ఆ నాలుగు గంటలు

ABN , First Publish Date - 2021-05-21T06:59:48+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌, నాలుగు గంటల సడలింపుతో పట్టణాలతోపాటు, పల్లెల్లోనూ ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చింది.

ఆ నాలుగు గంటలు
భువనగిరిలో రద్దీ

లాక్‌డౌన్‌ సడలింపుతో తెల్లవారుజామునే రోడ్డెక్కుతున్న జనం 

సాధారణ రోజుల్లో ఉదయం 10 దాటితేనే రద్దీ 

మారిన జీవనశైలి

భూదాన్‌పోచంపల్లి, మే 20: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌, నాలుగు గంటల సడలింపుతో పట్టణాలతోపాటు, పల్లెల్లోనూ ప్రజల జీవనశైలిలో మార్పు వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రోజుల్లో వ్యాపారం, ఉద్యోగం, షాపింగ్‌ తదితర పనులన్నీ ఉదయం 10 గంటల తర్వాతే మొదలయ్యేవి. ఉదయం 6 నుంచి 10గంటల వరకు లాక్‌డౌన్‌కు సడలింపు ఇవ్వడంతో అన్ని పనులు తెల్లవారుజామునే ప్రారంభమవుతున్నాయి. నిత్యావసరాలు, కూరగాయలు, దుస్తులు, కిరాణ తదితర కొనుగోళ్లు, వాహనాల మరమ్మతుల లాంటి పనులను సైతం అంతా పొద్దున్నే ముగించుకుంటున్నారు. ఆలస్యమైతే అవసరమైన వస్తువులు దొరుకుతాయో లేవో అనే అందోళనతో అంతా తొందరపడుతున్నారు. గతంలో పని నిమిత్తం బయటికి వెళ్లిన ఇంటి పెద్దకోసం సాయంత్రం వరకు ఆ ఇంటి ఇల్లాలితోపాటు, తల్లిదండ్రులు ఎదురుచూసేవారు. ప్రస్తుతం రోజంతా కుటుంబ సభ్యులు ఇంట్లోనే గడుపుతున్నారు. దీంతో ప్రజల జీవన శైలి పూర్తిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లాక్‌డౌన్‌కు ముందు వ్యాపారం, ఉద్యోగం తదితర పనులన్నీ ఉదయం 10 గంటల తర్వాతే మొదలయ్యేవి. రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఆలస్యంగా నిద్రపోయి ఉదయం బారెడు పొద్దెక్కితేగానీ నిద్ర లేచి విధులకు హాజరయ్యేందుకు లంచ్‌ బాక్సులు సర్దుకుని బయల్దేరి వెళ్లేవారు. సాయంత్రం వరకు కార్యాలయ పని ముగించిన అనంతరం షాపింగ్‌కు వెళ్లేవారు. అవసరమైతే భోజన విరా మ సమయంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేసేవారు. లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక ఈనెల 11వ తేదీ తర్వాత ప్రజల జీవన విధానంలో మార్పువచ్చింది. తెల్లవారక ముందే నిద్రలేచి, బ్యాగులు చేతబట్టి మార్కెట్‌కు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.

సాధారణ రోజుల్లో ఉదయం 10గంటలు దాటాకే షాపింగ్స్‌, హోల్‌సేల్‌ దుకాణాలు, బార్లు, వైన్స్‌, రెస్టారెంట్లు తెరుచుకునేవి. రాత్రి 9గంటల వరకు వ్యాపారాలు నిర్వహించి ఇళ్లకు చేరేవారు. లాక్‌డౌన్‌లో ఈ పరిస్థితి లేదు. దీంతో ముందు బయటి పనులు చూసుకొని ఆ తరువాత ఇంటి పనులు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో అంతా ఉదయమే రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయం అనంతరం ఇంటికి చేరినవారు టిఫిన్‌, లంచ్‌ తరువాత పగటిపూట నిద్రకు ఉపక్రమిస్తున్నారు. మరికొందరు టీవీలకు అతుక్కుపోతుండగా, కొందరు ఇంట్లోనే ఇండోర్‌ గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. గతంలో తల్లిదండ్రులు ఉద్యోగ, వ్యాపారాలకు వెళ్తే, పిల్లలు చదువు కోసం వెళ్లేవారు. వృద్ధులు మాత్రమే ఇంటిపట్టున ఉండేవారు. ప్రస్తుతం అంతా ఇళ్లకే పరిమితమై సందడిచేస్తున్నారు.

నాలుగు గంటలు రద్దీగా రోడ్లు

లాక్‌డౌన్‌ సడలింపు నాలుగు గంటలే ఉండటం తో రహదారులన్నీ రద్దీగా మారుతున్నాయి. ప్రజలు నిత్యావసరాల కోసం ఈ సమయంలో బయటికి వస్తుండటంతో రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. భూదాన్‌పోచంపల్లితో పాటు పల్లెల్లో సైతం పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. 10 తరువాత రహదారులపైకి వచ్చేవారిని కారణాలు తెలుసుకుని పంపిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరిగేవారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. కొందరు మాస్క్‌ లేకుండానే రోడ్లపైకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజుకు 20గంటలు లాక్‌డౌన్‌ విధించినా సడలింపు ఇచ్చిన ఈ నాలుగు గంటల్లోనే కొవిడ్‌ వ్యాప్తి జరుగుతోందనే వాదనలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో అంతా కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-21T06:59:48+05:30 IST