ఇదేం పరీక్ష

ABN , First Publish Date - 2021-05-21T06:11:32+05:30 IST

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ‘దేవుడు వరం ఇచ్చినా కరుణించని పూజారి’ అన్న చందంగా తయారైంది సాగర్‌ కమల నెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పరిస్థితి.

ఇదేం పరీక్ష
క్యూలైన్లలో నిరీక్షణ

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్లలో నిరీక్షణ

ఓపీకోసం 8 గంటలకు రమ్మని.. ల్యాబ్‌ టెక్నీషియన్‌ 11 గంటలకు వస్తున్నారు

సాగర్‌లో పరీక్షల కోసం వసూళ్లపర్వం

నాగార్జునసాగర్‌/నేరేడుచర్ల, మే 20: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ‘దేవుడు వరం ఇచ్చినా కరుణించని పూజారి’ అన్న చందంగా తయారైంది సాగర్‌ కమల నెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పరిస్థితి. విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఈనెల 19న ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అయినా ఆయన ఆదేశాలను కూడా ఆసుపత్రి సిబ్బంది బేఖాతార్‌ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ఓపీ రాయించుకుంటున్న కరోనా రోగులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలైన్‌లో నిరీక్షిస్తున్నారు. అసలే ఆరోగ్యం బాగాలేక, ఆస్పత్రికి వస్తే తమను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి ఓపీ రాయించుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారని, కానీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ 11 గంటల వరకూ పరీక్షలు మొదలు పెట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వేసవి కాలం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తినడానికి కనీసం టిఫిన్‌ కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే  ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, దిగువస్థాయి సిబ్బంది కొందరు కరోనా నిర్ధారణ పరీక్షలకోసం వచ్చిన వారి దగ్గర రూ.150 నుంచి రూ.200 వరకు వసూలుచేస్తూ ముందు పంపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 


తోడునీడగా..

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామానికి చెందిన బొమ్మకంటి వీరయ్యకు రెండు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు వస్తుండడంతో కరోనా నిర్ధారణ పరీక్ష కోసం ఉదయం 8 గంటల సమయంలో నేరేడుచర్ల ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. 10 గంటల వరకు వేచి ఉన్నా, వారికి టోకెన్‌ దొరకలేదు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ వేడుకున్నా లాభం లేకపోయింది. ఆటో కిరాయి రూ.500 వెచ్చించి ఆస్పత్రికి వస్తే, తిరిగి రేపు రమ్మని సమాధానం రావడంతో ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలో ఉన్న వీరయ్యకు ఆకలి వేయడంతో భార్య కామేశ్వరమ్మ దగ్గరుండి టిఫిన్‌ తినిపించింది. సిబ్బంది శుక్రవారం రమ్మని సూచించినా, వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు లేక అక్కడే బెంచీపై నిద్రించారు.

Updated Date - 2021-05-21T06:11:32+05:30 IST