నిజామాబాద్ రూరల్ మండల విభజన
ABN , First Publish Date - 2021-07-15T05:37:12+05:30 IST
ఇప్పుడున్న నిజామాబాద్ రూరల్ మండలం ఇకపై రెండు భాగాలుగా విడిపోనుంది. మండలంలోని ప్రధాన గ్రామ పంచాయతీ గుండారం మండల కేంద్రంగా మరో మండలం ఏర్పడనుంది. 1984లో తొలిసారి 33 గ్రామాలతో నిజామాబాద్ ఉమ్మడి మండలం ఏర్పాటుచేశారు. ఆ మండల జనాభా లక్ష 10 వేలు.
మరో మండల కేంద్రంగా గుండారం
ప్రతిపాదనలు పంపిన అధికారులు
గెజిట్ విడుదల కావడమే ఆలస్యం
నిజామాబాద్ రూరల్, జూలై 14: ఇప్పుడున్న నిజామాబాద్ రూరల్ మండలం ఇకపై రెండు భాగాలుగా విడిపోనుంది. మండలంలోని ప్రధాన గ్రామ పంచాయతీ గుండారం మండల కేంద్రంగా మరో మండలం ఏర్పడనుంది. 1984లో తొలిసారి 33 గ్రామాలతో నిజామాబాద్ ఉమ్మడి మండలం ఏర్పాటుచేశారు. ఆ మండల జనాభా లక్ష 10 వేలు. ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత 2016లో కొత్త మండలంగా నిజామాబాద్ రూరల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. మోపాల్‌లో 15 గ్రామాలు, నిజామాబాద్ రూరల్‌లో 18 గ్రామాలుగా విడదీశారు. తర్వాత నిజామాబాద్ రూరల్ మండలం నుంచి ఖానాపూర్, కాలూరు, సారంగపూర్, గూపన్‌పల్లి, ముబారక్‌నగర్, మోపాల్ మండలం నుంచి బోర్గాం(పి), పాంగ్ర గ్రామాలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. దీంతో రూరల్ మండలంలో 12 గ్రామాలు మిగిలాయి. తర్వాత ప్రభుత్వం 2018న తండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ప్రకటించింది. అందులో భాగంగా 7 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గుండారం ప్రధాన గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న శాస్త్రినగర్, రాంనగర్, శ్రీనగర్‌లను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వాటితోపాటు మల్లారం జీపీ నుంచి చక్రధర్‌నగర్, గాంధీనగర్‌లు రెండు కొత్త జీపీలు ఏర్పడ్డాయి. ముత్తకుంట నుంచి లింగితండాను వేరుచేసి కొత్త జీపీగా, ధర్మారం (ఎం)నుంచి ధర్మారం తండాను కొత్త జీపీలుగా ఏర్పాటుచేశారు. దీంతో మొత్తం 19 గ్రామ పంచాయతీలు అయ్యాయి.
గుండారం మండలానికి నాంది..
2018 ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత గుండారంను ప్రత్యేక మండలంగా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గుండారంను ప్రత్యేక మండలంగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గుండారం మండల పరిధిలో శాస్త్రినగర్, రాంనగర్, శ్రీనగర్, తిర్మన్‌పల్లి, పాల్ద, జలాల్‌పూర్, మల్కాపూర్‌లతో కలిపి నూతన మండలంగా ఏర్పాటుచేయనున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలో ఆకుల కొండూరు, కేశాపూర్, చక్రధర్‌నగర్, గాంధీనగర్, మల్లారం, ధర్మారం(ఎం), ధర్మారం తండా, మల్కాపూర్ తండా, కొత్తపేట, లింగితండా, ముత్తకుంట గ్రామాలను ఉంచారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలతో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి గుండారం మండలం ఏర్పాటుచేయాలని ప్రతిపాదనలు అధికారికంగా పంపారు. ఇక ప్రభుత్వం నుంచి గెజిట్ విడుదల కావడమే ఆలస్యం.
పాలనా సౌలభ్యం సులువు..
నిజామాబాద్ రూరల్ మండలం 19 గ్రామాలతో నిజామాబాద్ నగరానికి నలువైపులా విస్తరించి ఉంది. దీంతో పాలనా సౌలభ్యం ఇబ్బందిగా మారింది. రెండు మండలాలు కానుండండంతో నగరానికి ఉత్తరాన ఉన్న 8 గ్రామాలు ఒకవైపు, పశ్చిమాన ఉన్న గ్రామాలన్నీ మరో మండలంగా ఏర్పడనుండడంతో ఇకపై పాలనా సౌలభ్యం జరగనుంది. రూరల్ గ్రామ ప్రజలకు మెరుగైన పాలన అందే అవకాశం ఉంది. నూతనంగా గుండారం ఏర్పడనుండడంతో గుండారం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.