చకచకా కలెక్టరేట్ పనులు
ABN , First Publish Date - 2021-07-08T06:45:22+05:30 IST
అన్ని శాఖలు ఒకే దగ్గర, అధికారులందరూ ఒకే చోట. ప్రజల చెంతకు పరిపాలన సంకల్పంతో ప్రభుత్వం కొత్తజిల్లాలు ఏర్పాటు చేసి, నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేసింది. మారుమూల పల్లెల నుంచి వచ్చే సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని కార్యాలయాలను ఒకేచోట చేర్చి సమీకృత భవనాల నిర్మాణాలు చేపట్టింది.

పూర్తి కావొచ్చిన కలెక్టరేట్ నిర్మాణం
త్వరలో ప్రారంభానికి సన్నాహాలు
రూ.53 కోట్లతో సమీకృత భవనంలో అధునాతన వసతులు
నెలాఖరులోగా పనుల పూర్తికి చర్యలు
44 శాఖల్లో 1,200 మంది విధుల నిర్వహణ
అన్ని శాఖలు ఒకే దగ్గర, అధికారులందరూ ఒకే చోట. ప్రజల చెంతకు పరిపాలన సంకల్పంతో ప్రభుత్వం కొత్తజిల్లాలు ఏర్పాటు చేసి, నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేసింది. మారుమూల పల్లెల నుంచి వచ్చే సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని కార్యాలయాలను ఒకేచోట చేర్చి సమీకృత భవనాల నిర్మాణాలు చేపట్టింది. 2016 అక్టోబరు 11న ఉమ్మడి నల్లగొండ జిల్లాను విభజించి, సూర్యాపేట, యాదాద్రితో కలిపి మూడు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ఇందులో నల్లగొండకు కలెక్టరేట్ భవనం ఉండగా, సూర్యాపే ట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టింది. నాలుగేళ్ల క్రితం చేపట్టిన పనులు యాదాద్రిలో 90 శాతం పూర్తి కాగా, సూర్యాపేటలో 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఈ రెండు జిల్లాల కాంట్రాక్ట్ సంస్థ (యాంబియన్స్) ఒకటే కావడం, పనుల్లో ఈ వ్యత్యాసం ఏమిటోనని ఆయా జిల్లాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
యాదాద్రి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కొత్త కలెక్టరేట్ భవనాల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టరేట్ భవనాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి కలెక్టరేట్ భవనాన్ని కూడా సిద్ధంచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో పనుల్లో వేగం పెరిగింది. అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జూలైలోగా అన్ని పనులు పూర్తిచేసి, ప్రారంభోత్సవానికి సిద్ధంచేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భువనగిరి పరిధిలోని రాయుగిరిలో 12.20 ఎకరాల్లో నిర్మించే శాశ్వత భవనం పనులు ఇప్పటివరకు 90 శాతానికిపైగా పూర్తయ్యాయి.
జీప్లస్ టూ అంతస్తులు.. 1,58,756 అడుగుల విస్తీర్ణం
కలెక్టరేట్ భవనాన్ని జీప్లస్ టూ అంతస్తుల్లో, 1,58,756 అడుగుల విస్తీర్ణం లో నిర్మిస్తున్నారు. వీటిలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో 53,740 ఎస్‌ఎ్‌ఫటీ (స్క్వేర్ ఫీట్), మొదటి అంతస్తు 50,832 ఎస్‌ఎ్‌ఫటీ, రెండో అంతస్తులో 15,428 ఎస్‌ఎ్‌ఫటీ తో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనంలో జిల్లా అధికారుల కార్యాలయాల కు విశాల వరండాలు, గదులతో కూడిన నిర్మాణాలను ప్రజలు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి ప్రభు త్వం ఇప్పటివరకు రూ.53కోట్లు మంజూరు చేసింది. వీటిలో దాదాపు రూ.53 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తుల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు ఆయా శాఖల కార్యాలయాలు, సమావేశ మందిరం, విశాలవరండాలతో భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భవనానికి రంగులు వేయడం కూడా పూర్తయింది. ప్రస్తుతం భవనంలో ఫర్నిచర్, అంతర్గత సీసీరోడ్లు, సెప్టిక్‌ట్యాంక్, డ్రైనేజీ పైపులను బిగించే పనులు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ భవనానికి విద్యుత్ సౌకర్యంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రి సమకూర్చాల్సి ఉంది. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ల నివాస భవనాల నిర్మాణాలు 85 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కలెక్టరేట్ చుట్టూ కూడా కాంపౌండ్‌వాల్ పనులు చేపట్టాల్సి ఉంది. భవన సముదాయం చుట్టూ ఆహ్లాద వాతావరణం, పచ్చనిచెట్లు, ఉద్యానవనం, పార్కింగ్‌కోసం ప్రత్యేకస్థలం, మూత్రశాలలు, క్యాంటీన్, భోజనశాల, ఏటీఎం, బ్యాంకు, మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు పనులన్నీ పూర్తి చేసేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. నూతన కలెక్టరేట్‌లోకి దాదాపు 44 శాఖలు రానున్నాయి. ఈ శాఖల్లో దాదాపు 1200మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు
ప్రజల చెంతకు పాలన ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దగా ఉన్న జిల్లాలను విభజించి, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. సామాన్యులకు దూరాభారం, రవాణా ఖర్చులు తగ్గి, అందుబాటులో అన్ని కార్యాలయాలను ఏర్పాటు చే యాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే 2016 అక్టోబరు 11వ తేదీన ఉమ్మడి జిల్లాను విభజించి 17మండలాలతో యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేసింది.
తొలగనున్న సామాన్యుల కష్టాలు
ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట లేకపోవడంతో గతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ విభాగాలు ఒకచోట, ఇతర అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారుల కార్యాలయాలు మరోచోట ఉండటంతో ప్రజలు, అధికారులు, సిబ్బందికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. కలెక్టరేట్‌ల నిర్మాణాలతో సామాన్యుల కష్టాలు తొలగనున్నాయి.
తొలుత ఆలస్యం.. తుదకు పుంజుకున్న వేగం
కలెక్టరేట్ నిర్మాణ పనులు 2017 అక్టోబరులో ప్రారంభమయ్యాయి. నిర్మాణాలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. గతంలో ప్రభుత్వం భవన నిర్మాణానికి రూ.32.18 కోట్లను మంజూరు చేసింది. సంవత్సరంలోనే భవనాలు పూర్తి చేయాల్సి ఉండగా, ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో పనుల్లో ఆలస్యమై, వ్యయ భారం పెరిగింది. భవన నిర్మాణానికి మరోసారి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం ఈ భవనానికి రూ.53కోట్ల మేరకు మంజూరుచేసింది. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనుల్లో వేగం పెరిగింది.
జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది : ఏశాల అశోక్, బస్వాపూర్ గ్రామస్థుడు
నూతన కలెక్టరేట్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. పలు సమస్యల నిమిత్తం కలెక్టరేట్‌కు వెళ్లే ప్రజలకు బస్సులు, ఆటోలు, ఇతర రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందిస్తారు. సమీకృత కలెక్టరేట్‌తో ప్రజలకు దూరం కూడా తగ్గుతుంది.
నాలుగేళ్లయినా
పూర్తికాని సూర్యాపేట కలెక్టరేట్
మరో ఏడాది వరకు ఆగాల్సిందే
సూర్యాపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కుడకుడ గ్రామంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనం ప్రారంభించేందుకు మరో ఏడాది ఆగాల్సిందే. 21ఎకరాల విస్తీర్ణంలో రూ.46 కోట్లతో ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్ దురాజ్‌పల్లి వద్ద ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. మొత్తం 36 ప్రభుత్వ శాఖలు ఉండ గా, 25 జిల్లా శాఖలు మాత్రమే అక్కడ ఉ న్నాయి. మిగిలిన 11 ప్రభుత్వ శాఖలు సూర్యాపేట జిల్లాకేంద్రంలో కొన్ని అద్దె భవనాల్లో, మరికొన్ని చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో ఉన్నాయి. అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా డిజైన్‌చేశారు. కలెక్టరేట్ భవనంతోపాటు కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు, మరో ఇద్దరు జిల్లా అధికారులకు కూడా ఈ ప్రాంగణంలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం మూడంతస్తుల స్లాబులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా చాలా పనులు చేపట్టాల్సి ఉంది. కేవలం 30శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 70 శాతం పనులు మిగిలే ఉన్నాయి. నిర్మాణంలో పాల్గొన్న అనేకమంది కార్మికులు కరోనా వల్ల తమ స్వరాష్ట్రాలకు వెళ్లడంతో పనులు జాప్యమవుతున్నాయి. వాస్తవానికి 2017అక్టోబరు 12వ తేదీన సీఎం నూతన కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేయగా 2018 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం సంవత్సరంలోపే ఈ పను లు పూర్తి కావాల్సి ఉండగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆలస్యమవుతోందన్న ఆరోపణలున్నాయి. కలెక్టరేట్ లో ఇంకా అనేక పనులు చేయాల్సి ఉంది. ఎలక్ట్రికల్ పనులు, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్, బాత్‌రూంల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కేవలం స్లాబులు వేసి గోడలు మా త్రమే నిర్మించారు. అంతర్గత పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
30 శాతం పనులు మాత్రమే పూర్తి
సూర్యాపేట నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కలెక్టరేట్ భవనాన్ని జీప్లస్ టూ అంతస్తుల్లో 1,20,000 అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 42, 000 ఎస్‌ఎ్‌ఫటీ, మొదటి అంతస్తు 50,120, రెండో అంతస్తులో 27,880 ఎస్‌ఎ్‌ఫటీలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈభవనంలో జిల్లా అధికారుల కార్యాలయాలకు విశాల వరండాలు, గదులతో కూడిన భవనాలను ప్రజలు, అఽధికారులకు సౌ కర్యవంతంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఈ భవన ని ర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివర కు రూ.46కోట్లు మంజూరు చేసింది. వీటిలో దాదాపు రూ.20కోట్ల మేరకు పను లు పూర్తయ్యాయి. సూర్యాపేట, యాదాద్రి భు వనగిరి జిల్లాల నూతన కలెక్టరేట్ కార్యాలయాలకు ఒక్కరే కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. భువనగిరిలో పనులు పూర్తి కావొస్తుండగా, సూర్యాపేటలో మాత్రం నత్తనడకన పనులు నడుస్తున్నాయి.
మరో ఏడాదిలో పూర్తి : యాకూబ్, ఈఈ, ఆర్‌అండ్‌బీ, సూర్యాపేట జిల్లా
వివిధ కారణాలతో సూర్యాపేట నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. మరో సంవత్సరంలో కలెక్టరేట్ భవనాన్ని పూర్తి చేస్తాం. కలెక్టరేట్ భవనంతోపాటు మరో అతిథిగృహం కూడా నిర్మించాల్సి ఉంది. దానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది.