బయో చీటింగ్ అంతటా..
ABN , First Publish Date - 2021-05-21T07:01:34+05:30 IST
సాధారణ డీజిల్ కంటే లీటరుపై రూ.10 తగ్గుతుండటంతో రైతులు బయోడీజిల్ వైపు మొగ్గుచూపుతున్నారు. అది ఎక్కడ తయారవుతోంది, నాణ్యత ఎంత, దీన్ని వినియోగిస్తే వాహనాల పరిస్థితి ఏంటనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక పెట్రోల్ లేదా డీజిల్ బంక్ ప్రారంభించాలంటే ఎనిమిది రకాల అనుమతులు అవసరం. అవేవీ లేకుండానే ఉమ్మడి జిల్లాలో బయోడీజిల్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

ఉమ్మడి జిల్లాలో నిత్యం 40వేల లీటర్ల అమ్మకాలు
సాధారణ డీజిల్ కంటే రూ.10తగ్గింపుతో రైతుల నుంచి డిమాండ్
ఉమ్మడి జిల్లాలో బయోడీజిల్ విక్రయాలు
అనుమతి లేకున్నా పదుల సంఖ్యలో బయో బంక్‌లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)
సాధారణ డీజిల్ కంటే లీటరుపై రూ.10 తగ్గుతుండటంతో రైతులు బయోడీజిల్ వైపు మొగ్గుచూపుతున్నారు. అది ఎక్కడ తయారవుతోంది, నాణ్యత ఎంత, దీన్ని వినియోగిస్తే వాహనాల పరిస్థితి ఏంటనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక పెట్రోల్ లేదా డీజిల్ బంక్ ప్రారంభించాలంటే ఎనిమిది రకాల అనుమతులు అవసరం. అవేవీ లేకుండానే ఉమ్మడి జిల్లాలో బయోడీజిల్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నిత్యం 40వేల లీటర్ల విక్రయాలు సాగుతున్నాయి. పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, అగ్నిమాపక, రోడ్లు భవనాలు, పరిశ్రమలు, పర్యావరణ, ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ విభాగం, ఇలా పలు శాఖలు ఈ విక్రయాలను పరిశీలించాల్సి ఉండగా, వారంతా మౌనం దాల్చడం అనుమానాలను రేకెత్తిస్తోంది. గుంటూరు నుంచి ఉమ్మడి జిల్లా వరకు ఎవ్వరికీ అనుమానం రాకుండా తయారీదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నల్లగొండ జిల్లాలో దామరచర్ల, మిర్యాలగూడ, త్రిపురారం, నిడమనూరు, 14వ మైలు, తిరుమలగిరి, పీఏ.పల్లి, దేవరకొండ, మల్లేపల్లి, మాల్ వరకు బయోడీజిల్ బంక్ లు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో కోదాడ నుంచి హుజూర్‌నగర్, నేరేడుచర్ల వరకు ఇవి దర్శనమిస్తాయి. సిమెంటు ఫ్యాక్టరీలు, రైతుల నుంచి పెద్ద సంఖ్యలో డిమాండ్ ఉండటంతో అత్యధిక భాగం సూర్యాపేట జిల్లాలోనే బయోడీజిల్ విక్రయిస్తున్నట్టు సమాచారం. నిత్యం 40వేల లీటర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి.
లూజ్ డీజిల్ దందా
నార్కట్‌పల్లి-అద్దంకి, హైదరాబాద్-విజయవాడ జాతీ య, రాష్ట్రీయ రహదారులపై డీజిల్ ట్యాంకర్లు, ప్రైవేటు లారీలు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. జిల్లాకు చెంది న వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపుతూ, కల్తీ చేసిన డీజిల్‌ను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. టోల్‌గేట్‌లకు సమీపంలో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. ఈ డీజిల్‌ను రూ.5 నుంచి రూ.10 వరకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో కోట్లలో పెట్టుబడులు పెట్టి అన్ని అనుమతులు తీసుకున్న డీజిల్ బంక్‌ల యజమానులు సేల్స్ లేక దివాళా తీస్తున్నారు. కొన్నేళ్లుగా స్థానిక పోలీసులు, జిల్లా పౌరసరఫరా అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ప్రధాన రహదారిపై అందరికీ కనిపించేలా 25లీటర్ల క్యాన్లు ప్రదర్శించి అక్రమంగా డీజిల్ విక్రయిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదు. ఒక్కొక్కరి ఇళ్లలో కనీసంగా 200లీటర్ల వరకు డీజిల్ నిల్వ చేస్తున్నట్టు తెలిసింది.
అనుమతులు లేకుండానే..
ఒక పెట్రోల్ బంక్ ప్రారంభించాలంటే చెన్నై నుంచి ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ విభాగం వచ్చి పరిశీలించాల్సి ఉంటుంది. దీనికితోడు స్థానిక పోలీసుల అనుమతి అవసరం. పర్యావరణ, వాణిజ్య, పరిశ్రమల, పౌరసరఫరాల శాఖలు అనుమతి ఇచ్చాక కలెక్టర్ నిరభ్యంతర(ఎన్‌వోసీ) పత్రం జారీ చేస్తారు. ఇవేవీ లేకుండానే బయోడీజిల్ బంక్‌లు కొనసాగుతున్నాయి. అసలు ఎక్కడ ఉత్పత్తి అవుతోంది, ఎక్కడి నుంచి స్టాక్ వస్తోందనే అంశాలపై ఏ శాఖ నిఘాపెట్టలేదు. నా ర్కట్‌పల్లి నుంచి గుంటూరుకు స్టాక్ వెళ్తోంది. స్థానికంగా తయారు చేసి విక్రయిస్తే తొందరగా పట్టుబడే అవకాశం ఉండటంతో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి నల్లగొండలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. తొలుత గుమస్తాగా పనిచేసిన అతడు బ్లూకిరోసిన్ దందా తదితర వ్యాపారాలు నిర్వహించి వైట్ కిరోసిన్ డీలర్‌గా అనుమతి తీసుకొని నార్కట్‌పల్లి కేంద్రంగా బయోడీజిల్ తయారు చేస్తున్నాడు. అక్రమ వ్యాపారాలు నిర్వహించే క్రమంలోనే ఒకసారి సూర్యాపేట, మరోసారి నల్లగొండలో పోలీసులకు చిక్కి బయటపడినట్టు సమాచారం. తాజాగా, మరో జిల్లా పోలీసులకు చిక్కడం, లోతుగా విచారణ చేస్తుండటంతో త్వరలోనే భారీ రాకెట్ వివరాలు వెలుగులోకి వస్తాయన్న చర్చ సాగుతోంది.
కల్తీ డీజిల్ తయారీదారులపై కేసు
నార్కట్‌పల్లి: కల్తీ బయోడీజిల్‌ను తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు నార్కట్‌పల్లి ఎస్‌ఐ బి.యాదయ్య తెలిపారు. నల్లగొండకు చెందిన గుండా సంతోష్, నార్కట్‌పల్లి శివారులో మహారాజ ఎంటర్ ప్రైజెస్ సంస్థను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా వైట్ కిరోసిన్, టర్పెంటైన్ ఆయిల్, టిన్నర్, ఎల్‌డీవో, ఎఫ్‌వోను కలిపి కల్తీ డీజిల్‌ను తయారుచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల శాఖ ఆర్‌ఐ సమక్షంలో గురువారం ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీల్లో ఆరు లారీ ట్యాంకర్లు, కొన్ని డ్రమ్ములు, మూడు సబ్‌మెర్సిబుల్ పంప్‌సెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.