నల్లమలలో మళ్లీ యురేనియం కలకలం

ABN , First Publish Date - 2021-10-19T06:05:31+05:30 IST

నల్లమలలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. దీంతో కృష్ణాపరివాహక ప్రాంతమైన దేవరకొండ డివిజన్‌ పరిధిలోని పీఏపల్లి, పెద్దగట్టు, నంభాపురం గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

నల్లమలలో మళ్లీ యురేనియం కలకలం
యురేనియం ఉన్నట్లు గుర్తించిన పెద్దగట్టు గుట్టలు (ఫైల్‌)

ట్రైనీ శాస్త్రవేత్తల బృందాన్ని అడ్డుకున్న పీఏపల్లి గ్రామస్థులు


దేవరకొండ, అక్టోబరు 18: నల్లమలలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. దీంతో కృష్ణాపరివాహక ప్రాంతమైన దేవరకొండ డివిజన్‌ పరిధిలోని పీఏపల్లి, పెద్దగట్టు, నంభాపురం గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. యురేనియం నిక్షేపాల సర్వేకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూసీఐఎల్‌ శాస్త్రవేత్తలు 18 మంది సోమవారం రాగా, నంభాపురం, పెద్దగట్టు గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుతిరిగారు.


500 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు

నల్లమల అటవీ ప్రాంతంలోని నంభాపురం, పెద్దగట్టు పరిసరాల్లో 500 ఎకరాల్లో యురేనియం నిక్షేపా లు ఉన్నట్లు యూసీఐఎల్‌ అధికారులు గుర్తించారు. యురేనియం తవ్వకాలు చేస్తే ఏఎమ్మార్పీ, సాగర్‌ ప్రాజెక్టుల్లోని నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.అయినా,కేంద్ర ప్రభుత్వం తరచూ హెలికాప్టర్లతోపాటు వాహనాల్లో అధికారులు ఇక్కడి పంపుతుండా, వారు నంభాపురం, పెద్దగట్టు ప్రాంతాల్లో సంచరిస్తూ యురేనియం కోసం అన్వేషిస్తున్నారు.దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని,లేదంటే ప్రాణత్యాగానికైన సిద్ధమేనని ప్రజలు హెచ్చరిస్తున్నారు. దీంతో కొంతకాలంగా సబ్దత ఏర్పడగా, తాజా గా, అధికారులు సర్వేకు రావడంతో మళ్లీ అలజడి మొదలైంది.


2002 నుంచే సర్వే 

దేవరకొండ, చందంపేట, పీఏపల్లి మండలాల్లో యురేనియం నిక్షేపకాల కోసం 2002నుంచే అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈబాధ్యతను కేంద్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,భారత అణుపరిశోధన సంస్థలకు అప్పగించింది. అప్పటి నుంచి ఆయా సంస్థల అధికారులు దేవరకొండ నియోజకవర్గంలో సంచరిస్తూ యురేనియం నమునాలు సేకరిస్తున్నారు. చందంపేట మండలం చిత్రియాల గుట్టల్లో, పెద్దమూల గ్రామంలో 1000హెక్టార్లు,పీఏపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీభూమి, 196. 71ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలుఉన్నట్లు గతంలోనే యూ సీఐఎల్‌ అధికారులు నిర్ధారించారు. కాగా, యురేనియం సర్వే, తవ్వకాలను మొదటి నుంచే స్థానికులు వ్యతిరేకిస్తూ పలు ఆందోళనలు కూడా చేశారు.


నమూనాలు సేకరించిన అధికారులు

నల్లమల అటవీ ప్రాంతంలో నిక్షేపాల వెలికితీతకు యూసీఐఎల్‌ ట్రైనీ శాస్త్రవేత్తల బృందం సోమవారం పెద్దగట్టు, నంబాపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. గతంలో యురేనియం నిక్షేపాలు గుర్తించిన ప్రాం తాల్లో మట్టి నమూనాలు, మైనింగ్‌ చేసే ప్రాంతాల్లో నీటి నమూనా ఆనవాళ్లను మొత్తం 18మంది శాస్త్రవేత్తలు సేకరించారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఆ బృందాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా వారు నిరాకరించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి ట్రైనీ శాస్త్రవేత్తల బృందం అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, యురేనియం తవ్వకాలను నిలిపివేయాలనే డిమాండ్‌తో గిరిజనులు, ప్రజాసంఘాల నేతలు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - 2021-10-19T06:05:31+05:30 IST