మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-02-26T06:09:00+05:30 IST

మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు అన్నారు.

మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
దేవరకొండ : న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న అధికార సంస్థ కార్యదర్శి వేణు

 జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి వేణు
దేవరకొండ, ఫిబ్రవరి 25 :
మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు అన్నారు. నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దేవరకొండ ఐసీడీఎస్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, మహిళా సంఘాలకు గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలు నేరమన్నారు. స్ర్తీలు చట్టాలపై అవగాహన పెంచుకొని వారి హక్కులను సాధించుకోవాలన్నారు. దేవరకొండ సీఐ ఆదిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఏమైనా సమస్యలుంటే 100నెంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులో దేవరకొండ మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య, టౌన్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌ జగన్నాఽథ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు రాధ, రేణుక, వెంకటమ్మ, పద్మ, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
బాల, బాలికలకు రాజ్యాంగంలో అనేక హక్కులు
పెద్దఅడిశర్లపల్లి : బాల బాలికలకు రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించినట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవా సమితి, దేవరకొండ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని పుట్టంగండి, పడమటితండా మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన, బాల న్యాయ సంరక్షణ చట్టం, న్యాయసేవ పథకాలపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలపై జరిగే ఆకృత్యాలు అనాగరికమన్నారు. ఆడపిల్లలపై లైంగిక దాడులు జరిగితే చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. బాల్య వివాహాలు  చేసినా, ప్రోత్సహించినా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే శిక్షలకు గురవుతారని హెచ్చరించారు. దేవరకొండ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌ మాట్లాడుతూ న్యాయపరమైన సలహాలు, సహాయానికి న్యాయ సేవా సంస్థను ఆశ్రయించాలని సూచించారు. ఎవరూ చట్టాలను ఉల్లంఘించవద్దని, చట్టాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుని విధులు నిర్వర్తించాలన్నారు. ఎస్‌ఐ గోపాల్‌రావు మాట్లాడుతూ నేరాలు చేసి సంఘంలో నైతికతను కోల్పోయి కుటుంబాలకు దూరమై జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. నేర ప్రవృత్తి మానుకొని కుటుంబం సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచ్‌లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T06:09:00+05:30 IST