అర్హులంతా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-30T05:12:33+05:30 IST
2022 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు.

నిజామాబాద్‌అర్బన్, అక్టోబరు 29: 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రతిఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం తన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న యువతీ యువకులు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు ఆదేశాలు వచ్చాయని అందుకు అనుగుణంగా నవంబరు 1న డ్రాఫ్ట్ లిస్ట్ ప్రచురిస్తామన్నారు. డ్రాఫ్ట్ లిస్టు పోలింగ్ కేంద్రాల బీఎల్‌వోల వద్ద ఉంటుందని ఓటర్లు ఆ జాబితాలో సరిచూసుకుని మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు దరఖాస్తు చేయాలని తద్వారా తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి వీలవుతుందన్నారు. జనవరి 5వ తేదీన చివరి ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. నవంబరు 6,7, 27, 28 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ ఓటరు నమోదుకు నిర్వహిస్తున్నామని ఈ తేదీల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు, సంబందిత 6,7,8,8ఏ, ఫారాలతో అందుబాటులో ఉంటారని ప్రజలు వారి వద్ద కొత్తగా నమోదు చేసుకోవడం, మార్పులు, చేర్పులు, తప్పులు సరిచేయడం, పోలింగ్ కేంద్రాల మార్పు, నియోజకవర్గాల మార్పు, సంబంధిత ఫారాలు పూర్తిచేసి సమర్పించాలన్నారు. దరఖాస్తులను మ్యాన్‌వల్‌గా కాకుండా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ విషయంలో తగు శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వారిని ఓటర్ల జాబితాలో ఉండేలా దరఖాస్తు చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్‌డీవో రవి, ఇతర అదికారులు పాల్గొన్నారు.