డయాలసిస్‌ కొందరికే..!

ABN , First Publish Date - 2021-12-10T04:36:03+05:30 IST

చిన్న సమస్యలకు తీవ్ర ఒత్తిడి కారణంగానో శరీరంలోని అత్యంత విలువైన కిడ్నీని వ్యాధులకు గురిచేస్తూ వాటి పనితీరు నెమ్మదించేలా చేసుకుంటూ ఇబ్బందులకు గురవుతూ చికిత్సకు సరిపడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందించిన వరం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రాలు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స అందించాలనే సంకల్పంతో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్లకు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

డయాలసిస్‌ కొందరికే..!
డయాలసిస్‌ చేసుకుంటున్న కిడ్నీ బాధితులు(ఫైల్‌)

- రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ బాధితులు

- బాధితులకు తగ్గట్టుగా సరిపోని డయాలసిస్‌ కేంద్రం

- మరిన్ని బెడ్లు ఏర్పాటు చేస్తేనే తొలగనున్న ఇబ్బందులు

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 9: చిన్న సమస్యలకు తీవ్ర ఒత్తిడి కారణంగానో శరీరంలోని అత్యంత విలువైన కిడ్నీని వ్యాధులకు గురిచేస్తూ వాటి పనితీరు నెమ్మదించేలా చేసుకుంటూ ఇబ్బందులకు గురవుతూ చికిత్సకు సరిపడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందించిన వరం ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్‌ కేంద్రాలు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స అందించాలనే సంకల్పంతో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్లకు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 5 పడకలతో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌లో ముగ్గురు కిడ్నీ బాధితుల సేవలతో మొదలైన డయాలసిస్‌ సెంటర్‌ ప్రస్తుతం 50 నుంచి 60 మందికి సేవలు అందించే స్థాయికి చేరుకుంది. కిడ్నీలు పూర్తిగా చెడిపోయిన వారితో పాటు ప్రస్తుతం ప్రతీరోజు 20 మందికి తగ్గకుండా సేవలు అందిస్తున్నారు. అయితే రోగులకు తగ్గట్టుగా భవనం సరిపోవకపోవడంతో డయాలసిస్‌ కోసం వచ్చే బాధితులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం సేవలను మరింత మెరుగుపరిస్తేనే బాధితులకు త్వరగా సేవలు అందే అవకాశం ఉంటుంది.

అన్నీ ఉచితంగానే..

ఇంతకు ముందు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేయించుకోవడానికి హైదరాబాద్‌ ప్రాంతానికి వెళ్లడానికి ఆపసోపాలు పడుతూ వేలకు వేలు ఖర్చు చేసేవారు. ఇక పేదలకు డబ్బు లేక అప్పులు చేసి వాటిని తీర్చ లేక కష్టాలు పడేవారు. అట్లాంటి వారి కోసం ప్రభుత్వం డయాలసిస్‌తో పాటు వారికి అవసరమైన ఐరన్‌, సుక్రోజ్‌, జనరల్‌ మెడిసిన్‌ వంటి అన్ని మందులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో మాదిరిగా కాకుండా ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక్కసారి వాడిన వస్తువులను మరొకరికి వాడకుండా ప్రతీ ఒక్కరికి కొత్త వస్తువులను వాడుతున్నారు. శరీరంలోని రక్తంలో గల మలినాలను శుభ్రం చేయడానికి ప్యూరీఫైడ్‌ వాటర్‌తో పాటు డయాలైజర్‌, ట్యూబింగ్‌, ట్రాయల్‌ విడిజన్‌ ప్రొటెక్షన్‌ వంటివి కొత్తవే వాడుతున్నారు. బయట చేయించుకుంటే వీటి ధర కనీసం రూ.2500 వరకు వుంటుంది. 

ఐదు డయాలసిస్‌ మిషన్లు..

డయాలసిస్‌ కేంద్రంలో ప్రతీ ఒక్కరికి వేర్వేరు పడకలతో పాటు 5 డయాలసిస్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. రోజుకు 6 షిఫ్టుల చొప్పున ఒక్కో షిప్టుకి దాదాపు నలుగురికి సేవలు అందిస్తున్నారు. ఈ 5 డయాలసిస్‌ మిషన్లలో 4 హైపటైటిస్‌-సి  నెగిటివ్‌ కిడ్నీ వ్యాధి గ్రస్తులకు, 1 మిషన్‌ను హైపటైటిస్‌ -సి పాజిటివ్‌(కిడ్నితో పాటు లివర్‌కు వ్యాధి సోకినవారు) కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగిస్తున్నారు. ఒక్కరికి డయాలసిస్‌ చికిత్స అందించడానికి కనీసం నాలుగు గంటలకు పైగా పడుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు.

వ్యాధిగ్రస్తులకు తగ్గ విస్తరణ, పడకలు కరువు

వ్యాధిగ్రస్తులకు తగిన విధంగా పడకలు, స్థలం లేక కొద్దిమేర ఇబ్బందులు కలుగుతున్నారు. కేవలం 5 మిషన్ల ద్వారా డయాలసిస్‌ సేవలను అందిస్తున్నప్పటికీ రోగుల సంఖ్యకు అనుగుణంగా సేవలను అందించేందుకు స్థలం తక్కువగా ఉండడం కేవలం 5 పడకలు మాత్రమే ఉండడం వల్ల డయాలసిస్‌కు వచ్చే వారికి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్‌పైనే ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ డయాలసిస్‌ సెంటర్‌కు ప్రత్యేకంగా విశాలమైన గదిని కేటాయించి మరిన్ని పడకలను ఏర్పాటు చేస్తే కిడ్నీ బాధితులకు ఇంకా మంచి సేవలు అందుతాయి. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి వరకు సేవలను అందిస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్రారంభంలో నెప్రాలజిస్ట్‌ వచ్చినా ఇప్పుడు ఆసుపత్రికి రావడం లేదు. అయినా నిత్యం జనరల్‌ ఫిజీషియన్‌తో పాటు టెక్నీషియన్‌లు, జూనియర్‌ టెక్నీషియన్‌లు సేవలు అందిస్తున్నారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం కేంద్రంలో మరికొన్ని డయాలసిస్‌ మిషన్లు అందుబాటులోకి తీసుకు వస్తే బాధితులకు మరింత ఉపశమనం లభిస్తోంది.

Updated Date - 2021-12-10T04:36:03+05:30 IST