నేరేడుగొమ్ములో వెంకటేశ్వర క్లినిక్ సీజ్
ABN , First Publish Date - 2021-10-29T06:41:57+05:30 IST
నేరేడుగొమ్ములో ఎలాంటి అనుమతులులేకుండా వైద్యం చేస్తున్న వెంకటేశ్వర క్లినిక్, అండ్ మెడికల్ షాపును గురువారం సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి డాక్టర్ రవిశంకర్ తెలిపారు.

నేరేడుగొమ్ము, అక్టోబరు 28: నేరేడుగొమ్ములో ఎలాంటి అనుమతులులేకుండా వైద్యం చేస్తున్న వెంకటేశ్వర క్లినిక్, అండ్ మెడికల్ షాపును గురువారం సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి డాక్టర్ రవిశంకర్ తెలిపారు. వెంకటేశ్వర క్లినిక్ పేరుతో గత 16 సంవత్సరాలుగా ఆర్‌ఎంపి వెంకటేశ్వర్లు డాక్టర్‌గా చలామని అవుతూ మెడికల్ షాపును ఏర్పాటు చేసి అన్ని రకాల మందులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నాడని తెలిపారు. ఆగస్టు నెలలో ఎర్రగడ్డతండాకు చెందిన ఇంద్రావత్ చిట్టి కడుపు నొప్పితో బాధపడుతుండగా వెంకటేశ్వర క్లినిక్‌కు కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. వెంకటేశ్వర్లు చిట్టికి ఇంజక్షన్ ఇవ్వడంతో విరోచనాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో వైద్యం నిర్వహించగా చిట్టి కోలుకుంది. ఆర్‌ఎంపీ వైద్యుడు చేసిన వైద్యంతోనే చిట్టి అనారోగ్యానికి గురైందని చిట్టి భర్త చెన్న జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఆర్‌ఎంపి వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి డాక్టర్ రవిశంకర్ గురువారం నేరేడుగొమ్ముకు చేరుకొని వెంకటేశ్వర క్లినిక్‌ను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులులేకుండా వైద్యం చేయడం, మందులను విక్రయిస్తుండడంతో క్లినిక్, మందుల దుకాణాన్ని సీజ్‌చేసి వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు డాక్టర్ రవిశంకర్ తెలిపారు.