దండిగా దిగుబడులు

ABN , First Publish Date - 2021-10-08T05:12:29+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల పంటల ఉత్పత్తి గణనీయంగా ఉంటుందని ఆయా ప్రభుత్వ శాఖలు అంచనా వేస్తున్నాయి.

దండిగా దిగుబడులు
కామారెడ్డి మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశులు

- విస్తారంగా కురిసిన వర్షాలతో సాధారణానికి మించిన సాగు
- జిల్లా వ్యాప్తంగా 4.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు
- పంట ఉత్పత్తులపై వ్యవసాయశాఖ అంచనా
- అత్యధికంగా సాగైన వరి పంట
- ఆరు లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నుల్లో వరి దిగుబడులు వచ్చే అవకాశం
- వరి ఎకరాన 25, మొక్కజొన్న 20 క్వింటాళ్ల దిగుబడులు
- పత్తి 10 క్వింటాళ్లు, సోయాబీన్‌ 9 క్వింటాళ్లు


కామారెడ్డి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల పంటల ఉత్పత్తి గణనీయంగా ఉంటుందని ఆయా ప్రభుత్వ శాఖలు అంచనా వేస్తున్నాయి. జిల్లాలో అనుకూలిస్తున్న వాతావరణంతో రైతులు వ్యవసాయశాఖ రూపొందించిన అంచనాలకు మించి పంటలు వేశారు. సాధారణ సాగు 4,85,304 ఎకరాలు కాగా వర్షాలు విస్తారంగా కురువడంతో అంతకుమించి 4,95,851 ఎకరాలలో పంటలు సాగు చేశారు. వరి 6,78,322 మెట్రిక్‌ టన్నులు, సోయాబీన్‌ 55,353 మెట్రిక్‌ టన్నులలో ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ శాఖలు అంచనా వేశాయి. వర్షాలకు తోడు నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌ ప్రాజెక్ట్‌ల నీరు విడుదల కావడంతో గతంలో సాగుకు నోచుకోని భూముల్లో కూడా ఈ ఏడాది పంటలు వేశారు. వీటితో పాటు మొక్కజొన్న, పత్తి, మినుములు, పెసర్లు, కందులు లాంటి పంటలను కూడా సాగు చేశారు.
జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో పంటల సాగు
ఈ సంవత్సరం అనుకూలించిన వర్షాలతో జిల్లాలో నూటికి నూరు శాతం పంటలను రైతులు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 4,85,304 ఎకరాలు కాగా సాగైన పంటల విస్తీర్ణం 4,95,851 ఎకరాలు ఇందులో వరి పంట 2,42,220 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా సాగైన వరి 2,77,405 ఎకరాలలో సాగైంది. సోయాబీన్‌ 55వేల ఎకరాలకు గాను 69,191 ఎకరాలలో సాగైంది. పత్తి 70వేల ఎకరాలకు గాను 27,580 ఎకరాలలో సాగయింది. మొక్కజొన్న 50వేల ఎకరాలకు గాను 92,504 ఎకరాలలో సాగు చేశారు. కందులు 35వేల ఎకరాలకు గాను 18,806 ఎకరాలలో సాగయింది. పైసర్లు 18 వేల ఎకరాలకు గాను 10,675 ఎకరాలలో సాగయ్యాయి. మినుములు 11 వేల ఎకరాలకు గాను 10,266 ఎకరాలలో సాగు చేశారు.
వివిధ ప్రమాణాల ఆధారంగా అంచనా
ప్రభుత్వ శాఖలు వివిధ ప్రమాణాల ఆధారంగా వరి, సోయాబిన్‌, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటల దిగుబడులు బాగుంటాయనే అంచనాలను రూపొందించారు. వరి ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ సంవత్సరం 2,77,405 ఎకరాలలో వరి పంటను సాగు చేయగా ఎకరాన 25 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వస్తే మొత్తం 6,78,322 లక్షల మెట్రిక్‌ టన్నులలో వరి ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పత్తి పూత, కాత దశలో ఉంది. మరో 20 నుంచి నెల రోజుల్లో పత్తితీత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎకరానికి సగటున సుమారు 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 27,580 సాగైన పత్తికి 22,064 మెట్రిక్‌ టన్నులలో పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. సోయాబీన్‌ 69,191 ఎకరాలలో సాగు కాగా ఎకరాన 9 క్వింటాళ్ల చొప్పున దిగుబడులు వస్తే మొత్తం 55,353 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు రానున్నాయి. మొక్కజొన్న 92,504 ఎకరాలలో సాగు కాగా ఎకరాన 20 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తే మొత్తం 2,02,515 మెట్రిక్‌ టన్నులు, కందులు 18,806 ఎకరాలలో సాగు కాగా ఎకరాన 6 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తే 15,045 మెట్రిక్‌ టన్నులలో, పెసర్లు 10,675 ఎకరాలలో సాగు కాగా ఎకరాన 4 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తే 4,270 మెట్రిక్‌ టన్నులు, మినుములు 10,266 ఎకరాలలో పంట సాగు కాగా ఎకరాన 4 కి ్వంటాళ్ల వరకు దిగుబడులు వస్తే మొత్తం 4,106 మెట్రిక్‌ టన్నులలో ఉత్పత్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు.
మద్దతు ధరపై ఆశలు
జిల్లాలో విస్తారంగా సాగు చేసిన పంటల నుంచి వచ్చే దిగుబడులకు మద్దతు ధర రావాలని అన్నదాతలు ఆశపడుతున్నారు. ప్రభుత్వం పంట కొనుగోళ్లను చేపడితే మద్దతు ధర లభించే అవకాశం ఉంది. అయితే వరి ధాన్యం, పత్తి, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.6,025, వరి క్వింటాలుకు రూ.1,960 నిర్ణయించింది. కందులకు రూ.6,300, మొక్కజొన్నకు రూ.1870గా నిర్ణయించారు. ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేపడితే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంది.

Updated Date - 2021-10-08T05:12:29+05:30 IST