గడువు ముగుస్తున్నా అందని రుణం

ABN , First Publish Date - 2021-09-03T05:35:47+05:30 IST

జిల్లాలో ఈ యేడు భారీ వర్షాలు కురిసి.. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా.. రుణ పంపిణీ మాత్రం లక్ష్యాన్ని చేరడం లేదు. వానాకాలం పంటలు చివరి దశకు వస్తున్నా కొన్ని గ్రామాలు, మండలాల పరిధిలో బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందజేయడం లేదు. రుణ పంపిణీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈసారి వందశాతం రుణ పంపిణీజరిగే అవకాశం కనిపించడం లేదు.

గడువు ముగుస్తున్నా అందని రుణం

జిల్లాలో నేటికీ లక్ష్యాన్ని చేరుకోని పంట రుణాల పంపిణీ

నిర్ణయించిన లక్ష్యంలో 62శాతమే అందజేసిన బ్యాంకర్లు

రుణ పంపిణీకి మరో నెల రోజులు మాత్రమే గడువు

గడువులోపు లక్ష్యం చేరడం గగనమే

జిల్లాలో పంటల విస్తీర్ణం పెరిగినా.. సకాలంలో అందని రుణాలు

పెట్టుబడి డబ్బులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఈ యేడు భారీ వర్షాలు కురిసి.. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా.. రుణ పంపిణీ మాత్రం లక్ష్యాన్ని చేరడం లేదు. వానాకాలం పంటలు చివరి దశకు వస్తున్నా కొన్ని గ్రామాలు, మండలాల పరిధిలో బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందజేయడం లేదు. రుణ పంపిణీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈసారి వందశాతం రుణ పంపిణీజరిగే అవకాశం కనిపించడం లేదు. దీంతో జిల్లాలో వరి, పసుపు, ఇతర పంటలు వేసిన రైతులు పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యా పారులనే ఆశ్రయిస్తున్నారు. పంటలు చివరి దశలో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుతెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. ప్రతీవారం పంట రుణాలపై కలెక్టర్‌ సమీక్షిస్తున్నా.. కొన్ని బ్యాంకుల పరిధిలో అనుకున్నవిధంగా రుణ పంపిణీ జరగడం లేదు. 

అవసరమైన సమయంలో అందని రుణాలు 

ఈసారి జిల్లాలో రైతులకు పెట్టుబడి అవసరమైన సమయంలో పంట రుణాలు అందలేదు. ప్రతీ సంవత్సరం వానాకాలంలో జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో నే రైతులకు ఎక్కువగా పెట్టుబడి అవసరం ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, కూలీలకు ఎక్కువగా డబ్బులు ఖర్చుచేస్తారు. ఈ సమయంలోనే ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రతీ రైతు ఈ మూడు నెలల కాలంలోనే పెట్టుబడి పెడతారు. రైతులకు రైతుబంధు అందినా పంటరుణాలు మాత్రం ఆలస్యమయ్యాయి. ప్రతీ సంవత్సరం జూన్‌ నుంచే పంట రుణాల పంపిణీ మొదలుపెట్టి సెప్టెంబరు చివరి వరకు అందిస్తారు. ఈ సంవత్సరం వర్షాలు ముందే వచ్చినా రుణాలు పంపిణీ చేయకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టారు. జూన్‌, జూలై నెలల్లో కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు బ్యాంకర్లతో సమీక్షించినా పంటరుణాల పంపిణీ నిర్దేశించిన మేరకు జరగలేదు.

ఇప్పటి వరకు ఇచ్చింది రూ.1,320 కోట్లే..

జిల్లాలో ఈ వానాకాలంలో రైతులకు రూ.2,129కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని అన్ని వాణిజ్య, గ్రామీణ బ్యాంకులకు లక్ష్యాలను నిర్ణయించారు. ఆగస్టు నెలాఖరు వరకు 80శాతం రుణాలు పంపిణీ చేయాలని నిర్దేశించారు. కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి ప్రతీవారం బ్యాంకర్లతో సమీక్షించి పంట రుణాలు సకాలంలో అందించాలని సూచించారు. కానీ, జిల్లాలో నిర్ణయించిన లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ.1,320 కోట్లు మాత్రమే ఇచ్చారు. వీటిలో ఎక్కువగా రీషెడ్యూల్‌ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం రూ.50వేలలోపు పంట రుణాలు మాఫీ చేసినా ఎక్కువ మంది రైతులకు రుణాలు అందలేదు. ఈ నెలాఖరు వరకే రుణాలు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి యాసంగి రుణాలను మొదలు పెట్టనున్నారు. ఈలోపే అవసరమైన రైతులకు రుణ పంపిణీ చేస్తే మేలు జరిగే అవకాశం ఉంది. బ్యాంకుల్లో తీసుకునే పంట రుణాలకు పావలా వడ్డి వర్తింపజేయడం వల్ల సకాలంలో చెల్లించినవారిపై భారం తక్కువగా పడే అవకాశం ఉంది. ఇకనైనా జిల్లా బ్యాంకర్ల కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులకు ఈ నెలాఖరులోపు పంట రుణాలు పంపిణీ చేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. కాగా.. జిల్లాలో ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యంలో 62శాతం పంట రుణాలను పంపిణీ చేశామని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ నెలాఖరులోపు మరిన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ యేడు పెరిగిన పంటల విస్తీర్ణం

జిల్లాలో ఈ వానాకాలంలో వర్షాలు ముందుగానే రావడంతో రైతులు పంటల సాగును కూడా ముందుగానే మొ దలు పెట్టారు. దీంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తంలో పంటలు వేశారు. ఆరుతడి పం టలతో పాటు వరి పంటను పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లాలో గత సంవత్సరం మాదిరిగానే ఈ వానాకాలంలో కూడా వరి భారీగా సాగైంది. అయితే, భారీ వర్షాలతో కొ న్నిచోట్ల వరి, మొక్కజొన్న, సోయా పంటలు దెబ్బతిన్నా వాతావరణం అనుకూలించడంతో పంటల విస్తీర్ణం అంచ నా మేరకే జరిగింది. జిల్లాలో ఈ వానాకాలంలో ఇప్పటివ రకు 4లక్షల 93వేల 330 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఇందులో అత్యధికంగా 3లక్షల 52వేల 625 ఎకరాల్లో రైతులు వరి పంటను వేశారు. జూన్‌లోనే వర్షాలు మొదలు కావడంతో ఎక్కువ మంది రైతులు వరి సాగుకే మొగ్గుచూపారు. బోధన్‌ డివిజన్‌లో జూన్‌ నెలలోనే నాట్లు వేయగా ఇతర మండలాల పరిధిలో జూలై, ఆగస్టు నెలల్లో చేశారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో నెలాఖరులో వరి పంట చేతికి వస్తుండగా.. ఇతర గ్రామాల పరిధిలో అక్టోబరు నెలలో కోతకు రానుంది. జిల్లాలో వరితో పాటు 63,842 ఎక రాల్లో సోయా పంటను సాగు చేశారు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పలు ప్రాంతాల్లో సో యా పంట దెబ్బతిన్నది. నకిలీ విత్తనాల వల్ల విత్తనం పెట్టే సమయంలోనే కొంత పంట మొలవక దెబ్బతినగా.. ఆ తర్వాత వేసిన పంటలు వర్షాలతో సక్రమంగా పూత రావడం లేదు. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండడంతో మరికొంత పంట దెబ్బతిన్నది. జిల్లాలో మొక్కజొన్న పం టను 26,727 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పసుపు 40వేల ఎకరాల్లో వేశారు. జిల్లాలో ఆరుతడి పంటలైన ప త్తి, కంది, పెసరా, శనగ పంటలను కూడా రైతులు సాగు చేశారు. అయితే, ఇటీవల కురుస్తున్న వర్షాలు వరికి అను కూలిస్తున్నప్పటికీ ఆరుతడి పంటలకు మాత్రం కొంతమే ర నష్టాన్ని కలిగించాయి. జిల్లాలో ఈ సంత్సరం కూడా పంటల విస్తీర్ణం ఎక్కువగా జరిగిందని జేడీఏ మేకల గో వింద్‌ తెలిపారు. వరిసాగు బాగా పెరిగిందన్నారు. పంట రుణాలు కూడా అందరు రైతులకు అందేవిధంగా చూస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-09-03T05:35:47+05:30 IST