కాంట్రాక్టర్లకే వరం

ABN , First Publish Date - 2021-10-30T04:57:31+05:30 IST

మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది.

కాంట్రాక్టర్లకే వరం
చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్న దృశ్యం

- చేప విత్తనాల నుంచి చేపల అమ్మకాల దాకా వారిదే రాజ్యం
- అన్నింటిలోనూ కాంట్రాక్టర్లకే ప్రయోజనం
- ఐదు సంవత్సరాల కాలంలో రూ.10.69 కోట్లతో 11.17కోట్ల చేప విత్తనాల సరఫరా
- జిల్లాలో మారని మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి

కామారెడ్డి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి):
మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం కొంత మంది కాంట్రాక్టర్లకు మాత్రమే వరంగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి. చేప విత్తనాల నుంచి మొదలుకొని చేపల అమ్మకం వరకు కాంట్రాక్టర్లదే ఆధిపత్యం నడుస్తుండడంతో మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి మాత్రం మారడం లేదు. జిల్లాలో చేపల పెంపకంపై ఆధారపడి 12వేల మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరికి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చేపపిల్లల పంపిణీ పథకం ద్వారా ప్రతీ సంవత్సరం వర్షాకాలం సీజన్‌లో చెరువుల్లో చేప విత్తనాలను వదిలిపెట్టే కార్యక్రమం చేపడుతోంది. గ్రామాల్లో ఉండే చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టుల్లోనూ చేపల పెంపకం సాగుతోంది. అయితే దశాబ్దాలుగా చెరువులపై గుత్తేదారులదే పెత్తనం నడుస్తోంది. దీంతో ప్రభుత్వం అందించే సహాయంతో మత్స్యకారులకు ప్రయోజనం చేకూరడం లేదు. కాంట్రాక్టర్‌లకు మాత్రమే మేలు జరుగుతుందనే వాదన మత్స్యకారుల్లో, మత్స్యసంఘాల్లో వినిపిస్తోంది.
ఐదేళ్లలో 11.17 కోట్ల చేప పిల్లల విడుదల
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా జిల్లాలో గత ఐదు సంవత్సరాల కాలంలో 11.17 కోట్ల చేప పిల్లలను ఆయా చెరువుల్లో, ప్రాజెక్టుల్లో విడుదల చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.03 కోట్ల విలువ చేసే 1.15 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 3,459 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.20.76 కోట్ల ఆదాయం మత్స్యకారులకు వచ్చిందని మత్సశాఖ రికార్డులు చెబుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2.48 కోట్లు విలువ చేసే 3.04 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 7,849 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.62.78కోట్ల ఆదాయం వచ్చిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2.44 కోట్ల విలువ చేసే 2.88 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 7,445 టన్నుల ఉత్పత్తి రాగా రూ.59.55 కోట్ల ఆదాయం వచ్చిందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.94 కోట్లతో 2.88 కోట్ల విత్తనాలను విడుదల చేయగా 7,106 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.56.84 కోట్ల ఆదాయం వచ్చిందని, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2.80 కోట్లతో 3.29 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా 7,949 టన్నులలో ఉత్పత్తి రాగా రూ.64.50 కోట్ల ఆదాయం వచ్చిందని మత్స్యశాఖ రికార్డులు చెబుతున్నాయి.
గుత్తేదారులదే ఆధిపత్యం
జిల్లాలో ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు రూ.10కోట్ల విలువ చేసే 11 కోట్ల చేప పిల్లలను వివిధ చెరువుల్లో ప్రాజెక్టుల్లో వదిలారు. చేప పిల్లల విత్తనాల కోసం రూ.10.69 కోట్లను ఖర్చు చేశారు. వీటి ద్వారా సుమారు 35వేల టన్నుల చేపల ఉత్పత్తి అయిందని వాటి అమ్మకాల ద్వారా మత్స్యకారులకు రూపాయలు దాదాపు 250కోట్ల వరకు ఆదాయం వచ్చిందని సంబంధిత శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మత్స్యకారుల ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి ప్రగతి కనిపించడం లేదు. చెరువుల్లో కాంట్రాక్టర్‌లు, దళారులదే ఆధిపత్యం సాగుతుండడమే ఇందుకు కారణం. దళారుల ఆధిపత్యం కొనసాగుతుండడంతో మత్స్యకారులు తమ చెరువుల్లో తామే కూలీలుగా పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల మత్స్యసహకార సంఘాల ఆధిపత్యం కొనసాగుతున్నా అక్కడ కూడా మత్స్యకారులకు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తేనే మత్స్యకారులకు మేలు
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. చేపల విక్రయానికి కావాల్సిన ద్విచక్రవాహనాలు, ట్రాలీ టాటాఏసీలను అందిస్తోంది. కానీ చేపల పెంపకం దగ్గరకు వచ్చే సరికి కాంట్రాక్టు దళారుల పెత్తనం నడుస్తుండడంతో మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారింది. చాలా చోట్ల దళారుల ఆధిపత్యమే కొనసాగుతుండడం మూలంగా మత్స్యకారులు ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా దళారి వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం, మత్స్యశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేపల పెంపకం నుంచి అమ్మకందాక దళారుల పెత్తనం తగ్గితేనే మత్స్యకారులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం మత్స్యకారుల నుంచి, మత్స్యసంఘాల నుంచి వ్యక్తం అవుతుంది.

Updated Date - 2021-10-30T04:57:31+05:30 IST