విద్యార్థులకు నేటికీ అందని యూనిఫాం

ABN , First Publish Date - 2021-10-19T05:57:14+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా ప్రభు త్వం అందజేసే యూనిఫాంలు జిల్లాకు చేరలేదు. దీంతో కొందరు విద్యార్థులు పాతయూనిఫాంనే వేసుకుని వస్తుండగా,

విద్యార్థులకు నేటికీ అందని యూనిఫాం
యూనిఫాం లేకుండానే హాజరైన విద్యార్థులు

పాఠశాల ప్రారంభమై నెల దాటినా పాత యూనిఫాంలే దిక్కు

ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న  నూతన ప్రవేశాలు

ఈ ఏడాది 10 వేలకుపైగానే...

సూర్యాపేటటౌన్‌, అక్టోబరు 18 : ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా ప్రభు త్వం అందజేసే యూనిఫాంలు జిల్లాకు చేరలేదు. దీంతో కొందరు విద్యార్థులు పాతయూనిఫాంనే వేసుకుని వస్తుండగా, మరికొందరు విద్యార్థులు అవి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో పాఠశాలలు మూతబడ్డాయి. రెండోసారి లాక్‌డౌన్‌ అనంతరం ఆలస్యంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఆన్‌లైన్‌లోనే పాఠాలను బోధించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల్లో చాలామంది పేద కుటుంబానికి చెందిన వారే కావడంతో స్మార్ట్‌ఫోన్‌లు లేక క్లాసులు వినలేకపోయారు. దీంతో నెల రోజుల కిందట రాష్ట్ర ప్రభు త్వం భౌతిక విద్యాభ్యాసం కోసం పాఠశాలలను తెరిచింది. అయినప్పటికీ ప్రతి ఏడాది మాదిరిగా అందజేసే రెండు జతల యూనిఫాంలను మాత్రం అందించలేదు. 

ఎప్పటికి  అందేనో

జిల్లాలో 1043ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 71,000 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున 1,42,000 యూనిఫాంలు అంద జేయాల్సి ఉంది. గతంలో పాఠశాలలు ప్రారం భమైన కొద్దిరోజులకే స్థానిక టైలర్‌ల వద్ద కుట్టించి విద్యార్థులకు అందజేసేవారు. ప్రస్తు తం ఎప్పుడు యూనిఫాం క్లాత్‌ వస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాంకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లు సమాచారం.  

పెరుగుతున్న అడ్మిషన్లు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇటీవల నూతన్‌కల్‌ మండల కేంద్రంలోని పాఠశాలలో 100మందికి పైగా విద్యార్థులు చేరారు. ప్రస్తుత విద్యార్థులు 430 మందిలో 120 మంది కొత్తగా వచ్చారు. ఇప్పటి వరకు 2021-2022 విద్యాసంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10,100పైగా కొత్తగా ప్రవేశాలు వచ్చాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు.  ముఖ్యంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్నారు. 

త్వరలోనే యూనిఫాంలను పంపిణీ చేస్తాం: డీఈవో అశోక్‌

యూనిఫాంలకు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని డీఈవో అశోక్‌ తెలిపారు. త్వరలోనే యూనిఫాం అందజేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందన్నారు. పాఠశాలల్లో ఏ చిన్న అసౌకర్యం తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2021-10-19T05:57:14+05:30 IST