విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి
ABN , First Publish Date - 2021-10-26T04:53:16+05:30 IST
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషిచేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.

కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కామారెడ్డిటౌన్,అక్టోబరు 25: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషిచేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో టీఎస్‌ఐసీ(తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్) పోస్టర్లను డీఈవో రాజు, డీఎస్‌వో సిద్ధిరాంరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరిలో సృజనాత్మకత తప్పకుండా ఉంటుం దని వాటిని వెలికి తీయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. టీసీఐఎస్, పాఠశాలవిద్యాశాఖ, ఇంక్విలాబ్ ఫౌండేషన్,యూనిసెఫ్ ఆధ్వర్యంలో 2021 సంవత్సరం నుంచి విద్యార్థులో సృజనాత్మకత ఆలోచనాలను వెలికితీసి, వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి, ఆచరణ రూపంలో అమలుచేస్తున్నారని తెలిపారు. అయితే గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలే పాల్గొనగా ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ అవకాశం కల్పించారని డీఎస్‌వో సిద్ధిరాంరెడ్డి తెలి పారు. ప్రతీ పాఠశాల నుం చి ఒక టీచర్‌ను టీఎస్‌ఐసీ కార్యక్రమానికి ఎంపిక చేసి గూగుల్ ఫాంను ఈనెల 26 లోగా పూర్తిచేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. టీచర్స్ ట్రైనింగ్ ఈ నెల 30 నుంచి నవంబరు 12 వరకు ఉంటుందని మిగిలిన వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.