కరోనా తగ్గుముఖం!
ABN , First Publish Date - 2021-12-15T06:04:23+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. వారం రోజులుగా కొత్తగా కేసులు నమోదు కాక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా వ్యా క్సినేషన్‌పై ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

వారం రోజులుగా నమోదుకాని పాజిటివ్ కేసులు
‘ఒమైక్రాన్’ వ్యాప్తితో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
ప్రత్యేక శిబిరాల ద్వారా టీకాపై అవగాహన
తప్పనిసరిగా మాస్కు ధరించాలంటున్న అధికారులు
నిజామాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. వారం రోజులుగా కొత్తగా కేసులు నమోదు కాక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా వ్యా క్సినేషన్‌పై ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ మూడో దశ ముప్పుతోపాటు ‘ఒమైక్రాన్’ వ్యాప్తి కలకలంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ అవగా హన కల్పిస్తున్నారు. బస్టాండ్‌లు, రేషన్ దుకాణాలు, ఇతర సంస్థల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచిస్తూ మాస్కు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.
నిత్యం నిర్ధారణ పరీక్షలు..
ప్రతిరోజూ ఆయా పీహెచ్‌సీలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. కరోనా థర్డ్‌వేవ్, ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్ సమయంలో పీహెచ్‌సీల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులు తలెత్తడంతో ప్రస్తుతం అన్నింట్లోనూ సేవలు అందేవిధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో కొన్ని ఆక్సిజన్ బెడ్స్ ఉండేవిధంగా చూస్తున్నారు. అదే రీతిలో ఏరియా ఆసుపత్రుల్లో ఏర్పాట్లను చేస్తున్నారు. బోధన్ జిల్లా ఆసుపత్రిలోనూ ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏరియా ఆసుపత్రిగా ఉన్న బోధన్ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినా కావాల్సిన సిబ్బందిని ఇప్పటికి నియమించలేదు. దీంతో వైద్య సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సెకండ్‌వేవ్ సమయంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సుమారు 3750 మంది వరకు వైద్య సేవలను అందించారు. ఆసుపత్రిలో 500 పైగా ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. 75 వరకు వెంటిలేటర్‌లను ఏర్పాటు చేశారు. యూవీకేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంటిలేటర్స్, ఆక్సిజన్‌బెడ్స్, ఇతర పరికరాలను రెండున్నర కోట్లు వెచ్చించి అందించడంతో మౌలిక వసతులు సమకూరాయి.
అధికారుల నియామకం..
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందే విధంగా అదనపు డీఎంఈ క్యాడర్‌కు చెందిన డాక్టర్ వాలియాను సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయన రెండు మూడురోజుల్లో చార్జ్ తీసుకునే అవకాశం ఉంది. సూపరింటెండెంట్ క్యాడర్ పోస్టును మొదటిసారిగా భర్తీచేశారు. వైద్య కళాశాల అనుబంధంగా ఆసుపత్రిని బదిలీ చేసినప్పటి నుంచి ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. ప్రస్తుతం మొదటిసారిగా ఈ పోస్టుకు స్థాయి గల అదనపు డీఎంఈని ఈ మధ్యనే పదోన్నతులు కల్పించి నియామకం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కూడా అదనపు డీఎంఈగా పదోన్నతి కల్పించి ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఆసుపత్రిలో కావాల్సిన అన్ని మౌలిక వసతులను సమకూరుస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాల్‌రాజ్ తెలిపారు.