రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు తెలియజేయాలి

ABN , First Publish Date - 2021-10-08T05:15:21+05:30 IST

మున్సిపల్‌ రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు తెలియజేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 7: మున్సిపల్‌ రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సమీకృత కార్యాలయ సముదాయంలో గురువారం టీఎస్‌బీపాస్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుమ తి లేకుండా భవనాలు నిర్మిస్తే యజమానులకు జరిమానా విధించాలని సూచించారు. భవన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల పనులను నిలిపివేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ప్లానింగ్‌ అధికారిణి శైలాజ, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్లు దేవేందర్‌, రమేష్‌కుమార్‌, జగ్జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడమే బతుకమ్మ పండుగ ఉద్దేశ్యం
కామారెడ్డి : ప్రకృతిలో విరివిగా లభించే పూలతో బతుకమ్మలను తయారు చేసి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడమే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సాంస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు నిచ్చి ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు కూడా బతుకమ్మ వేడుకలను నిర్వహించేలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు రమేష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, దివ్యశ్రీ, కాశీరాం, పోశెట్టి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
వయో వృద్ధులు నేటి తరానికి మార్గదర్శకులు
వయో వృద్ధులు నేటి తరానికి మార్గదర్శకులు అని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డిలోని సీనియర్‌ సిటిజన్‌ ఫోరం భవనంలో గురువారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వయో వృద్ధులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. తల్లిదండ్రులను పిల్లలు తప్పనిసరిగా గౌరవించాలని కోరారు. యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వయో వృద్ధులు కేక్‌ను కట్‌ చేశారు. వయో వృద్ధులు విఠల్‌రావు, లక్ష్మణ్‌రావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ సరస్వతీ, జిల్లా సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు పున్న రాజేశ్వర్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌రావు, ప్రతినిధులు భద్రయ్య, రాజన్న, విశ్వనాఽథం, శారద, వెంకటి, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:15:21+05:30 IST