మద్యం పాలసీపై ఉత్కంఠ!

ABN , First Publish Date - 2021-10-26T04:50:45+05:30 IST

మద్యం పాలసీపై వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పటికే మద్యం టెండర్లలో రిజర్వేషన్లు అమలు ముందుకు వచ్చింది. దీనికి అనుగుణంగా దుకాణాలను కేటాయించనున్నారు. అందుకోసం ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు వ్యాపారుల్లో మాత్రం ఏ దుకాణం ఎలా రిజర్వేషన్లు కాబోతుందనే చర్చ మొదలయింది.

మద్యం పాలసీపై ఉత్కంఠ!


వైన్స్‌ల టెండర్‌ల ప్రక్రియపై  మద్యం వ్యాపారుల్లో జోరుగా చర్చ
రిజర్వేషన్లు ఉన్న వైన్స్‌లను దక్కించుకునేందుకు వ్యాపారుల వ్యూహాలు
జిల్లాలో 40 మద్యం దుకాణాలు
ఈ వైన్స్‌లలో నెలసరి రూ.35 కోట్ల నుంచి
రూ.40 కోట్ల వరకు వ్యాపారం
రిజర్వేషన్లతో మారనున్న మద్యం వ్యాపారుల సమీకరణాలు

కామారెడ్డి,అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మద్యం పాలసీపై వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పటికే మద్యం టెండర్లలో రిజర్వేషన్లు అమలు ముందుకు వచ్చింది. దీనికి అనుగుణంగా దుకాణాలను కేటాయించనున్నారు. అందుకోసం ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు వ్యాపారుల్లో మాత్రం ఏ దుకాణం ఎలా రిజర్వేషన్లు కాబోతుందనే చర్చ మొదలయింది. కామారెడ్డి జిల్లాలో 40 మద్యం దుకాణాలు ఉన్నాయి. వచ్చే నెలతో లీజ్‌ గడువు ముగియనుంది. కొత్త మద్యం పాలసీ ప్రకటించి దానికి అనుగుణంగా టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. ఇందుకు ప్రభుత్వం విధివిధానాలు ఎలా ఉన్నా దుకాణాలు దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తున్నారు. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వైన్స్‌లను దక్కించుకునేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు.
టెండర్లలో రిజర్వేషన్లు
కామారెడ్డి జిల్లాలో 40 మద్యం దుకాణాల టెండర్‌ గడువు నవంబరు 30తో ముగియనుంది. ఇప్పటికే ఈ మద్యం దుకాణాల గడువు ముగిసినప్పటికీ ఎక్సైజ్‌శాఖ మరో రెండు నెలలు ఎక్స్‌టెన్షన్‌ చేసింది. దీంతో వచ్చే నెలలో మద్యం దుకాణాల లీజ్‌ గడువు ముగిసే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలను కేటాయించనున్నారు. కొత్త మద్యం పాలసీ రానున్న నేపథ్యంలో టెండర్లలో ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం, గౌడ కులస్తులకు 10 శాతం రిజర్వేషన్‌ను కల్పించనున్నారు. రిజర్వేషన్లలో జిల్లాల వారీగా కేటాయింపులు లేదా జోన్‌ల వారీగా, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారా అనే దానిపై వ్యాపారుల్లో అయోమయం నెలకొంది. తొలిసారిగా మద్యం టెండర్లలో ఈ రిజర్వేషన్‌లు అమలుచేస్తుండడంతో ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలలోని ఔత్సాహికులు టెండర్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో 40 మద్యం దుకాణాలు
రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్ల నుంచి అమలుచేస్తున్న కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలను పెంచుతూ వస్తోంది. 2018-19 సంవత్సరంలో 38 మద్యం షాపులు ఉండగా 2019-21 మద్యం పాలసీలో రెండు వైన్స్‌లను పెంచడంతో ఆ సంఖ్య 40కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 5 ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ల పరిధిలో మొత్తం 40 మద్యం దుకాణాలు ఉన్నాయి. కామారెడ్డి ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 12 మద్యం దుకాణాలు ఉండగా, దోమకొండలో 6, ఎల్లారెడ్డిలో 6, బాన్సువాడలో 7, బిచ్కుంద ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో పరిధిలో 7 వైన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ 40 మద్యం దుకాణాల గడువు లీజ్‌ వచ్చే నెల ముగియనుంది. అప్పటిలోగా ప్రభుత్వం కొత్తమద్యం పాలసీని అమలుచేయనుంది. ఈ నేఫథ్యంలో వైన్స్‌ల సంఖ్య పెంచుతుందా లేదా పాతవాటినే యథావిధిగా కొనసాగిస్తుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
దరఖాస్తు ఫీజులతోనే  రూ.9.50 కోట్ల ఆదాయం
జిల్లాలోని మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం అబ్కారీ శాఖకు సమకూరనుంది. 2019 అక్టోబరులో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో డిపాజిట్‌ రూ.2లక్షలు చెల్లించారు. జిల్లాలో మొత్తం 40 దుకాణాలకు 475 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ఎక్సైజ్‌శాఖకు రూ.9.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ సారి డిపాజిట్‌ ఫీజు పెంచుతారా లేదా పాత పద్ధతినే కొనసాగిస్తారా అనే సందిగ్ధం వ్యాపారుల్లో నెలకొంది. జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం వస్తుండగా దాదాపు ప్రతినెలా రూ.35 నుంచి రూ.40 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. వ్యాపారులకు గిట్టుబాటు అవుతుండడంతో ఎలాగైనా వైన్స్‌లను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఆయా వైన్స్‌లు టెండర్లు, లక్కీడ్రా ద్వారా పొందిన వారి నుంచి గుడ్‌ విల్‌కైనా వైన్స్‌లను దక్కించుకునేందుకు వ్యాపారులు వ్యూహాలు రచిస్తున్నారు. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి వైన్స్‌లను దక్కించుకోవాలనే ఆతృతతో ఇప్పటినుంచే వ్యాపారులలో చర్చ కొనసాగుతోంది.

Updated Date - 2021-10-26T04:50:45+05:30 IST