రోజంతా నిరీక్షణ

ABN , First Publish Date - 2021-11-02T07:01:39+05:30 IST

చుట్టూ చీకటి.. చేతిలో చెమటోడ్చి పండించిన పంట.. దారి కాచిన వాన.. దారిలో నిలిచిన ధాన్యంపై దయలేకుండా కురిసింది.. అయినా జడవని రైతు.. అష్టకష్టాలు పడి పంటను, తనను కాపాడుకుంటూనే రైతు రాత్రిని జయించాడు.. ఇన్నింటినీ తట్టుకున్న రైతుకు తెల్లవారాక అధికారుల తీరు అసహనానికి గురిచేసింది..

రోజంతా నిరీక్షణ
చిల్లేపల్లి వద్ద రైతుల రాస్తారోకో

చిల్లేపల్లి వద్ద ధాన్యం ట్రాక్టర్లను అనుమతించని పోలీసులు

ఆగ్రహంతో నాలుగు గంటల పాటు రైతుల రాస్తారోకో

వర్షానికి తడిచి ముద్దయిన ధాన్యం  చుట్టూ చీకటి.. చేతిలో చెమటోడ్చి పండించిన పంట.. దారి కాచిన వాన.. దారిలో నిలిచిన ధాన్యంపై దయలేకుండా కురిసింది..  అయినా జడవని రైతు.. అష్టకష్టాలు పడి పంటను, తనను కాపాడుకుంటూనే రైతు రాత్రిని జయించాడు.. ఇన్నింటినీ తట్టుకున్న రైతుకు తెల్లవారాక అధికారుల తీరు అసహనానికి గురిచేసింది.. దాదాపు 24 గంటలు గడిచినా ధాన్యం ట్రాక్టర్లను మిల్లుకు అనుమతించక పోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. దీంతో ఆందోళనకు దారి తీసింది.. నాలుగు గంటలు బీష్మించుకుని కూర్చుంటేనే కానీ, అధికార యంత్రాంగం మనసు కరగలేదు... అప్పటికి కానీ రైతు ధాన్యం ‘దారి’న పడలేదు.  


నేరేడుచర్ల, నవంబరు 1 : హుజూర్‌నగర్‌ నియోజకవర్గ రైతులు పంట విక్రయించుకోవడానికి నిరీక్షిస్తున్నారు. గతేడాది సైతం పంట విక్రయం కోసం రోజుల తరబడి రైతులు వేచిచూడాల్సి వచ్చింది. అవే ఇబ్బందులు ఈ ఏడాది సైతం కొనసాగుతున్నాయి. అక్టోబరు 31వ తేదీకి ముందు రెండు రోజుల పాటు వచ్చిన 200 ధాన్యం ట్రాక్టర్లను నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద అడ్డుకున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు, ఆదివారం వచ్చిన ట్రాక్టర్లను సైతం సోమవారం వరకు నిలిపివేశారు. దీంతో వందలాది ధాన్యం ట్రాక్టర్లతో రైతులు 24 గంటల పాటు చిల్లేపల్లి రహదారిపై నిరీక్షించాల్సి వచ్చింది.  మిర్యాలగూడ మిల్లుల వద్దకు ధాన్యం ట్రాక్టర్లు అధికంగా రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న నెపంతో ఆదివారం సాయంత్రం నిలివేశారు. దీంతో రాత్రంతా రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమయిన వర్షం తెల్లవారుజాము మూడు గంటల వరకు సాగింది. దీంతో ట్రాక్టర్లలోని ధాన్యం వర్షానికి తడిసింది. సోమవారం ఉదయం 10 గంటల వరకు ట్రాక్టర్లను వదులుతారని వేచి చూసిన రైతాంగానికి అక్కడి పోలీసుల నుంచి సమాధానం రాకపోవడంతో చేసేది ఏమీ లేక రోడ్కెక్కారు. చిల్లేపల్లి మూసీ వంతెన వద్ద ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి ఆందోళన చేశారు. నేరేడుచర్ల ఎస్‌ఐ విజయ్‌ప్రకాష్‌ సిబ్బందితో వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినిపించుకోలేదు. రైతుల ఆందోళనకు బీజేపీ నేతలు తోడుకావడంతో పరిస్థితి వేడెక్కింది. మిర్యాలగూడ పోలీసులు సైతం రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. మీ వల్లే మాకీ గతి వచ్చిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు వెళ్లిపోయారు. మిల్లర్లు వచ్చి ఇక్కడే ధాన్యం పరిశీలించి కొనుగోలు చేసే వరకూ ఆందోళన విరమించమని బీష్మించారు. రైతుల ఆందోళనతో ప్రయాణికులు నానాఇబ్బందులు పడ్డారు. చంటి పిల్లలు, వృద్ధులు నాలుగు గంటల పాటు రాస్తారోకోలో చిక్కుకుపోయారు. అత్యవసర పరిస్థితుల్లో ఇద్దరు రోగులను తరలిస్తున్న వాహనాలను రైతులు దగ్గరుండి పంపించి మాన వత్వం చాటుకున్నారు. వ్యవసాయాధికారి వీరభద్రరావు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి నాయకత్వంలో నేతలు రాస్తారోకోలో పాల్గొని మద్దతు పలికారు. పంట విక్రయడానికి కూడా రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని భాగ్యరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ విజయ్‌ప్రకాష్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ట్రాక్టర్లను వదిలిపెట్టారు. దీంతో రైతులు ఆందోళన విరమించడంతో పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. రాత్రి వర్షంలోనే రైతులు ట్రాక్టర్ల కింద పడుకున్నారు. అక్కడే ఉన్న బడ్డీకొట్ల వద్దనే దొరికింది తిని ఆకలి తీర్చుకున్నారు. ఉదయం చిల్లేపల్లి సర్పంచ్‌ మనోజ్‌ ట్యాంకర్‌ తీసుకువచ్చి వారికి మంచినీరు అందజేశారు.  


 వాహనాలను మళ్లిస్తున్న పోలీసులు

మిర్యాలగూడకు వెళ్లే రహదారిలో నేరేడుచర్ల పోలీసులు మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడకు వాహనాలు రానివ్వడం లేదని తెలిసి, రైతులంతా కలిస్తే చిల్లేపల్లి వద్ద ఆందోళనకు దిగుతున్నారనే ఉద్దేశ్యంతో ధాన్యం లోడుతో వస్తున్న వాటిని చెక్‌పోస్టుల్లో నిలిపివేస్తున్నారు. నేరేడుచర్ల పట్టణంలోని ఎల్‌బీనగర్‌ సమీపంలో, నర్సయ్యగూడెం, చిల్లేపల్లి, మార్కెట్‌ యార్డు వద్ద నిలిపివేసి ఖాళీ స్థలాలలో పార్కింగ్‌ చేయిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాక్టర్లు నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


అకాల వర్షంతో నేలవాలిన వరి

 నేరేడుచర్ల : ఆదివా రం రాత్రి కురిసిన భారీ వర్షానికి నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాలలో వరి పంట నేలవాలింది. మూ డు నెలలుగా కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షానికి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మూడు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వరి పంట నీటిలో మునిగింది. ధా న్యం రంగు మారే ప్రమాదం ఉన్నందున అధికారులు మద్దతు ధర కల్పించి విక్రయించేందుకు సహకరించాలని పలువురు రైతులు కోరుతున్నారు.467 ఎకరాలలో పంట నష్టం: నేరేడుచర్ల మండలంలో సోమవారం తెల్లవారుజామున కురిసన వర్షానికి 467 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర  నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారి వీరభద్రరావు తెలిపారు. జానల్‌దిన్నలో 20 ఎకరాలు, దిర్శించర్లలో 50, మేడారం 30, బక్కయ్యగూడెం 20, బోడల్‌న్న 12, చిల్లేపల్లి 20 సోమారంలో 40, బూర్గులతండాలో 60, పెంచికల్‌దిన్నలో 30, దాచారంలో 35, ఫత్తేపురంలో 20, కల్లూరులో 30, మేడారంలో 30, నేరేడుచర్లలో 70 ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో పూర్తిస్థాయిలో పంటలను పరిశీలించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. 

Updated Date - 2021-11-02T07:01:39+05:30 IST