న దరఖాస్తులు..

జిల్లాలో ఈ దఫా దుకాణాలు పెరగడం, రిజర్వేషన్లను అమలు చేస్తుండడంతో డిమాండ్‌ పెరగనుంది. వచ్చే రెండేళ్లలో సాధారణ ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికలు ఉండడంతో మద్యం షాపులకు డిమాండ్‌ పెరగనుంది. గత టెండర్‌లోనే ఎక్కువగా రాజకీయ నేతలు, కాంట్రాక్టర్‌లు, ఇతర వర్గాల వారు ఈ టెండర్‌లను దాఖలు చేశారు. ఈదఫా కూడా ఎక్కువ మంది పోటిపడే అవకాశం ఉంది. మద్యం షాప్‌ల పరిధిలో బెల్ట్‌ షాప్‌లు ఎక్కువగా నడవడం వల్ల రెండేళ్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఒక్కో మద్యం దుకాణం పరిధిలో పది నుంచి 30 వరకు బెల్ట్‌షాప్‌లు ఉండడం, గ్రామాల పరిధిలో టెండర్‌లు పాడి వారే నడిపించడం వల్ల ఆయా మద్యంషాప్‌ల పరిధిలో అమ్మకాలు పెరిగాయి. దుకాణదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇతర వ్యాపారాల కన్న మద్యం వ్యాపారంలో పెట్టుబడి ఎక్కువగా ఉన్న లాభాలు ఉండడంతో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను కూడా ఈ వ్యాపారంలో దించుతున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు కూడా తమ కుటుంబ సభ్యులు, బంధువులతో టెండర్‌లను వేయించేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

టెండర్ల నిర్వహణకు ఏర్పాట్లు..

నవీన్‌చంద్ర, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  

జిల్లాలో మద్యం దుకాణాల టెండర్‌ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తిస్థాయి ఉత్తర్వులు రాగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. మొదటిసారి రిజర్వేషన్లను అమలు చేయనున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులను స్వీకరిస్తాం. డ్రా పద్ధతిలో షాప్‌లను రిజర్వేషన్లకు అనుగుణంగా కేటాయింపులు చేస్తాం.

Updated Date - 2021-11-09T06:14:54+05:30 IST