సాయుధ పోరులో వీరయోధులు

ABN , First Publish Date - 2021-09-17T06:05:32+05:30 IST

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాంను తరిమి నేటికి 73 వసంతాలు గడిచాయి. వేలాది భూములను తమ గుప్పిట్లో పెట్టుకొని నిజాం రాజు, ఆయన అనుచరులు దేశ్‌ముఖ్‌లు, ఖాసీం రిజ్వీ తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు.

సాయుధ పోరులో వీరయోధులు

 వీర తెలంగాణ పోరులో విప్లవాగ్ని వీణ 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 600 మంది అమరులు 

పల్లెపల్లెన ఎగిరిన ఎర్ర జెండా 

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాంను తరిమి నేటికి 73 వసంతాలు గడిచాయి. వేలాది భూములను తమ గుప్పిట్లో పెట్టుకొని నిజాం రాజు, ఆయన అనుచరులు దేశ్‌ముఖ్‌లు, ఖాసీం రిజ్వీ తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు. బ్రిటీష్‌ పరిపాలన నుంచి భారతదేశమంతటా స్వేచ్ఛా గీతాలు ఆలపిస్తున్నా తెలంగాణ మాత్రం నిరంకుశ నిజాం చేతుల్లోనే ఉంది. ఈ పాలనను పారదోలేందుకు పల్లెపల్లెన ప్రజా సంఘాలు నిర్మించి సాయుధపోరాటం చేశాయి. ఈ పోరాటానికి నల్లగొండ జిల్లాకు చెందిన దిగ్గజాలే నాయకత్వం వహించారు. జిల్లాకు చెందిన రావి నారాయణరెడ్డి, భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవీ, లక్ష్మారెడ్డి, సుద్దాల హన్మంతు, గుర్రం యాదగిరిరెడ్డి వంటి నేతలు ఉమ్మడి జిల్లాలో నలుమూలల నాయకత్వం వహించి సాయుధ శిక్షణ ఇచ్చి పోరాటానికి ఉపిరిలూదారు. నిజాం ప్రభువుకు, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు మధ్య జరిగిన యుద్ధంలో 4వేల మంది అమరులు కాగా, అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే 600 మంది ఉన్నారు. 6వేల మంది క్షతగాత్రులు కాగా, ఉమ్మడి జిల్లాలో 2వేల మంది గాయపడ్డారు. 

(చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు)


రాచకొండ గుట్టల్లో రాటుదేలిన పోరాటం

నిజాం నిరంకుశ పాలనను అంతం చేసేందుకు సాగించిన మహత్తర తెలంగాణ సాయుధపోరాటానికి ఊపిరిపోసింది రాచకొండ ప్రాంతం. జిల్లాలో విస్తరించి ఉన్న రాచకొండ గుట్టలు ఆనాడు కమ్యూనిస్టు గెరిల్లాలకు పోరాట కేంద్రాలుగా పనిచేసి, పోరాటయోధులకు ఆశ్రయమిచ్చాయి. రాచకొండ కేంద్రంగా రజాకారు వ్యతిరేకపోరు, పీడిత ప్రజల విముక్తి ఉద్య మం సాగింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో ఇక్కడి జనం సాయుధపోరును ప్రారంభించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకకేంద్రంగా నరహంతక రజాకార్ల మూకలు సాగించిన అరాచకాలను కమ్యూనిస్టు దళాలు ప్రతిఘటించాయి. ఈప్రాంతంలో కమ్యూనిస్టు నాయకులైన నంద్యాల శ్రీనివా్‌సరెడ్డి, ఎలమంద జగాల్‌రెడ్డిల నాయకత్వంలో 100 మంది పుట్టపాక గ్రామంలోని రజాకార్ల నివాసంపై పట్టపగలు దాడిచేశారు. రజాకార్లను అదే ఇంట్లో బంధించి నిప్పంటించారు. ఈ చర్య రజాకార్లలో భయోత్పాతాన్ని కలిగించగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది. మండలంలోని వాయిళ్లపల్లి గ్రామంలో రజాకార్ల ఆకృత్యాలు సాగాయి. అక్కడి ప్రజలను హింసించేవారు. ఈహింసను ప్రతిఘటించాలని నిర్ణయించుకున్న కమ్యూనిస్టు దళాలు రజకార్లను మట్టుబెట్టేందుకు వ్యూహం పన్నాయి. వాయిళ్లపల్లిని లూఠీచేయడానికి వచ్చిన రజాకార్ల గుంపుపై దళం దాడి చేసింది. అందులో రజాకార్లు కొంతమంది మరణించారు. 


రజాకార్లకు అడ్డుకట్ట

గుండ్రాంపల్లి కేంద్రంగా చేసుకొని సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు ప్రాంతాల్లో రజాకార్లు విహారంచేశారు. ప్రజాకంఠకుడిగా మారిన పాశం పుల్లారెడ్డిని కమ్యూనిస్టు దళాలు హతమార్చి మునుగోడు మండలం కొంపల్లిలో ఖననం చేశాయి. ఆనాడు అయ్యా నీ బాంచన్‌ అన్నోళ్లు కన్నెర్ర చేసి ఖబడ్దార్‌ అన్నారు. నల్లగొండ ఎర్రగొండగా మారింది. ఒక్కో ఊరు కదనరంగమైంది. నైజాంను తిరిమికొట్టేందుకు ప్రతిజ్ఞ చేశారు. నాలుగున్నరవేల మంది అమరుల బలిదానంతో పునీతమైన గడ్డ వీరుల రక్తంతో మరింత ఎరుపెక్కింది. నిజాం పాలన అంతమయ్యాక రాచకొండ గుట్టల్లో గెరిల్లా యోధులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఒకరోజు రహస్యంగా సమావేశమైన దళాలకు అన్నం పెట్టిన వాడే ద్రోహం తలపెట్టాడు. అతను సమాచారం అందించడంతో యూనియన్‌ మిలటరీ సైన్యాలు రాచకొండ గుట్టలను చుట్టుముట్టాయి. అప్పటి సాయుధ గెరిల్లా యోధులు డాక్టర్‌ రాజాబహదూర్‌గౌర్‌, గుత్తా సీతారాంరెడ్డి, పైళ్ల రామచంద్రారెడ్డి, కృష్ణమూర్తిలు మిలట్రీకి చిక్కారు. వారిని నెలరోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. సీతారాంరెడ్డి, రామచంద్రారెడ్డిలను రాచకొండ గుట్టల్లోనే కాల్చిచంపారు. గెరిల్లా యోధుల రక్తంతో రాచకొండ గుట్టలు మరింత ఎరుపెక్కాయి. 


ఆలేరు, తుంగతుర్తి కేంద్రాలుగా సాగిన పోరు

తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాలు తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నిలయాలుగా చెప్పుకుంటారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రనాయకులుగా అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి. రాణి రుద్రమను మరిపించిన వీరనారి మల్లు స్వరాజ్యం. సాహసవీరుడు దాయం రాజిరెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉర్రూతలూగించి నిజాంకు గోరీ కడతామని నినదించిన విప్లవ వీర కిశోరం బండి యాదగిరి. ఆలేరు ప్రాంతంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కమల, రావి నారాయణరెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి, దూదిపాల చిన్న సత్తిరెడ్డి, ప్రజాకవి సుద్దాల హన్మంతు, పెద్ద సత్తిరెడ్డి, తదితరులు ఈ ప్రాంతాల వారే. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు నిజాం నవాబు, వారి తాపేదార్లు అయిన విస్నూరు, ఎర్రపహాడ్‌ దేశ్‌ముఖ్‌ల నిరంకుశ పాలన, మోత్కూరు గడ్డం అమీన్‌ ఆగడాలకు, పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ ప్రాంతాల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది. ఆనాడు మొండ్రాయి వద్ద లంబాడాల భూపోరాటం, పాతర్లపాడు యుద్ధం, కొడకండ్ల, నెల్లికుదురు, ఎల్లంపేట ఇలా ఎన్నో తిరుగుబాటు పోరాటాలు చేసి శత్రువులను ఎదిరించిన ధీశాలి భీంరెడ్డి నర్సింహారెడ్డి. బీఎన్‌ ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నాడంటే దళసభ్యులకు ఎంతో ధైర్యంగా ఉండేది. ఆయుధాలు స్వాధీనం చేసుకోవడానికి ఆనాడు తుంగతుర్తి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేయగా పోలీసుల కాల్పుల్లో తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి మల్లెపాక మైసయ్య మరణించాడు. దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న చాకలి అయిలమ్మకు మద్దతుగా బీఎన్‌ దళం గడీపై దాడి చేసింది. ఆ దాడిలో బీఎన్‌ నిజాం పోలీసులకు పట్టుబడగా వారు ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారు. 


సాయుధ పోరాట ఉత్సవాలు

 తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుంచి సీపీఎం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో తెలంగాణ పో రాట యోధులను, వారు మరణిస్తే వారి సతీమణిని సన్మానిస్తూ వస్తున్నారు. సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నేడు సభ నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి ఆ తర్వాత హైదరాబాద్‌ సభకు వెళ్లాలనేది పార్టీ నిర్ణయం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్మల్‌ జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 3వేల మంది నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాకు సుదూరంగా ఉండటంతో పరిమిత సంఖ్యలోనే అమిత్‌షా సభకు వెళ్లాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.  

Updated Date - 2021-09-17T06:05:32+05:30 IST